Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. నిజామాబాద్ ఎన్నికల సభ వేదికగా తెలంగాణ సెంటిమెంట్  అస్త్రాన్ని ప్రయోగించారు. 

Kcr starts telangana sentiment issue again in campaign
Author
Hyderabad, First Published Oct 3, 2018, 6:27 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. నిజామాబాద్ ఎన్నికల సభ వేదికగా తెలంగాణ సెంటిమెంట్  అస్త్రాన్ని ప్రయోగించారు.  తెలంగాణను నాశనం చేసిన  చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రధానంగా నిజామాబాద్ సభలో కేసీఆర్ ప్రస్తావించారు.

సెప్టెంబర్ 7వ తేదీన హుస్నాబాద్  ప్రజా ఆశీర్వాద సభ ద్వారా కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇవాళ నిజామాబాద్ లో రెండో సభలో కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దెదించేందుకు టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ మహాకూటమిగా ఏర్పాటయ్యాయి.ఈ పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు చర్చలు సాగుతున్నాయి. ఈ నాలుగు పార్టీలు కామన్ మినిమమ్ ప్రోగ్రాం కోసం కూడ ప్లాన్ చేస్తున్నాయి.

అయితే  గత ఎన్నికల సమయంలో గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని ఎక్కువ సీట్లలో బీజేపీ, టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఒక్క కార్పోరేటర్ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే  గ్రేటర్ పరిధిలోని సెటిలర్ల ఓట్లు టీడీపీతో పొత్తు కారణంగా తమకు కలిసివచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే మరోవైపు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో సెటిలర్ల ప్రభావం ఉంటుంది.

అయితే ఈ నాలుగు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సరిగా జరిగితే  టీఆర్ఎస్ కు ఇబ్బంది తప్పకపోవచ్చు. అయితే గత ఎన్నికల సమయంలో సెంటిమెంట్ టీఆర్ఎస్ కలిసివచ్చింది. తెలంగాణను తెచ్చిందనే కారణంగా టీఆర్ఎస్‌కు ప్రజలు ఆదరించారు.

ఈ నాలుగేళ్ల పాలనలో  టీఆర్ఎస్ ఏం చేసిందనే విషయాలు కూడ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే  ఈ నాలుగు పార్టీలు కూటమిగా పోటీ చేయడంతో కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తెలంగాణను సర్వనాశనం చేసిన బాబుతో పెట్టుకొని అమరావతికి ఆత్మగౌరవాన్ని  తాకట్టు పెడతారా అంటూ కేసీఆర్ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేశారు. ఇంతకాలం పాటు చేసిన పోరాటం ఇక వృధాగా మారే అవకాశం ఉందన్నారు. 

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో తెలంగాణను సర్వనాశనం చేశాడన్నారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని తెలంగాణను బాబుకు తాకట్టు పెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబు అంటూ కేసీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు స్వయంగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి ఉండదన్నారు. ఏ నిర్ణయమైనా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం గులాంగిరికి పరాకాష్టగా కేసీఆర్ ప్రస్తావించారు.

బాబు పాలనలో తెలంగాణ సర్వనాశనం అయిందని కేసీఆర్ గుర్తు చేశారు. స్వంత పాలన నుండి పరాయి పాలనకు తీసుకెళ్లేందుకు బాబుతో కాంగ్రెస్ పార్టీ నేతలు పొత్తు పెట్టుకొన్నారని కేసీఆర్ ఆరోపించారు.ఈ విషయమై  తెలంగాణకు చెందిన మేథావులు ఆలోచించాలని కేసీఆర్ కోరారు. 

తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు చంద్రబాబునాయుడు కుట్ర పన్నారని.... ఇందులో భాగంగానే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబునాయుడు అంటూ కేసీఆర్ ప్రస్తావించారు. 

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులను  అడ్డుకొనేందుకు  ఏపీ ప్రభుత్వం కేసులు వేసిన విషయాన్ని కూడ ఇటీవల కాలంలో  టీఆర్ఎస్ నేతలు  ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు కారణంగా పరస్పరం ఓట్ల బదిలీ జరిగితే రాజకీయంగా టీఆర్ఎస్ కు దెబ్బే. అయితే దీన్ని నివారించేందుకు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ తన అమ్ముల పొదిలో నుండి మరోసారి బయటకు తీశారు.ఇదిలా ఉంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు  అమరావతితో పొత్తు పెట్టుకొంటే తప్పేమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

Follow Us:
Download App:
  • android
  • ios