గద్వాల: ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ స్థానం నుండి  2004 నుండి  ఇప్పటి వరకు  కాంగ్రెస్ అభ్యర్ధి డీకే అరుణ  విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ దఫా మరోసారి ఆమె కాంగ్రెస్ పార్టీ  అభ్యర్ధిగా మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2004 ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి  ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గద్వాల అసెంబ్లీ ఎన్నికల్లో  1999లో టీడీపీ అభ్యర్ధిగా డీకే అరుణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  అంతకుముందు  ఇదే స్థానం నుండి అరుణ భర్త డీకే భరత సింహా రెడ్డి టీడీపీ మద్దతుతో  విజయం సాధించారు. మహాబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి డీకే అరుణ టీడీపీ అభ్యర్ధిగా కూడ పోటీ చేసి ఓడిపోయారు.

2004 ఎన్నికల సమయంలో  కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఐఎం పార్టీల మధ్య పొత్తు ఉంది.పొత్తులో భాగంగా ఈ సీటును  అప్పట్లో టీఆర్ఎస్  కోరుకొంది. కాంగ్రెస్ టికెట్టు ఆశించిన  డీకే అరుణకు టికెట్టు రాలేదు. అరుణతో పాటు ఆ సమయంలో ఉన్న మక్తల్ స్థానం నుండి  అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కింది. చిట్టం నర్సిరెడ్డి మక్తల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. దీంతో డీకే అరుణ  సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధిగా (ఇండిపెండెంట్ గా ) పోటీ చేసి విజయం సాధించారు.

2009లో మరోసారి గద్వాల నుండి ఆమె పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఆమెకు కాంగ్రెస్ టికెట్టు దక్కింది. 2014 ఎన్నికల్లో  కూడ ఆమె కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేసి విజయం సాధించారు. 2009లో  ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు.

డీకే అరుణపై  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గతంలో డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి అనుచరుడిగా ఉండేవాడు. అయితే ఆ తర్వాత డీకే కుటుంబంతో  విభేదించి తొలుత బీకే కృష్ణమోహన్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు.2009లో టీడీపీ అభ్యర్థిగా, 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బీకే కృష్ణమోహన్ రెడ్డి .. డీకే అరుణపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

గద్వాల నియోజకవర్గంలో  డీకే కుటుంబానిదే అధిపత్యం  కొనసాగుతోంది.గద్వాలలో ఆరు దశాబ్దాలు (1957- 2014)గా డీకే కుటుంబమే గెలుస్తూ వస్తోంది. డీకే సత్యారెడ్డి రెండుసార్లు, సమరసింహారెడ్డి నాలుగుసార్లు, భరతసింహారెడ్డి ఒకసారి, అరుణ మూడుసార్లు గెలిచారు. 16సార్లు ఎన్నికలు జరిగితే.. 15సార్లు డీకే కుటుంబ సభ్యులు పోటీ చేసి 10 సార్లు గెలిచారు.

 నియోజకవర్గంలో సుమారు 55 వేల ఓట్లు గద్వాల పట్టణంలోనే ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధించుకుంటే వారినే విజయం వరిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన ఆధిక్యమే అరుణ విజయానికి దోహదపడింది.
 
గత నాలుగున్నర ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వహయంలో    చేసిన అభివృద్దిని టీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధికి తమ కృషే కారణమని  మాజీ మంత్రి డీకే అరుణ, టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ రెడ్డిలు చెబుతున్నారు. 2009 నుండి 2014 వరకు  మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో  తాను  ప్రారంభించిన అభివృద్ధి పనులను  పూర్తి చేసినట్టుగా  అరుణ చెబుతున్నారు.కానీ టీఆర్ఎస్ హాయాంలోనే గద్వాలలో అభివృద్ధి జరిగిందని  కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు.

గద్వాల నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత డీకే అరుణను ఓడించేందుకు టీఆర్ఎస్ తన శక్తియుక్తులను ధారపోస్తోంది. ఈ నియోజకవర్గంలో కొంత కాలంగా హరీష్ రావు  ప్రత్యేకంగా వ్యూహరచన చేశారు. హరీష్ వ్యూహన్ని కృష్ణమోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న డీకే అరుణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నందున డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి కూతురు స్నిగ్ధారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి  డీకే అరుణ.. టీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డికి అత్త .   వీరిద్దరి మధ్య  సమీప బంధుత్వం ఉంది. తొలుత ఈ కుటుంబంతోనే ఉన్నా కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత  కారణాలు ఏవో కానీ, ఆ కుటుంబంతో విబేధించారు.  మూడోసారి అత్తపై  కృష్ణమోహన్ రెడ్డి  పోటీకి దిగుతున్నారు.ఈ సారైనా గద్వాల ఓటర్లు కృష్ణమోహన్ రెడ్డిని కరుణిస్తారా... లేకపోతే జేజమ్మకు జై కొడుతారా  అనేది డిసెంబర్ 11న తేలనుంది.

సంబంధిత వార్తలు

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై 200 పిల్స్ దాఖలు

30 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు: హైకోర్టులో ఈసీ కౌంటర్

డికె అరుణ బండారం బయటపెడతా: స్వరం పెంచిన కేసీఆర్

డిఫెన్స్‌లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...

చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్

చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?