వైసీపీతో లాలూచీ పడితే ఖబడ్దార్.. మీ ఆటలు సాగనివ్వను: Chandrababu Strong Warning | Asianet Telugu
ఎన్డీయే గెలుపు ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి సంజీవనిలా పనిచేస్తోందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఐకమత్యంతో మెలగాలని, ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని కార్యకర్తలను కోరారు. మూడు పార్టీలు ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీయేనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉమ్మడి తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభను ఏర్పాటుచేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయే తరపున విజయం సాధించి ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తలు రాజశేఖరంను అభినందించారు. "2024 సార్వత్రిక ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో, 93 శాతం స్ట్రైక్‌రైట్‌తో గెలిచాం. ఇప్పుడు పోటీ చేసిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఘన విజయం సాధించాం. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శ్రీనివాసులుకు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాం. 2023లో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచాం. ప్రజలకు నమపై ఉన్న విశ్వాసంతో గెలిపించారు. పనిచేసే వారినే ప్రజలు గెలిపిస్తారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును నాదెండ్ల మనోహర్ కేటాయిస్తున్నామని చెప్పగానే ఆలపాటి రాజేంద్ర ఎదురు మాట్లాడకుండా సహకరించారు. నాదెండ్ల మనోహర్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి భారీ మెజారిటీ తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నారు. పార్టీకోసం కట్టుబడి పని చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం" అని చంద్రబాబు తెలిపారు. "రాజధాని అమరావతిని స్మశానం అన్నారు. 3 రాజధాననుల పేరుతో మూడు ముక్కలాటలాడి అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ద్వారా అందించింది. మేం 72 శాతం పనులు పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. 2019లో మళ్లీ మన ప్రభుత్వం వచ్చి ఉంటే 2020కి పోలవరం పూర్తయ్యేది. కానీ గత ప్రభుత్వ చేతకాని తనం వల్ల డయాఫ్రంవాల్ కొట్టుకుపోయింది. విచ్ఛిన్నమైన ప్రాజెక్టును చూసి బాధపడ్డ మొదటి వ్యక్తిని నేను. పండుగపూట కూడా కేంద్రమంత్రిని కలిసి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ఒత్తిడి తెచ్చాను. ఇటీవల కేంద్రం ముందుకొచ్చి రూ.12,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందకు సహకారం ఇచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ మళ్లీ రాదనుకున్నారు. ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, కార్మికశాఖ మంత్రితో ఒకటే చెప్పాను...స్టీల్‌ప్లాంట్ ఏపీ సెంటిమెంట్, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రాజెక్టు కోసం ప్రాణ త్యాగం చేశారని, నిర్లక్ష్యం చేయొద్దని కోరా. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం రూ.11,400 కోట్లు కేటాయించింది. విశాఖ రైల్వే జోన్ వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. రైల్వేజోన్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. తద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి" అని తెలిపారు. కొందరు టీడీపీ, కూటమి నేతలు వైసీపీకి పని చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఎన్డీయే నేతలకు, కార్యకర్తలకు పని చేయాలని... రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని స్పష్టంచేశారు. ప్రజలందరికీ అభివృద్ధి చేస్తామని... కార్పొరేషన్ చైర్మన్లు, ట్రస్ట్ బోర్డుల్లో ఎన్డీయే నాయకులు ఉంటారని... ఆ గౌరవం ఎన్డీయే నాయకులే ఉండాలని వైసీపీతో లాలూచీ పడే నాయకులకు తేల్చిచెప్పారు. మొన్న ఈ మాట చెప్పినందుకు వైసీపీ నేతలు గుంజుకుంటున్నారన్నారు. "వైసీపీ నేతలు లంచాలు ఇచ్చి అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారు... జాగ్రత్తగా ఉండాలి, మీ ఆటలు సాగనివ్వను. మళ్లీ చెప్తున్నా....సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఇస్తాం. దబాయించాలని చూస్తే పగటి కలలే మిగులుతాయ" అని హెచ్చరించారు.