ఫలితాలు రాగానే ఇంటర్మీడియట్ విద్యార్థులు బలవంతంగా ఉసురు తీసుకుంటున్న వైనం ఈసారి కూడా చూశాం. ఈ మరణాలు కేవలం ఆయా కుటుంబాలను మాత్రమే కాకుండా సమాజాన్నే జ్వరపీడితులుగా చేసేట్లు ఉన్నాయి. అసలు తప్పు ఎవరిది... ఈ కథ చదవండి.

"ఏందమ్మా మార్కులు తక్కువొస్తున్నాయి?" అడిగాడు తండ్రి రాంరెడ్డి కూతురు లతను. వంటింట్లోంచి పరుగు పరుగున బయటకు వచ్చిన తల్లి సుశీల కూడా “ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసా? చదవకపోతే ఎలా?” అని ప్రశ్నించింది. బ్యాగ్ టేబుల్ మీద గిరాటు వేస్తూ ముఖం చిట్లించింది లత.

“మాట్లాడవేం?” కసురుకుంది తల్లి. “మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాం" అన్నాడు తండ్రి. లత మాట్లాడలేదు. మంచం మీద పడిపోయింది.

“నోరు తెరిస్తే ముత్యాలు రాలుతాయా?” రెట్టించింది సుశీల. అయినా మాట్లాడలేదు లత.

“నాన్న అంత ఇదిగా అడుగుతుంటే సమాధానం చెప్పాలని కూడా లేదేం?” అంది సుశీల.

“ఎందుకమ్మా చంపుతారు? ఇంట్లో అడుగు పెట్టానో లేదో ప్రశ్నలతో చంపేస్తారు. ఇంటికి రావాలా, వద్దా?” అంది విసుగ్గా లత.

“అదేంటే, నీ కోసమే కదా ఇదంతా చేస్తోంది. అడగకూడదా? మేం అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? ఎన్ని పైసలు గుమ్మరిస్తున్నామో నీకేమైనా పట్టిందా?” అంది తల్లి.

“ఇది ఎందుకొచ్చిందనుకుంటున్నారా? ఉండమంటే ఉంటా, లేదంటే వెళ్లి పోతా. ప్రశాంతంగా ఉండనియ్యరెందుకు?” అంది లత మంచమ్మీద నుంచి లేస్తూ.

“నిన్ను ఏమన్నానని అంత చిరాకు? చదవాల్సిన బాధ్యత నీకు లేదా? విజయవాడ వచ్చి చెప్పిన విషయాలన్నీ గాలికి వదిలేశావ్ కదా" అన్నాడు తండ్రి.

"ఇంకా ఏమనాలి? ఓ మూడు రోజులు ప్రశాంతంగా ఉండిపోదామని వస్తే మీ సోది మీదేనాయే" అంటూ బయటకు విసురుగా వెళ్లిపోయింది. ఆ కాలేజీలకు సెలవులుండేవే తక్కువ. దసరా అని చెప్పి ఓ నాలుగు రోజులు సెలవులిస్తే ఇంటికి వచ్చింది లత.

టెన్త్ లో ఆరువందలకు 540 మార్కులు తెచ్చుకుంది లత. మేథమేటిక్స్ లో 99 మార్కులొచ్చాయి. రాంరెడ్డి, సుశీల దంపతుల ఆనందానికి అవధుల్లేవు. నల్లగొండలోని ఒక స్కూల్ టీచర్ కూతురు అన్ని మార్కులు సంపాదించిందంటే ఆశ్చర్యమే మరి. దీంతో అతను ఇంజనీర్ ను చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. ఆలోచన వచ్చిందే తడవుగా విజయవాడలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఎంపిసిలో చేర్చారు. మెరిట్ స్టూడెంట్ కాబట్టి కాలేజీ యాజమాన్యం ఫీజులో కొంత రాయితీ ఇచ్చింది. అయినా నలభై వేల రూపాయల దాకా చెల్లించాల్సి వచ్చింది. ఒక స్కూల్ టీచర్ కు ఇంత పెద్ద మొత్తమంటే చిన్న విషయమేమీ కాదు. దీనికి వెనకాడితే బిడ్డ భవిష్యత్తు దెబ్బ తింటుందని భావించి వేసిన చిట్టీలను ఎత్తి, కొంత అప్పు తెచ్చి ఫీజు కట్టాడు రాంరెడ్డి. బిడ్డ ఇంజనీరయితే ఏ అమెరికా సంబంధమో దొరుకుతుందనేది అతని ఆశ. అందులోనూ ఇంజనీరింగ్లో కంప్యూటర్స్ కోర్సు అయితే మరీ మంచిదనేది అతని ఆలోచన. అమెరికాలో వుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు సరైన సంబంధాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారట. ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలను ఎదురు కట్నం ఇచ్చినంత పనిచేసి పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకుపోతున్నారు. తమ కులంలో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉందట. చదువుంటే అందం లేక, అందం వుంటే చదువు లేక అమెరికాలోని తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇబ్బందులు పడుతున్నారు. తమ అమ్మాయి బంగారు బొమ్మ. బంగారానికి పరిమళం అబ్బినట్లు చదువు కూడా బాగానే వుంది. టెన్తలో మాదిరిగానే అమ్మాయి ఇంటర్లో బాగా చదివి, ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ సీటు సంపాదించుకుంటే తమ కష్టాలు గట్టెక్కినట్లేనని రాంరెడ్డి అనుకుంటున్నాడు. అందుకే ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కాలేజీలో చేర్పించాడు కూతరు లతను.

విజయవాడలో చదవడానికి చాలా ఉత్సాహం ప్రదర్శించింది లత. ర్కెలొచ్చిన పక్షిలా ఎగిరి గంతేసింది. కాలేజీలో స్టడీ అవర్స్, టీచింగ్ క్లాసులు, ఎగ్జామ్స్ అవర్స్ ఉంటాయి. రోజుకో ఎగ్జామ్ జరుగుతుంది. వాటి రిపోర్టులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు పోస్ట్ చేస్తారు. మొదట్లో లతకు బాగానే మార్కొలొచ్చాయి. ఆ తర్వాతే క్రమంగా తగ్గడం ప్రారంభించాయి. ఈ మార్పు ఎందుకు వచ్చిందో తలిదండ్రులకు అర్ధం కాలేదు.
 
ఉండబట్టలేక ఓసారి విజయవాడ వెళ్లారు తలిదండ్రులు. లతను కలిశారు. లత ముఖంలో మునుపటి తేజం లేదు. అప్పటి చురుకుదనం లేదు. ముఖం పాలిపోయినట్లుగా ఉంది. బక్కపల్చగా తయారైంది. అయినా తలిదండ్రులు పట్టించుకోలేదు. కనీసం ఎలా వున్నావని కూడా అడగలేదు.

“మార్కులెందుకు తక్కువొస్తున్నాయి?” అని అడిగింది తల్లి. “చదవడం లేదా?” అని అడిగాడు తండ్రి. “చదువుతున్నాను' అని సమాధానం చెప్పింది లత.

“చదివితే మార్కోలెందుకు తక్కువొస్తాయి?” తండ్రి కాస్త బాధగా, కాస్త కటువుగా.

తలొంచుకుంది లత. ఒక్క మాటా మాట్లాడలేదు.

“కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. నైంటీ పర్సెంట్ మార్కొలొస్తే కూడా ఎవరూ కానడం లేదు. చదవాల్సిన టైమ్లో చదవకపోతే లాభం లేదు. మిగతా వారికి నీకన్నా ఎక్కువ మార్కులొస్తుంటే నీకే ఎందుకు రావడం లేదు? కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుకోవాలి” అని ఉపన్యాసం ఇచ్చాడు రాంరెడ్డి. ఆ మాటలన్నీ లత శ్రద్దగా విన్నట్లే అనిపించింది. చెప్పాల్సిందంతా చెప్పేసి తిరిగి వచ్చారు. అయినా పెద్దగా ఇంప్రూవ్ మెంట్ కనిపించలేదు. | రాంరెడ్డి, సుశీలల బాధ చెప్పతరం కాదు. ఇంటర్మీడియట్ క్రూసియల్. ఇంటర్లో చదువు మీదే భవిష్యత్తంతా ఆధారపడి వుంటుంది. అది లైఫ్లో టర్నింగ్ పాయింట్. లత టెన్త్ వరకు బాగానే చదివింది. ఇప్పుడెందుకు చదవడం లేదు? ఊరుగాని ఊరుకు పంపించి పొరపాటు చేశామా అని కూడా ఆలోచించారు. టెన్త్ లో ఎన్ని మార్కులొస్తే ఏమిటి, ఇంటర్లో రావాలి. అది వారి మథనం. పలుమార్లు లతకు ఉత్తరాలు రాశారు. ఏ మాత్రం ఫలితం కనిపించలేదు. దీంతో వారికి అసహనం పెరిగిపోసాగింది. అది లతను సాధించే స్థాయికి చేరుకుంది. లతపై అంతకు ముందున్న ప్రేమ, అభిమానం వారికి తగ్గసాగాయి. ఈ విషయాన్నివారు గుర్తించలేదు కూడా. ఒకే ఒక కూతురు పనికి రాకుండా పోతుందేమోనని వారి బాధ. అంతకు మించి వారు ముందుకు ఆలోచించలేకపోతున్నారు.

లెక్కలేనట్లు బయటకు దారితీసిన లతను సుశీల రెక్క పట్టుకుని వెనక్కి లాక్కొచ్చింది. “నిన్ను ఏమన్నామనే నీకంత కోపం?" అంది సుశీల బాధగా.

ఏమనాలో, ఏం చేయాలో రాంరెడ్డికి అర్థం కాలేదు. “మా బాధను అర్ధం చేసుకోవేందే?!” అని మాత్రమే అన్నాడు.
లత ఏమీ మాట్లాడలేదు.

“సరేలే. తర్వాత మాట్లాడుదాం. అది ఎప్పుడు బయలుదేరిందో, ఏమైనా తిన్నదో లేదో? స్నానం చేశాక ఇంత అన్నం పెట్టు" అని భార్యతో చెప్పాడు రాంరెడ్డి అప్పుడే గుర్తొచ్చినట్లు.

“స్నానం చేసి బట్టలు మార్చుకో!" అంది సుశీల కూతురితో. ఆ మాటలను పట్టించుకోకుండా లత మంచం మీద ఒరిగింది.
“చెప్తున్నది నీకు కాదా?" అని కసురుకుంది తల్లి.

“లేమ్మా! లేచి స్నానం చేస్తే ఒళ్లు కొంచెం తేలికవుతుంది” అని బుజ్జగిస్తున్నట్లు చెప్పాడు తండ్రి. లత లేచి బాత్రూమ్ కు దారితీసింది.

ఇంట్లో ఒక రకమైన గ్లూమీ అట్మాస్ఫియర్ చోటు చేసుకుంది.సుశీల భర్త దగ్గరకు వచ్చి - “ఎలాగండీ? అది ఇట్లా తయారైంది!” అని అడిగింది బాధగా.

“నాకదే అర్ధం కావడం లేదు. మన బాధను అది అర్ధం చేసుకోవడం లేదు" అని అన్నాడు అంతే బాధగా.

"మనం చెప్పేది దాని కోసమే. దానికెందుకు అర్థం కావడం లేదు?" అని మరో ప్రశ్న వేసింది.

"ఇది అర్ధం చేసుకోలేని వయసేం కాదు. మరెందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదు" అన్నాడు. "ఇంతకు ముందు చలాకీగా వుండేది బిడ్డ. ఇలా అయిపోయిందేమిటా అని నా బాధ. దాని కోసమే నేనింకా బతికి వుంది” అంది.

“నీదింకో రకమైన ఏడు. జీవితమంతా అయిపోయినట్లు మాట్లాడతావు. నేనేదో నిన్ను కష్టపెడుతున్నట్లు ఇప్పుడే చచ్చిపోతానన్నట్లుంటుంది నీ ధోరణి” అన్నాడు విసుగ్గా, బాధగా.
“నా బాధ నాది” అంది.

ఇంతలో లత స్నానం చేసి వచ్చింది. ముగ్గురూ తినడానికి కూర్చున్నారు. ఎవరూ మాట్లాడటం లేదు. లతను గమనించాడు రాంరెడ్డి, ఏరుకుంటూ ఒక్కొక్క మెతుకు తినసాగింది. తినడంలో కూడా ఆమె ఇంటరెస్టు చూపకపోవడం రాంరెడ్డిని ఆశ్చర్యపరిచింది. లతకు ఏమైందో అతనికి అర్థం కావడం లేదు. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుంది. నిజానికి లత దీర్ఘంగానే ఆలోచిస్తోంది.

“ఏమిటమ్మా, ఏదో ఆలోచిస్తున్నావు?” అని అడిగాడు మృదువుగా.

“ఏమిటో నాన్నా! నాకే అర్థం కావడం లేదు. ఎంత చదివినా ఏదీ గుర్తుండటం లేదు” అంది లత.

"చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్లుంటే ఎలా గుర్తుంటుంది?!” అంది సుశీల చిరాగ్గా...

లత ముఖం మాడ్చుకుంది. ఇక ఏమీ మాట్లాడలేదు. ఏదో తిన్నానని అనిపించి లేచింది. లత వెళ్లిపోయాక, “ఎందుకే దాన్నలా కసురుకుంటావు?” అని నొచ్చుకున్నాడు రాంరెడ్డి..

“నీదో చోద్యం. చదివితే గుర్తుండటం లేదట. దాని మాటలు నమ్మాలి' అంది వెటకారంగా. ఏమీ మాట్లాడకుండా తిని లేచాడు రాంరెడ్డి. లత తినేసి బెడ్రూమ్లోకి వెళ్లి పడుకుంది. రాంరెడ్డి బయటకు వెళ్లాడు. సుశీల ముందు రూమ్లోనే కింద చాప వేసుకుని నడుం వాల్చింది.

సాయంత్రం లేచేసరికి బెడ్రూంలో లత మాలతితో ముచ్చట్లు పెడుతుండటం గమనించింది సుశీల. మాలతి రావడం సుశీలకు ఏ మాత్రం నచ్చలేదు. రూమ్లోకి వెళ్లి మాలతి వైపు అదో రకంగా చూసింది. మాలతి పట్ల తల్లి ప్రదర్శిస్తున్న ఏవగింపును లత గమనించింది. మాలతిని తల్లి ఎందుకు అసహ్యించుకుంటుందో లతకు అర్థం కాలేదు. అది గమనించిన మాలతి లేచి  బయలుదేరడానికి సిద్ధపడింది. మాలతితో పాటు లత లేచి నిలబడింది. బయటకు వచ్చి చెప్పులు వేసుకుని బయలుదేరింది. 
"ఆ దొమ్మరిదానితో దీనికేం పనో?" అని తల్లి అనడం లత చెవిని దాటి పోలేదు. మాలతిని అమ్మ ఎంత ఇష్టపడేది? ఇలా మాట్లాడుతుందేమిటి అని బాధపడింది. లత. మాలతి ఎక్కడ మనసు నొచ్చుకుంటుందోనని గింజుకుంది. “నేను పోతాలేవే" అంది మాలతి. అయినా వినకుండా మాలతితో నడిచింది లత.
మాలతి ప్రేమ వ్యవహారం లతకు తెలుసు. మాలతే చెప్పింది. 

కాలేజీలో రాచి రంపాన పెడుతున్న వైనాన్ని, తనకు మార్కులు రాకపోవడం వల్ల తన పట్ల తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరును లత చెప్పితే- “నీది చాలా చిన్న ప్రాబ్లమే. నేను పెద్ద చిక్కుల్లో పడ్డా' అంటూ మాలతి తన ప్రేమ వ్యవహారాన్నంతా చెప్పింది. అతను మాదిగ కుర్రాడట. బాగానే చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మాలతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. మాలతి ఇంట్లోనే ఒప్పుకోవడం లేదు. "కులం కానివాడ్ని చేసుకుంటే మేం ఊళ్లో ఉంచాలా, వద్దా? వాడు మరో ఊరోడైనా ఎట్లాగో సరిపెట్టుకునేటోళ్లం' అని మాలతి తల్లిదండ్రులు, అన్నలు అంటున్నారట. తనకు మాలతిలో ఏ తప్పు కనిపించలేదు. తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటా నంటోంది. ఇందులో తప్పేముంది అనుకుంది. అందుకే మాలతిని తల్లి ఈసడించు కోవడం నచ్చలేదు లతకు. తల్లి అదే మాట పది మందిలో అంటే ఆ కులంవాళ్లు. ఎంత రభస చేస్తారో అని అనుకుంది. సమాజం మారింది. ఏ కులం వాళ్లు కూడా తమ కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోవడం లేదు.

ఎంతో బతిమిలాడితే తప్ప ఇంటికి పంపడానికి కాలేజీ ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇంట్లో కాస్త ప్రశాంతంగా, హాయిగా గడిపి తిరిగి వెళ్లిన తర్వాత చదువు మీద మనసు పెట్టాలని అనుకుంది లత. కానీ ఆ ప్రశాంతత ఇక్కడ లభించడం లేదు. పైగా మరింత చిరాగ్గా వుంది. తలిదండ్రుల ప్రవర్తన అడుగడుగునా బాధిస్తోంది. నా చదువు తప్ప నేను వీరికి అవసరం లేనట్లే వ్యవహరిస్తున్నారు' అని బాధపడింది. మాలతి విషయంలో ఆమె తల్లిదండ్రులు వ్యవస్తున్న తీరు, తన చదువు విషయంలో తన తలిదండ్రుల తీరు లతకు మింగుడు పడడం లేదు. గుండెను మెలిపెడుతున్న బాధ. వీరెందుకు అర్ధం చేలో నీ ముకుంది. ఇu టి నుంచి మంచి చూర్పులు తెచ్చుకుంటానని తాను చెప్పినా వారి ప్రవర్తన మారడం లేదు. ఎవరి కోసం చదవాలి? వాళ్ల కోసమా? నా కోసమా? అనే ప్రశ్నలు వేధించసాగాయి. ఇంట్లో కూడా రోజులు గడవడమే కష్టమనిపించిందామెకు.

లత మరింత ముభావంగా మారిపోయింది. రాంరెడ్డికి గానీ, సుశీలకు గానీ ఇదంతా పట్టినట్లు లేదు. నిజానికి వారు కూడా విపరీతంగా బాధపడుతున్నారు. అందుకే వారు కూడా ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. ముగ్గురూ ఎవరికి వారు కలిసి వుంటూనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. సుశీల తన కోపాన్ని బయటకు మాటల రూపంలో వెళ్లగక్కడం ద్వారా కొంత మేరకు ప్రశాంతత పొందుతున్నదేమో!

మర్నాడు పొద్దున రఘు ఫోన్ చేశాడు లతకు. లత ఫోన్లో మాట్లాడు తున్నంత సేపూ సుశీల అక్కడక్కడే తిరుగుతూ గొణగడం ప్రారంభించింది. లతకు తల్లి ప్రవర్తనకు చిరాకేసింది. అయినా పట్టించుకోకుండా రఘుతో మాట్లాడసాగింది. ఓ గంట తన చదువు గురించి మాట్లాడి, అతని చదువు గురించి ఎంక్వైరీ చేసింది. రెండు మూడు సార్లు గట్టిగా నవ్వింది కూడా. అంతసేపు తల్లి పనులు చేసే పద్దతి ద్వారా తన వ్యతిరేకతను కనబరుస్తూనే వున్నది. ఫోన్ పెట్టేయగానే ఇక ఏ మాత్రం తట్టుకోలేనట్లు - "వాడితో ఆ వికవికలు, పకపకలు ఏందే?” అని అడిగింది విసురుగా. తల్లితో మాట్లాడటం కూడా అనవసరమనిపించింది లతకు. తల్లి మాటలను పట్టించుకోకుండా వెనుదిరిగే ప్రయత్నం చేసింది. బాత్రూంలోంచి బయటకు వచ్చిన రాంరెడ్డి “ఏమైందే?” అని అడిగాడు చిరాగ్గా.

“ఇంకేం కావాలి? దానికి నా గోడు పట్టదు. చెడు స్నేహాలు మాత్రం కావాలి. దాని పద్దతి నాకేం నచ్చడం లేదు" అంది. రాంరెడ్డి మాట్లాడలేదు. లత అక్కడి నుంచి వెళ్లిపోయింది. “నీ ఇష్టం. నీ బిడ్డ ఇష్టం. దాన్నెట్లా దారిలో పెడతావో పెట్టు. నాకైతే తెలియదు” అంది..
 
మాలతి విషయంలో తల్లి పద్దతికే బాధపడుతున్న లత రఘుతో తాను ఫోన్లో మాట్లాడటంపై ప్రవర్తించిన తీరుకు మరింత బాధపడింది. ఎంత తొందరగా ఇంటి నుంచి బయటపడితే అంత బాగుండునని అనిపిస్తోంది. సెలవులు చాలా భారంగా గడిచాయి. విజయవాడకు తిరిగి వెళ్లింది లత మరింత బాధను గుండెలో మోస్తూ, ఫోన్ రింగవుతోంది. మంచి నిద్ర పాడయింది అని చికాకు పడుతు ఫోన్ దగ్గరకు వెళ్లాడు రాంరెడ్డి. ఇంకా తెల్లవారలేదు. వాల్ క్లాక్ వైపు చూశాడు. నాలుగున్నర అవుతున్నది. ఈ టైమ్లో ఫోన్ చేసేవారెవరున్నారని అనుకుంటూ రిసీవర్ ఎత్తాడు. నిద్ర ఎగిరిపోయింది. ముఖంలో రంగులు మారాయి. ఏదో జరిగి వుంటే తప్ప వెంటనే వచ్చేయండని చెప్పరని అతనికెందుకో అనిపిస్తున్నది. లత చదువుతున్న కాలేజీ నుంచి వచ్చిందా ఫోన్. 

“లతకేమైనా అయిందా?” అని అడిగాడు అతను ఆతురతగా..

“ఏమీ కాలేదు. మీరు వెంటనే వచ్చేయండి” అని మాత్రమే అవతలి వ్యక్తి. ఏమీ కాకపోతే వెంటనే రమ్మని ఎందుకు చెప్తాడని అనుకున్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా తన వద్దకు రాకపోవడంతో సుశీల లేచింది. “ఫోన్ ఎక్కడి నుంచి?” అని అడిగింది. రాంరెడ్డి ఏమీ చెప్పకుండా ముఖం మీద నీళ్లు పోసుకుని బట్టలు మార్చుకుంటున్నాడు. మాట్లాడడానికి కూడా భయమేసింది రాంరెడ్డికి. సుశీల మనసు కీడు శంకించింది. “ఎక్కడికీ?” అని అడిగింది.

“విజయవాడకు. కాలేజీ నుంచి ఫోన్. వెంటనే రమ్మన్నారు' అని చెప్పాడు పొడిపొడిగా. తానూ వస్తానని తయారు కాసాగింది సుశీల. వద్దని గానీ, రమ్మని గానీ అనలేదు రాంరెడ్డి. ఇద్దరూ ఇంటికి తాళమేసి బస్టాండ్ కు నడిచారు. ఒక్క క్షణం ఆలస్యాన్ని కూడా రాంరెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే బస్సెక్కేశారిద్దరు. విజయవాడ బస్టాండులో దిగి నేరుగా ఆటోలో కాలేజీకి వెళ్లారు. కాలేజీ సంతాపం ప్రకటిస్తున్నట్లుగా ఉంది. ఎక్కడా సందడి, హడావిడి లేదు. ఎదురు కాబోయే పెను ప్రమాదాన్ని ఆ కాలేజీ సూచిస్తున్నట్లనిపించింది.

"నాకెందుకో భయమేస్తున్నది” అంది సుశీల. రాంరెడ్డి మాట్లాడలేదు. నల్లగొండ నుంచి కాలేజీలో అడుగు పెట్టేవరకు భార్యాభర్తలు మాట్లాడుకోలేదు. ఏదో పెను ప్రమాదమే సంభవించిందని వారి మనసులకెందుకో అనిపిస్తోంది.

అటెండర్ ఎదురు వచ్చి వారిని తనతో రమ్మన్నాడు. ఎక్కడికని చెప్పలేదతను. వారు అడగలేదు. నేరుగా ఆస్పత్రికి తీసికెళ్లాడు. 

“యాక్సిడెంట్ ఏమైనా అయిందా?" అని అడిగాడు రాంరెడ్డి అటెండర్ను. అటెండర్ ఏమీ చెప్పలేదు. అటెండర్ ముఖంలో ఎక్కడ లేని విషాదం కనిపిస్తున్నది. కాలేజీ కరస్పాండెంట్ ఎదురు వచ్చి ఓ గదిలోకి తీసికెళ్లాడు. బెడ్ పై శవం. నిండా కప్పి ఉంది. జరిగిందేమిటో అర్దం కాలేదు కానీ తన కూతురిక లేదనే విషయం రాంరెడ్డికి తెలిసిపోయింది. సుశీల బోరమని ఏడ్వసాగింది. రాంరెడ్డి బెడ్ దగ్గరకు వెళ్లి పైన కప్పిన బట్ట తీసి ముఖం చూశాడు. శవం మీద పడి బోరుమన్నాడు. సుశీల రాంరెడ్డి పై కుప్పకూలినట్లుగా పడిపోయింది. వారి దుఃఖం చెప్పనలవి కాకుండా ఉంది. కరస్పాండెంట్, మరో ఇద్దరు కలిసి రాంరెడ్డిని బలవంతంగా లేవదీశారు. “మా తప్పేం లేదు సార్” అన్నాడు కరస్పాండెంట్. జేబులోంచి ఓ కాగితం తీసి ఇచ్చాడు. దాన్ని రాంరెడ్డి తీసుకుని చదవడానికి ప్రయత్నించాడు. అక్షరాలు మసక మసగ్గా కనిపించసాగాయి. కళ్లు తుడుచుకుని చూశాడు. తన కూతరు స్వయంగా చేతితో రాసిన ఉత్తరం. ఎలాగో తమాయించుకుని చదవసాగాడు.

అమ్మానాన్నలకు,

మానసికంగా నేను హత్య చేయబడ్డాను. మనసు చచ్చిపోయాక ఈ శరీరం ఉండటం అనవసమరని అనిపించింది. నా చావుకు మీరేం బాధపడవద్దు. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. మీ కలలు నిజం చేయనందుకు నన్ను క్షమిస్తారు కదూ!

-మీ కూతురు, లత 

ఆ వాక్యాలను మళ్లీ మళ్లీ చదివాడు. చాలా సేపు అలాగే నిలబడి పోయాడు. రాంరెడ్డి భారంగా అడుగులేస్తూ కాలేజీ వాళ్లను తిడుతూ పెద్దగా ఏడుస్తున్న సుశీల వద్దకు వెళ్లాడు. ఆమెను కౌగలించుకుని బోరుమన్నాడు. కొద్ది సేపటికి తమాయించుకుని సుశీల కళ్లు తుడిచి గుండెకు హత్తుకున్నాడు. “వదు సుశీలా!'' అంటూ అనునయించాడు. "లత చచ్చిపోలేదే. మనం చంపుకున్నాం. చేతులారా చంపుకున్నాం. ఎవరిని తిట్టి ఏం లాభం చెప్పు. తిడితే మన బిడ్డ బతికొస్తుందా? ఏడిస్తే వస్తుందా?” ఒక్కొక్క మాటే గొంతును పెకలించుకుని వచ్చింది రాంరెడ్డి నోటి నుంచి.

- కాసుల ప్రతాపరెడ్డి