హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేయాలని  కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత  ఏం జరుగుతోంది... ఆ తర్వాత ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకొంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే రాజ్యాంగపరమైన  వ్యవహరాలకు అనుగుణంగా గవర్నర్, అసెంబ్లీ కార్యాలయాలు వ్యవహరించాల్సిన పరిస్థితులు అనివార్యం.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం  ప్రగతి భవన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు  కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో  అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ఏక వాక్య తీర్మానం చేసే అవకాశం లేకపోలేదు.

ఈ తీర్మానం చేసిన తర్వాత  మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్  గవర్నర్ నరసింహాన్ ను  రాజ్‌భవన్ లో కలిసి అసెంబ్లీ రద్దుకు సంబంధించిన  ఏకవాక్య తీర్మానం ప్రతిని  గవర్నర్ కు అందించనున్నారు. 

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ సీఎంగా  కొనసాగాలని  కేసీఆర్ ను గవర్నర్  కోరుతారు.  అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనకు కూడ  సిఫారసు చేసే అవకాశం లేకపోలేదు. కానీ, తెలంగాణలో మాత్రం ఆ రకమైన పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

  వాస్తవానికి  ఈ తీర్మానం కాపీని  అసెంబ్లీ రద్దుకు సంబంధించిన తీర్మానం కాపీని అసెంబ్లీ సెక్రటరీకి పంపుతారు.  ఆ ఫైలుపై  సీఎస్.... ఆ తర్వాత సీఎం సంతకం చేసి పంపుతారు.  దీంతో అసెంబ్లీ సెక్రటరీ  గెజిట్ నోటిఫికేషన్  విడుదల చేయనున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ రద్దు విషయానికి సంబంధించిన విషయాన్ని కేంద్ర హోంశాఖకు  సమాచారాన్ని ఇస్తారు.  కేంద్ర హోం శాఖ ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందించనుంది. ఇది ప్రక్రియగా రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

అయితే తెలంగాణ సీఎం నేరుగా గవర్నర్ ను కలిసి తన అసెంబ్లీ రద్దు గురించి వివరించనున్నారు. ఈ కాపీని గవర్నర్ అసెంబ్లీ కార్యదర్శికి పంపిస్తారు. అసెంబ్లీ సెక్రటరీ పంపే ఫైలుపై గవర్నర్ సంతకం చేస్తారు. దీంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వశాఖకు సమాచారం పంపనున్నారు. ఈ సమాచారాన్ని కేంద్రహోంశాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ పంపనుంది.అయితే ఇవాళ కేసీఆర్ రెండో రకమైన పద్దతిని అనుసరించనున్నారు. 

అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది. అసెంబ్లీ రద్దు తర్వాత కనీసం ఆరు మాసాలలోపుగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే అసెంబ్లీ రద్దైన తర్వాత కొత్త అసెంబ్లీ  ఆరు మాసాల్లోపుగా సమావేశం కావాల్సి ఉంటుంది.దీంతో  వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికలు పూర్తై కొత్త అసెంబ్లీ  సమావేశమయ్యే అవకాశం ఉంది.