మంచిర్యాల జిల్లా కేంద్రంలో గుట్టుగా వ్యభిచారాన్ని సాగిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా వుండే కుటుంబాల ఆర్థిక కష్టాలను అదునుగా తీసుకుని అమ్మాయిలను ఈ వ్యభిచార కూపంలో లాగుతోంది ఈ ముఠా. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం అమ్మాయిలను రప్పించి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మంగళవారం ఇంటిపై దాడి చేశారు. 

మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాసకాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఓ మహిళ వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. స్థానికంగా వుండే అమ్మాయిలకు, వారి కుటుంబ సభ్యులకు డబ్బులు ఆశచూపి వ్యభిచారంలోకి లాగడంతో పాటు బెంగళూరు, చెన్నై నుండి కూడా అమ్మాయిలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తోంది.  ఇక విటులను తీసుకువచ్చేందుకు ఏకంగా కొందరు యువకులకు నెలకు రూ.15వేల జీతం ఇస్తూ నియమించుకుంది. ఇలా భారీ ఎత్తున విటులను ఆకర్షిస్తూ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించిన స్థానిక పోలీసులు ఇవాళ ఆ ఇంటిపై దాడి చేశారు. 

నిర్వహకురాలితో పాటు ఆమెకు సహకరిస్తున్న  దినేష్, రమేష్, అబ్దుల్‌గఫర్, షేక్‌రియాజ్, షేక్‌ఇర్ఫాన్, అబ్బుదల్‌ జబ్బర్, జీషన్‌ఖాన్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఇంట్లో పట్టుబడిని ఇద్దరు అమ్మాయిలను సఖీ సెంటర్‌కు తరలించారు. ఇంట్లో రూ.15 వేల నగదు, ఏడు సెల్‌ఫోన్లతో పాటు భారీగా కండోమ్స్‌ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.