Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ క్యాబినెట్ లో ఇద్దరు మహిళలకు చోటు.. వారెవరంటే...

తెలంగాణ మంత్రులుగా ఇద్దరు మహిళలు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఒకరు బీసీ కాగా, మరొకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. 

Dhanasari Anasuya and Konda Surekha get place in Revanth Reddy's cabinet - bsb
Author
First Published Dec 7, 2023, 2:15 PM IST

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. మొదట ముఖ్యమంత్రితో పాటు 11మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మొదటి క్యాబినెట్ లో స్థానం కల్పించడం హర్షించదగిన విషయం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలను మంత్రివర్గంలోకి తీసుకుంటానని రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో తెలిపారు. ఈ మేరకు మరో ఇద్దరు మహిళలకు క్యాబినెట్ లో స్థానం దక్కబోతోంది. వారు ఎవరనేది చూడాలి. 

ఈ విషయంలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అన్యాయమే చేసిందని చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత 2014లో మొదటి సారి అధికారంలోకి వచ్చిన ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను చిన్నచూపు చూశారు. తొలి క్యాబినేట్ లో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. ఒక్క టర్మ్ మొత్తం మంత్రివర్గంలో మహిళలు లేకుండా నడిపించిన ఘనతను సాధించారు. అదే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఒకరు. ఆమె ములుగు నుంచి పోటీచేసి గెలిచారు. సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రేవంత్ రెడ్డికి సన్నిహితురాలిగా పేరుంది. ముందునుంచీ అనుకున్నట్లుగానే సీతక్కకు మంత్రివర్గంలో చోటు దక్కింది. 

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానిక చెందిన కొండా సురేఖకు  కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆమె మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంది. గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. 

ఎన్‌టీఆర్, వైఎస్ బాటలోనే:తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం

ధనసరి అనసూయ అలియాస్ సీతక్క : సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. ఆమె నక్సల్స్ లో పనిచేసినప్పడు సీతక్కగా పేరొందారు. ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసినప్పటికీ అదే పేరుతో ఆమెను ప్రజలు గుర్తించారు. మొదట ఆమె జననాట్యమండలిలో ప్రజా గాయకుడు గద్దర్, విమలక్క లాంటి వారితో కలిసి గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసేవారు. ఆ తర్వాత సాయిధ పోరాటంలోకి వెళ్లారు.1988లో నక్సల్స్ పార్టీలో చేరారు. పూలన్ దేవి రచనల నుంచి ప్రేరణ పొందారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులను జనజీవనస్రవంతిలో కలవమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు.. సీతక్క పార్టీనుంచి బైటికి వచ్చారు. జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత లా చదువుకున్నారు. ఈ క్రమంలోనే 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్ ఇచ్చారు. 

అలా తెలుగు దేశం టికెట్ మీద మొదటిసారి ములుగు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మరోసారి టిడిపి నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో కూడా గెలిచారు. అయితే ఆమె పార్టీలు మారిన నియోజకవర్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అందుకే ఆమెను ములుగు సీతక్క అని కూడా పిలుచుకుంటారు ప్రజలు. 

కొండా సురేఖ : 1995లో మండల పరిషత్ కు ఎన్నికయి ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1996లో పిసిసి సభ్యురాలుగా, 1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారిగా పనిచేశారు. అదే సమయంలో మహిళా శిశు సంక్షేమ కమిటీ,  ఆరోగ్యం, ప్రాథమిక విద్య స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఏఐసీసీ సభ్యురాలుగా ఉన్నారు.

ఆ తర్వాత 2004లో శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. 2009లో పర్కల్ ఎమ్మెల్యేగా గెలిచి.. మరోసారి మహిళ శిశు సంక్షేమం, వికలాంగులు, జువెనైల్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగులు జువెైల్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వైయస్ మృతి తర్వాత.. వైఎస్ఆర్సీపిలో చేరినప్పటికీ ఆ తర్వాత దానికి రాజీనామా చేశారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ లో చేరి 2014లో వరంగల్ తూర్పు నుంచి గెలిచారు.కానీ 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్లో చేరి పార్కల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే మళ్లీ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios