హుజుర్ నగర్ ఉప ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికలకు ప్రకటన విడుదల చేస్తూ, వాటితో పాటే దేశంలోని మరో 64 స్థానాలకు కూడా ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రకటన విడుదల చేసారు. 

అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 24న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ రెండు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సెప్టెంబర్27నే హుజుర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సునీల్ అరోరా తెలిపారు. 

తెలంగాణలోని హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీనితో హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది.