Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కింగ్ పిన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు.. పరారీలో ఉన్న ఎడ్విన్ అత్యుత్సాహం..

హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న డ్రగ్స్ మూలాలు గోవాలో ఉన్నట్టుగా పోలీసులు  గుర్తించారు. మాదక ద్రవ్యాల కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో గోవాలోని హిల్ టాప్ నైట్ క్లబ్ యజమాని జాన్ స్టీఫెన్ డిసౌజా (స్టీవ్)ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Goa Hill Top Night Club owner John Stephen DSouza Arrested by Hyderabad Police
Author
First Published Sep 24, 2022, 11:12 AM IST

హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న డ్రగ్స్ మూలాలు గోవాలో ఉన్నట్టుగా పోలీసులు  గుర్తించారు. మాదక ద్రవ్యాల కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో గోవాలోని హిల్ టాప్ నైట్ క్లబ్ యజమాని జాన్ స్టీఫెన్ డిసౌజా (స్టీవ్)ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై గోవా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అయితే ఇదే కేసులో మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎడ్విన్ నూన్స్ పరారీలో ఉన్నాడు. ఎడ్విన్.. గోవాలో కర్లీస్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. కర్లీస్ రెస్టారెంట్ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా చేస్తున్నాడు. గోవాలో బీజేపీ నాయకురాలు సోనాలి పోగట్ హత్య కేసులో ఎడ్విన్ ఏ17గా ఉన్నాడు. 

హైదరాబాద్ మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి ఎడ్విన్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎడ్విన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అరెస్ట్ తప్పించుకునేందుకు నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండోసారి కూడా నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. 

ఇక, డ్రగ్స్ కేసులో జాన్ స్టీఫెన్ డిసౌజాను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక విషయాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన 600 మంది కస్టమర్లు జాన్ స్టీఫెన్ డిసౌజా కాంటాక్ట్ లిస్టులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరిలో 168 మంది హైదరాబాద్ వారేనని తేలింది. డిసౌజా అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. జాన్ స్టీఫెన్ డిసౌజాకు చెందిన ఏజెంట్లు డ్రగ్స్ ను అమ్ముతుంటారని చెప్పారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. 

హైదరాబాద్‌ హబ్సిగూడ‌లోని కాకతీయ నగర్‌లో నివాసం ఉంటున్న గోవాకు చెందిన కాళీ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించినట్టుగా చెప్పారు. అతడు జాన్ స్టీఫెన్ డిసౌజా సహా ఏడుగురి పేర్లు చెప్పాడని ఆయన పేర్కొన్నారు. కాళీ అందించిన సమాచారం ఆధారంగానే గోవాకు వెళ్లి ఆపరేషన్ చేశామని వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios