జూబ్లిహీల్స్ బీఆర్ఎమ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్నిరోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోన్న ఆయ‌న ఆదివారం తెల్ల‌వారు జామున మృతి చెందిన‌ట్లు వైద్యులు అధికారికంగా ప్ర‌క‌టించారు.

బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (వయసు 62) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆదివారం ఉద‌యం (జూన్ 8) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందారు.

గత గురువారం (జూన్ 5) సాయంత్రం ఆయనకు తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం, గోపీనాథ్‌కు కార్డియాక్ అరెస్టు రావడం, సీపీఆర్‌ ద్వారా గుండె తిరిగి కొట్టడం జరిగింది కానీ, ఆపస్మార స్థితిలోనే ఉండిపోయారు. చివరికి ఆరోగ్యం విషమించి ఆదివారం ఉదయం క‌న్నుమూశార‌ని తెలిపారు.

మాగంటి గోపీనాథ్‌ రాజకీయ ప్రస్థానం

మాగంటి గోపీనాథ్ మూడుసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిని ఓడించి రెండోసారి విజయం సాధించారు.

రాజకీయాల్లో చురుకునైన పాత్ర

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ను ఓడించి హ్యాట్రిక్‌ గెలుపుతో త‌న సత్తా చాటుకున్నారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన గోపీనాథ్‌ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్‌కి బలమైన నాయకుడిగా ఎదిగారు. తన నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ని బ‌ల‌ప‌రించేందుకు ఎంతో కృషి చేశారు. ఇలా రాజకీయాల్లో త‌న‌దైన ముద్ర వేసి గోపినాథ్ అకాల మ‌ర‌ణాన్ని ఆయ‌న‌తో సాన్నిహిత్యం ఉన్న రాజ‌కీయ నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.