ఓవైపు అంగన్వాడీలు... మరోవైపు ఉద్యోగ సంఘాలు... ఆందోళనలతో ఏపీలో ఉద్రిక్తత
అమరావతి : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన 'ఛలో విజయవాడ'ఉద్రిక్తంగా మారింది.
అమరావతి : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన 'ఛలో విజయవాడ'ఉద్రిక్తంగా మారింది. అంగన్వాడీల ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ బయట భారీగా మొహరించిన పోలీసులు వివిధ ప్రాంతాల నుండి రైళ్లలో వచ్చిన అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ కళ్యాణ మండపాలకు వారిని తరలించి నిర్బంధించారు. ఇక బస్సుల్లో విజయవాడకు చేరుకుంటున్న అంగన్వాడీలను అడ్డుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ జీతాలు పెంచాలని, ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఆందోళన చేపట్టిన అంగన్వాడీలను నిర్బంధించడాన్ని సిఐటియు ఖండించింది. ఇదిలావుంటే కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ కదం తొక్కాయి. ఈ మేరకు లక్ష్మీటాకీస్ సెంటర్ నుండి కలెక్టరేట్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి చిలకలపూడి స్టేషన్ కు తరలించారు.