Asianet News TeluguAsianet News Telugu

జియో సెన్సేషన్: మూడేళ్లలో టాప్ 100 గ్లోబల్ బ్రాండ్

వచ్చే మూడేళ్లలో టాప్ 100 బ్రాండ్లలో జియో ఒక్కటి కానున్నదిన కాంటార్ మిల్వార్డ్ బ్రౌన్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది అమెజాన్ తొలి స్థానంలో నిలవగా, తర్వాతీ స్థానాల్లో గూగుల్, ఆపిల్ నిలిచాయి.
 

Reliance Jio To Be Among Top 100 Brands in 3 Years: Report
Author
Hyderabad, First Published Sep 18, 2019, 10:39 AM IST

టెలికం మార్కెట్‌ సంచలనం రిలయన్స్‌ జియో తన వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కంపెనీ ప్రారంభించిన మూడేళ్లలోనే జియో గ్లోబల్ 100 డిస్ట్రప్టివ్ పవర్ బ్రాండ్ల జాబితాలో చేరింది. అంతేకాదు ప్రస్తుత వృద్ధిరేటుతో మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 100 బ్రాండ్లలో ఒకటిగా ఉంటుందని కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్ డబ్ల్యూపీపీ, మార్కెట్ పరిశోధనా సంస్థ కాంటార్ మిల్వార్డ్ బ్రౌన్ తాజా నివేదికలో తెలిపింది. 

2019 జాబితాలో ఆపిల్, గూగుల్ సంస్థలను తోసిరాజని మరీ అమెజాన్ తొలి స్థానంలో నిలిచింది. 2016లో ప్రారంభించినా 1995లోమార్కెట్లోకి ప్రవేశించిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ లాంటి ప్రధాన ప్రత్యర్థులకు భిన్నంగా రిలయన్స్ జియోను భారత కస్టమర్లు ఆదరించారని పేర్కొన్నది. ఈ క్రమంలో టాప్‌ 100 మోస్ట్‌ వాల్యూబుల్‌ గ్లోబల్‌ బ్రాండ్‌గా దూసుకురానున్నదని నివేదించింది.

తొలిసారి ఆరు నెలలు ఉచిత సేవలతో కస‍్లమర్లను ఆకర్షించి, ఆ తరువాత సరసమైన ధరల్లో డేటా సేవలను అందించి, మార్కెట్‌ లీడర్లు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ లాంటి కంపెనీలను ప్రభావితం చేసిందని పేర్కొంది. దీంతో అవి కూడా వినియోగదారులను నిలబెట్టుకునేందుకు డేటా టారిఫ్‌ విషయంలో దిగొచ్చాయని నివేదిక వ్యాఖ్యానించింది.

కొత్త బ్రాండ్‌గా మార్కెట్లోకి ప్రవేశించి, కస్టమర్లందరికీ భారీ ప్రయోజనాలతో, ఆ సెక్టార్‌ చరిత్రనే తిరగ రాసిన ఘనత రిలయన్స్ జియోకే దక్కుతుందని కాంటార్ గ్లోబల్ బ్రాండ్జెడ్ రీసెర్చ్ డైరెక్టర్ మార్టిన్ గెరిరియా అన్నారు. 340 మిలియన్లకు పైగా చందాదారులతో జియో ప్రస్తుత బ్రాండ్ విలువ 4.1 బిలియన్లు అని నివేదిక తెలిపింది.

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆపిల్, గూగుల్‌లను అధిగమించి టాప్ 100 మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్రలో తొలి ర్యాంక్‌ దక్కించుకున్నది. ఏటా 52 శాతం పెరుగుదలతో, అమెజాన్ బ్రాండ్ విలువ 315.5 బిలియన్ డాలర్లు (రూ.22.40 లక్షల కోట్లు)గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో తొలిసారి చైనాకు చెందిన నాలుగు కంపెనీలు, భారత్‌కు చెందిన రెండు కంపెనీలు స్థానాన్ని దక్కించుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ 68వ ర్యాంక్, ప్రముఖ టెక్‌ కంపెనీ టీసీఎస్‌ 97వ ర్యాంక్‍తో కొత్తగా స్థానాన్ని సంపాదించాయి. 

అత్యంత విప్లవాత్మక 100 బ్రాండ్లలో జియో (బ్రాండ్ విలువ 4.1 బిలియన్ డాలర్ల)కు ప్రస్తుతం చోటు లభించింది. ప్రస్తుత వ్రుద్ధి రేటు కొనసాగితే అత్యంత విలువైన 100 బ్రాండ్లలోకి మూడేళ్లలో చేరుతుందని నివేదిక అంచనా వేసింది.

‘డేటాను అత్యంత చౌక ధరల్లో అందజేస్తూ, భారత టెలికం రంగం తీరు తెన్నులనే జియో మార్చేసింది. మూడేళ్లలోనే 30 కోట్లకు పైగా చందాదార్లకు సమకూర్చుకుంది. మిగిలిన సంస్థలు కూడా తప్పనిసరిగా ధరలు తగ్గించాల్సిన పరిస్థితి కల్పించింది’ అని కాంటార్ మిల్వార్డ్ బ్రౌన్ నివేదిక తెలిపింది. 

4జీ మొబైల్ డేటా వేగంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆగస్టులో జియో డౌన్ లోడ్ సగటు వేగం 21.3 ఎంబీపీఎస్‌గా నమోదైందని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక అప్ లోడ్ వేగంలో వొడాఫోన్ హవా కొనసాగుతున్నది. సగటు వేగం 5.5 ఎంబీపీఎస్‌గా నమోదైంది. డౌన్‌లోడ్ వేగంలో ఎయిర్ టెల్ 8.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.7 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 6.1 ఎంబీపీఎస్ నమోదు చేశాయి. 

అప్‌లోడ్‌లో ఐడియా సెల్యూలార్ 5.1 ఎంబీపీఎస్, జియో 4.4, ఎయిర్ టెల్ 3.1 ఎంబీపీఎస్ నమోదు చేశాయి. 3జీ సేవలకే పరిమితమైన బీఎస్ఎన్ఎల్ డౌన్ లోడ్ వేగం 2.6 ఎంబీపీఎస్, అప్ లోడ్ వేగం 1.2 ఎంబీపీఎస్‌గా నమోదైంది. వీడియోలతోపాటు వచ్చిన మెసేజ్‌లను వేగంగా వీక్షించేందుకు డౌన్ లోడ్ వేగం ఉపకరిస్తే, వీడియోల వంటివి ఇతరులకు సత్వరం పంపేందుకు అప్ లోడ్ వేగం దోహదపడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios