నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువతిపై  గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు ప్రకటించారు.

ఈ నెల 24వ తేదీన రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్ కు సమీపంలోని రెవిన్యూ భవనంలో ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వాహనాన్ని చూసి నిందితులు పారిపోయారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు.

జిల్లాలోని ఎడపల్లికి చెందిన మహిళ రోడ్డు  ప్రమాదంలో గాయపడింది.ఆమెను చికిత్స కోసం నిజమాబాద్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.  మహిళకు తోడుగా ఆమె సోదరి కూడ ఆసుపత్రిలోనే ఉంది. ఆసుపత్రికి చెల్లించాల్సిన డబ్బుల కోసం స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 24వ తేదీన రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లింది.

రైల్వే స్టేషన్ వద్దే ఉన్న విక్కీ అనే యువకుడు యువతితో మాటలు కలిపాడు. తన సోదరి ఆసుపత్రికి చెల్లించాల్సిన డబ్బుల కోసం వెళ్తున్నట్టుగా ఆమె చెప్పింది. దీంతో ఆమెకు డబ్బులు ఇప్పిస్తానని విక్కీ ఆమెను నమ్మించాడు. 

అతని మాటలను నమ్మిన యువతి అతని వెంట వెళ్లింది. ఆమెను విక్కీ కలెక్టరేట్ కు సమీపంలోని రెవిన్యూ భవనం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే రూమ్ లో బంధించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని  స్నేహితులు కూడ వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీస్ పెట్రోలింగ్ వాహనం సౌండ్ విన్న తర్వాత నిందితులు పారిపోయాయి. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో విక్కీ తో పాటు  గోవింద్, సోహెల్, ధనుష్, ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు చెప్పారు.