తెలంగాణ సిఎం కేసిఆర్ ఒక మశ్చర్ పహిల్వాన్ అని.. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఒక చెంచా అని విమర్శించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. మిగులు విద్యుత్ పేరుతో దేశమంతా యాడ్స్ ఇచ్చుకుంటున్న సిఎం కేసిఆర్ మశ్చర్ పహిల్వాన్ లా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. విద్యుత్ రంగంలో ఇంత గొప్ప అద్భుతాలు సృష్టించామని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

అవార్డులన్నీ కేటిఆరే కొట్టేస్తున్నప్పుడు ఒక్క అవార్డు కూడా జగదీష్ రెడ్డికి రాదా అని ప్రశ్నించారు. కనీసం కప్పు కేటిఆర్ కొట్టేసినా.. చెంచా అవార్డైనా జగదీష్ కు రాదా అని ఎద్దేవా చేశారు. రేవంత్ ఏం మాట్లాడారో కింద వీడియోలో చూడండి.. అలాగే రేవంత్ వెల్లడించిన విద్యుత్ వివరాలు వీడియో కింద చదవండి.

24 గంటల విద్యుత్ పేరుతో తెలంగాణ సర్కారు అవకతవకలకు తెర తీసిందని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో మిగులు విద్యుత్ వైపు పయనిస్తున్నామని అన్నారు. విద్యుత్ రంగంలో ఉన్న అన్ని సంస్థలకు కేసిఆర్ తన బంధువర్గాన్ని నియమించుకున్నారు. రిటైర్ అయిన వారిని కూడా కొనసాగిస్తున్నారు. బయట తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. కేసిఆర్ సర్కారు ఎక్కువ ధరకు విద్యుత్ కొంటున్నది. దీనివల్ల ప్రజలపై అత్యధిక భారం పడుతుందన్నారు. ఒక్కో యూనిట్ కి 1.95 పైసలు చొప్పున ఆ 4,910 మిలియన్ యూనిట్లకు ఈ ప్రభుత్వం 957.45 కోట్లు  స్థిర చార్జీలు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు చెల్లించిందన్నారు.

విద్యుత్ కొనకపోయినా ప్రభుత్వం ఈ 957.45 కోట్లు చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ రంగంలోని సంస్థల విద్యుత్ ఉత్పత్తి పడిపోయిందని ఆరోపించారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇచ్చే కమీషన్ల కోసం ప్రభుత్వ విద్యుత్ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తక్కువ ధరలకు విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ఎక్కువ ధరకు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల దగ్గర కొంటున్నారని ప్రశ్నించారు. దీని వెనకాల ఎలాంటి ప్రైవేట్ ఒప్పందాలు ఉన్నాయి బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

24 గంటల విద్యుత్ పేరిట రాష్ట్రం లో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా, ప్రభుత్వ పెద్దలకు కమిషన్ అందేలా ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నాయని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు కు సంబంధించిన అన్ని ఫైల్స్, ని పేపర్స్ ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు చేయకుండా 957.45 కోట్లు చెల్లించిన దుర్మార్గానికి బాధ్యులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.