AP Budget: మ్యాటర్ ఎక్కువ మీటర్ తక్కువ.. ఇదేం బడ్జెట్? Margani BharatRam Criticizes | Asianet Telugu
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్దాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్... " ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు? అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్తమౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు" అని మార్గాని భరత్ విమర్శించారు.