హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పద్మావతి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.
హైదరాబాద్:హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహరం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపింది. హుజూర్ నగర్ స్థానం నుండి పద్మావతిని బరిలోకి దింపుతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఉత్తమ్ కు కాంగ్రెస్ సీనియర్లు బాసటగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ల మధ్య గత వారంలో అభిప్రాయబేధాలు బయటపడ్డాయి.
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 21వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఉప ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపుతున్నట్టుగా ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై పార్టీలో చర్చించకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి పేరును ఏకపక్షంగా ప్రకటించారని రేవంత్ రెడ్డి బహిరంంగానే మీడియాకు చెప్పారు. ఈ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కూడ ఆయన డిమాండ్ చేశారు.
రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఉత్తమ్ కే మెజారిటీ సీనియర్లు మద్దతు పలికారు. కాంగ్రెస్ కోర్ కమిటీలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో ఎవరిని అభ్యర్ధిగా నిలిపాలనే విషయమై చర్చ జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
మరో అభ్యర్ధి పేరును పరిశీలించాలని రేవంత్ రెడ్డి ఎందుకు ఈ సమావేశంలో ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. మరో వైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కూడ సీరియస్‌గా తీసుకొంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ సంఘం పరిశీలించింది. ఈ విషయాన్ని ఎఐసీసీకి నివేదించింది.
మరో వైపు ఉత్తమ్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీకి చెందిన కొందరు నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాకు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు పద్మావతికి బదులుగా యూత్ కాంగ్రెస్ లీడర్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వివరాలను కూడ కుంతియాకు అందించినట్టుగా సమాచారం.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు ఏకతాటిపైకి వచ్చారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ ఈ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేలా చేశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహ పలువురు నేతలు సమావేశమయ్యారు.
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై చర్చించారు.పద్మావతిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కొత్తగా పార్టీలో చేరినవాళ్ల సలహాలు అవసరం లేదంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి తీరును సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడ తప్పుబట్టారు. పీసీసీ చీఫ్ అయ్యే స్థాయికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడి తన గ్రాఫ్ ను తగ్గించుకొంటున్నాడని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.పద్మావతిని బరిలోకి దింపితే గెలుపు సులభమని కూడ ఆయన తేల్చి పారేశారు. స్టార్ క్యాంపెయినర్లు అవసరం లేదన్నారు.
మరోవైపు హుజూర్ నగర్ టిక్కెట్టు తనకు ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నేతల చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాకు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి అండ కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసినట్టుగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
మరో వైపు ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన శానంపూడి సైదిరెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ కూడ ఈ స్థానం నుండి పోటీకి రెడీ అంటుంది.
ఇక యురేనియం తవ్వకాల విషయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం విషయమై కూడ కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయబేధాలు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ ను ఏర్పాటు చేసిన సమావేశంలోకి వెళ్లడంపై సంపత్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్వంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రయోజనం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరో వైపు ఈ వ్యాఖ్యలను వి.హనుమంతరావు, రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సంపత్ కుమార్ పై రేవంత్ రెడ్డి ఏకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సెల్పీ ఇవ్వలేదనే కారణంగా సంపత్ కుమార్ ఈ రకమైన విమర్శలు చేశారని చెప్పారు.ఈ వ్యాఖ్యలపై సంపత్ కుమార్ కూడ రేవంత్ కు కౌంటరిచ్చారు.
యురేనియంపై అసెంబ్లీ తీర్మానం
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీన శాసనమండలిలో మంత్రి కెటీఆర్, అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టం చేశారు.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16న తీర్మానం చేసింది. యురేనియం తవ్వకాలను నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకొన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీలో ఈ విషయమై స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
సంబంధిత వార్తలు
హుజూర్‌నగర్ బై పోల్: పోటీకి బీజేపీ సై
ఉత్తమ్ వ్యూహం: ఎల్ రమణకు ఫోన్, మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్
హుజూర్ నగర్ ఉపఎన్నిక: అన్ని పార్టీలకు అత్యంత కీలకం ఎందుకంటే ...(వీడియో)
ఉత్తమ్ సతీమణి గెలుపు తథ్యం, స్టార్ల ప్రచారం అవసరం లేదు: జగ్గారెడ్డి
శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే
హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ
జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే
హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ
