Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఒకే చెప్పింది. ముగ్గురు లేదా నలుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారం (జూన్ 9న) కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే వారు ఎవరో ప్రకటన చేయనున్నారు. అదే రోజు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

గత కొంత కాలంగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అంశంపై రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా ఉంది. మంత్రి వర్గ విస్తరణ చేయాలని కొంత కాలంగా పలువురు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం చుట్టు తిరుగుతున్నారు. అలాగే, తమ వర్గాలకు మంత్రి పదవులు కావాలనే డిమాండ్లు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాజ్‌భవన్‌ను సంప్రదించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరినట్లు సమాచారం.

ప్రస్తుతం ఖాళీగా 6 మంత్రి పదవులు

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా మొత్తం 12 మంది మంత్రులతో తెలంగాణ క్యాబినెట్ కొనసాగుతోంది. అయితే, గరిష్ఠంగా 18 మంది మంత్రులను నియమించుకోవచ్చని రాజ్యాంగ పరిమితి ఉంది. అంటే ఇంకా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తాజా విస్తరణలో ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని సమాచారం.

మంత్రి పదవి కోసం ఆశావహుల సంఖ్య పెరిగింది

గత ఏడాదిన్నర కాలంగా మంత్రి వర్గ విస్తరణ ఆలస్యమవడంతో, పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. పలువురు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవికి డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ నేతలు తమకు అవకాశమివ్వాలంటూ సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిశారు. పార్టీకి ఇటీవల ఇన్‌ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ మంత్రిపదవులు విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో కలసి విస్తరణపై చర్చలు సైతం జరిపారని సమాచారం.

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో ఆ వర్గాలకే ప్రాధాన్యత

ప్రస్తుతం చేయబోయే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ముదిరాజ్ వర్గాని ఒక మంత్రి పదవి దక్కే అవకాశముంది. సమాజిక వర్గాలు, ప్రాంతీయ సమతుల్యత, కుల సమీకరణలతో పాటు పార్టీకి సేవల ప్రామాణికత ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వనున్నారని సంబంధిత వర్గాల్లో టాక్ నడుస్తోంది.