Bilkis Bano Case : జూబ్లీహిల్స్ రేప్ కేస్ నిందితులకు అందుకే బెయిల్ వచ్చింది.. సిల్లీ ట్రోల్స్ పై కేటీఆర్..
జూబ్లీహిల్స్ కేసులో నిందితులకు చట్టపరమైన లొసుగుల వల్లే బెయిల్ వచ్చిందని, అందుకే చట్టాలని సవరించాలని కోరుతున్నామని.. అప్పుడు రేపిస్టులు జైల్లోనే ఉంటారని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం, 7గురి హత్య కేసులో నిందితులను విడుదల చేయడం దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిమీద తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. దీనికి కొంతమంది ఇటీవల హైదరాబాద్ లో మైనర్ అత్యాచారం కేసులో నిందితులకు బెయిల్ దొరకడం విషయం మీద ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిమీద కేటీఆర్ స్పందించారు.
ఈ "సిల్లీ ట్రోల్స్" పై తెలంగాణ మంత్రి కెటిఆర్ ఎదురుదాడికి దిగారు. హైదరాబాద్ కేసులో నిందితులను అత్యంత త్వరగా అరెస్టు చేసి జైలుకు పంపాం’’ అని ట్వీట్ చేశారు. "45 రోజుల తర్వాత, హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది... జువెనైల్ జస్టిస్ యాక్ట్, IPC & CrPCలోని లొసుగుల కారణంగా జూబ్లీహిల్స్ కేసులో రేపిస్టులు బెయిల్‌పై విడుదలయ్యారు" అని ఆయన తెలిపారు.
"అందుకే ఈ చర్యలను సవరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడిక ఏ రేపిస్ట్ బెయిల్ పొందలేడు. దోషిగా తేలితే, మరణించే వరకు జైలులోనే ఉంటారు" అని బిల్కిస్ బానో కేసులో తన వైఖరిని నొక్కిచెప్పారు. అంతకుముందు, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది వ్యక్తులను విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
Bilkis Bano Case : నేరస్తుల విడుదల వార్త విని నమ్మలేకపోయా.. షాక్ అయ్యా.. స్మితా సబర్వాల్
ఖైదీలకు మిఠాయిలు, పూలదండలతో స్వాగతం పలకడంపై ప్రత్యేకంగా స్పందిస్తూ ‘ఇది మన దేశ సామూహిక మనస్సాక్షికి మాయని మచ్చ’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. "ఈ రోజు బిల్కిస్ బానోకి జరిగినది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చు" అని ఆయన ట్వీట్ చేశారు. 2008లో శిక్ష పడినప్పటి నుండి దోషులు జైలులోనే ఉన్నారు. ఈ నిందితుల్లో ఒకరు తమకు బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించడంతో.. దీనిమీద నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు గుజరాత్ రాష్ట్రాన్ని కోరింది. దీంతో రెమిషన్ విధానం ప్రకారం విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.
దాదాపు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల యువతిపై అత్యాచారం.. కేసు విషయానికొస్తే, ఆరుగురిలో ఐదుగురు నిందితులు 18 సంవత్సరాలలోపువారే. వారికి పడే శిక్షలు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ కేసులో వీరికి గత నెలలో బెయిల్ వచ్చింది. మైనర్ కాని సాదుద్దీన్ మాలిక్ కు 61 రోజుల జైలు శిక్ష తర్వాత ఆగస్టు మొదట్లో బెయిల్ దొరికింది. పోలీసు విచారణ ముగిసి, ఛార్జిషీట్ కూడా దాఖలు చేసినందున మాలిక్ బెయిల్ పొందేందుకు అర్హుడని అతని తరపు న్యాయవాది వాదించారు.