Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ డ్రగ్స్ బంధు... చర్లపల్లి జైల్లో ఆ ముఠాలతో పరిచయాలు: జీవన్ రెడ్డి సంచలనం

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్న టిపిసిసి చీఫ్ రేవంత్ పై టీఆర్ఎస్ ఎమ్మల్మే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

trs mla jeevan reddy sensational comments on revanth reddy
Author
Hyderabad, First Published Sep 21, 2021, 2:33 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్(TRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy)పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పియూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి(Jeevan reddy) విరుచుకుపడ్డారు. క్యారెక్టర్ లేని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే అసలు క్యాడరే లేని పార్టీ కాంగ్రెస్(Congress) అని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ సింహం అయితే రేవంత్ రెడ్డి చీకట్లో పొక్కలు తొవ్వే పందికొక్కు అంటూ మండిపడ్డారు. 

''అభివృద్ధి, ఐటికి బ్రాండ్ అంబాసిడర్ మంత్రి కేటీఆర్. ఒక కులవృత్తిని బతికించడానికి మేము ఏనాడే వైట్ ఛాలెంజ్ పెట్టాము. మాకు తెలిసిన వైట్ అంటే తెల్లకల్లు కానీ రేవంత్ రెడ్డికి తెలిసిన వైట్ డ్రగ్స్, గంజాయి. రేవంత్ కు దమ్ముంటే తెలంగాణకు నిధులు రప్పించే ఛాలెంజ్ బీజేపీకి విసురు'' అని సూచించారు. 

''గ్రీన్ ఛాలెంజ్ కు రేవంత్ వైట్ ఛాలెంజ్ కు పోలిక ఎక్కడ? అమెరికాలో పత్రికలో రాహుల్ గాంధీ డోపింగ్ టెస్ట్ లో దొరికాడు అని కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ సీఎంలు కూడా డ్రగ్స్ మాఫియాలో ఉన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన ఏవయినా ఆధారాలుంటే డీజీపీకి పిర్యాదు చేయి. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోం. తెలంగాణ పరువు ప్రతిష్టలను, హైదరాబాద్ ఇమేజిని దెబ్బతీస్తున్న రేవంత్ పై ప్రతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తాం'' అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. 

read more  ట్విట్టర్‌వార్: రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేసిన కేటీఆర్

''తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వున్నా ఇప్పటికీ రేవంత్ చుట్టూ ఉన్నది చంద్రబాబు స్క్రిప్ట్ రైటర్లే. రేవంత్ ను అమర వీరులు కలలో దెయ్యాలై పడతారు. తెలంగాణ లో యువత ఆత్మహత్యలకు రేవంత్ ఉద్యమ ద్రోహమే కారణం'' అని ఆరోపించారు. 

''చంద్రబాబు ఇంట్లో చొచ్చి టీడీపీని ఖతం చేసిన రేవంత్ ఇప్పుడు రాహుల్ ఇంట్లో చొచ్చి కాంగ్రెస్ ను ఖతం చేయడానికి సిద్దమయ్యాడు. పబ్బులు, క్లబ్బులు తెలంగాణలోనే ఉన్నాయా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవా? ముందు మీ రాహుల్ గాంధీని ముంబై పబ్బులకు తీసుకెళ్లి చూయించు'' అని రేవంత్ కు సూచించారు. 

''పేనుకు పెత్తనమిస్తే నెత్తనంతా కొరిగినట్టు వుంది రేవంత్ వ్యవహారం. ఆయన పెత్తనంతో తెలంగాణ కాంగ్రెస్ పని అవుటే. కాంగ్రెస్ సీనియర్లు వాళ్ళ పార్టీని రక్షించుకుంటే మంచిది. మేము దళిత బంధు అంటే రేవంత్ డ్రగ్స్ బంధు అయ్యాడు. జైల్లో అన్ని ముఠాలతో రేవంత్ పరిచయాలు పెంచుకున్నాడు'' అంటూ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios