బిఆర్ఎస్ పార్టీకి కవిత దాదాపు దూరమయ్యారు… ఆమె కేసీఆర్ ను కాకుండా ఇంకెవ్వరినీ అధినేతగా అంగీకరించనని అంటున్నారు. దీంతో బిఆర్ఎస్ పగ్గాలు ఆశిస్తున్న కేటీఆర్, హరీష్ రావు ఒక్కటయ్యారు. తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
KTR : కేసీఆర్ కుటుంబ పంచాయితీతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, కొడుకు కేటీఆర్ మధ్య వారసత్వ పోరు నడుస్తోంది. కేసీఆర్ ఇప్పటికే కొడుకుకు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ పగ్గాలు అప్పగించి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. దీంతో చాలాకాలంగా కేటీఆర్, కవిత మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది.. కానీ దీన్ని అన్నాచెల్లితో పాటు బిఆర్ఎస్ వర్గాలు కూడా ఇంతకాలం కొట్టిపారేసాయి. అయితే తాజాగా కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడంతో వీరిమధ్య విభేదాలు బైటపడ్డాయి.
కేసీఆర్ కు తాను రాసిన లెటర్ బయటకురావడం వెనక కుట్ర దాగివుందని కవిత ఆరోపిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ దేవుడు... కానీ ఆయనచుట్టూ దెయ్యాలు చేరాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఇంకెవ్వరి నాయకత్వాన్ని అంగీకరించనని స్పష్టం చేసారు. దీన్నిబట్టి కవిత సొంత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావులు టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కవిత తీరుతో కేటీఆర్, హరీష్ రావు అప్రమత్తమయ్యారు. ఈ ఇద్దరు కలిసే కవితకు చెక్ పెట్టేందుకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. అందుకే కేటీఆర్, హరీష్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరవుతున్నారు. తద్వారా కవిత పార్టీకి దూరమైనా పర్వాలేదు.... తామిద్దరం సమిష్టిగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళతామని సంకేతాలిస్తున్నారు. పార్టీ లీడర్లు కూడా కృష్ణార్జునులు ఒక్కటయ్యారు... ఎవరెన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ విజయాన్ని ఆపలేరంటూ పరోక్షంగా కవితకు కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా మరోసారి బావ హరీష్ రావుపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హరీష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు హాజరైన కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఇలా కేటీఆర్, హరీష్ చాలా సన్నిహితంగా ఉండటం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.

హరీష్ గురించి కేటీఆర్ ఏమన్నారంటే...:
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పవన్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు ఆనాటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు... ఇందులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ ప్రజంటేషన్ ఆరంభించేముందు కేటీఆర్ మాట్లాడుతూ హరీష్ రావును ప్రశంసించారు.
దేశంలో ఏ మంత్రి పనిచేయని విధంగా హరీష్ రావు పనిచేసారని... అందుకు నిదర్శనమే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. చాలా అద్భుతంగా, అతి తక్కువ కాలంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావుదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చాలా కష్టపడ్డారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా ఉన్నారు... అందుకే దీని గురించి ఆయన ప్రతి విషయం తెలుసన్నారు కేటీఆర్. కాబట్టి అందరికీ అర్దమయ్యేలా ఈ ప్రాజెక్ట్ గురించి వివరించాల్సిందిగా తానే హరీష్ రావును కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఆయనకున్న అనుభవం ఎవరికి లేదు... ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చక్కగా వివరిస్తారని కేటీఆర్ తెలిపారు.
అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇప్పుడు నిందలు, దందాలు, చందాలు : కేటీఆర్
సాగునీటిరంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు నీటి పంపకాల విషయంలో తెలంగాణకు ఎలా అన్యాయం జరిగిందో ఆనాడే వివరించారని కేటీఅర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంల్లో ప్రతి క్షణం, ప్రతి చోట ఆయన తెలంగాణకు నీరు తీసుకురావాలని సంకల్పించారని అన్నారు. దాన్ని కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా నిజం చేసిందన్నారు కేటీఆర్.
గతంలో నీళ్ళు, నిధులు, నియామకాలు టాగ్ లైన్ ఉండేది... కానీ కాంగ్రెస్ పాలనలో ఇది మారిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో నిందలు, దందాలు, చందాల పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇదే విధంగా ఉందన్నారు కేటీఆర్.
సుంకిశాల, ఎస్ఎల్బిసి టన్నెల్ కూలినా కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదన్నారు. టన్నెల్ కూలి ప్రాణాలు పోయినా ప్రభుత్వం పట్టించుకోలేదుగానీ మేడిగడ్డ వద్ద చిన్న పిల్లర్ కూలితే దాన్ని రాద్దాంతం చేస్తున్నారన్నారు. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చి పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నాయని... కమిషన్ పేరిట బిఆర్ఎస్ నాయకులను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అరోపించారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది... దీనిపై ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం కమీషన్ పేరిట బిఆర్ఎస్ ను బదనాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి... అందుకే ఈ వాస్తవాలు జనాలకు తెలియాలనే ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
