Asianet News TeluguAsianet News Telugu

ఐటీ రంగానికి సవాల్.. సంపన్నదేశాల ప్రొటెక్షనిజం

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల ఆత్మరక్షణ ధోరణులు భారత ఐటీ రంగానికి సవాళ్లు విసిరినా.. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను అనుసంధానించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి భారత ఐటీ సంస్థలు.

IT industry set to invest big in automation, AI in 2019
Author
Mumbai, First Published Dec 26, 2018, 10:35 AM IST

అగ్రరాజ్యాల రక్షణాత్మక ధోరణలు, డేటాపై ఆంక్షలు, శరవేగంగా మారుతున్న సాంకేతికత తదితర అంశాలు దేశీయ ఐటీ రంగానికి సవాళ్లు విసిరాయి. అయితేనేం.. కొత్త ఏడాదిపై ‘ఐటీ’ రంగానికి భారీగా ఆశలు మిగిలే ఉన్నాయి.

నూతన సంవత్సరంలో ఐటీ కంపెనీలు యాంత్రీకరణ, కృత్రిమ మేధస్సు(ఏఐ)లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏఐ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), బ్లాక్‌ చైన్‌, సెక్యూరిటీ, మెషీన్‌ లర్నింగ్‌, డేటా సైన్స్‌ విభాగాలే కొత్త ఏడాదిలో కీలక ట్రెండ్‌ కానున్నాయని సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ భావిస్తోంది.

‘2018లో ఐటీ కంపెనీలు కొత్త టెక్నాలజీలతోపాటు మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాన్ని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి. డిజిటల్‌ పరివర్తనలో భాగంగా కొత్త ఏడాదిలో ఐటీ కంపెనీలకు భారీగా అవకాశాలు లభించవచ్చు’ అని నాస్కమ్‌ ప్రెసిడెంట్‌ దేవయానీ ఘోష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

గతేడాది (2017-18) మాదిరే ఈ ఏడాది (2018-19)లోనూ ఐటీ రంగ ఎగుమతులు 7-9 శాతం వరకు అభివృద్ధి చెందవచ్చని నాస్కమ్‌ అంచనా వేసింది. దేశీయంగా ఆదాయం మాత్రం 10-12 శాతం మేర పుంజుకోవచ్చని పేర్కొంది.  

ఇక ఈ ఏడాది దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) మార్కెట్‌ కాపిటలైజేషన్ విలువ ఈ ఏడాది 10 వేల కోట్ల డాలర్లకు చేరుకున్నది. ఇక మాజీ యాజమాన్యం, ప్రమోటర్లకు మధ్య భేదాభిప్రాయాలతో అనిశ్చితిలోకి జారుకున్న ఇన్ఫోసిస్‌ ఈ ఏడాది తిరిగి వ్యాపార స్థిరీకరణ దిశగా అడుగులు వేసింది.

ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ మూడేళ్ల ట్రాన్స్ ఫర్మేషన్ వ్యూహాన్ని ఖరారు చేశారు. వచ్చే రెండేళ్లలో వేగవంతమైన అభివ్రుద్ధి సాధన ద్వారా ముందుకు సాగాలని అభిలషిస్తున్నారు. వచ్చే ఏడాది క్రుత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ అంశాలకు ఐటీ రంగంలో కీలకం కానున్నాయని ఇన్ఫోసిస్ అంచనా వేస్తోంది. 

కొన్నేళ్లుగా ప్రపంచానికి బ్యాక్‌ ఆఫీస్‌గా వ్యవహరించిన దేశీయ ఐటీ పరిశ్రమ ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీల పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తమ క్లయింట్లు కార్యకలాపాలను మరింత మెరుగుపర్చుకోవడంతోపాటు పోటీలో ముందు పీఠిన నిలిచేందుకు తోడ్పాటునిస్తున్నాయి.  
 
అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల ప్రభుత్వాలు చేపట్టిన ఆత్మరక్షణ చర్యలు.. ఐటీ కంపెనీలకు పెను సవాల్‌గా మారాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌1బీ వీసాతో పాటు ఇమ్మిగ్రేషన్‌కు చెందిన పలు నిబంధనలు కఠినతరం చేయడంతోపాటు స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచాలని తెచ్చిన ఒత్తిడి మేరకు భారత ఐటీ కంపెనీలు విదేశీ కార్యకలాపాల్లో స్థానికుల నియామకాలు పెంచాయి.
 
ఈ ఏడాది మేలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (జీడీపీఆర్‌)ను అమలులోకి తెచ్చింది. భారత్‌ కూడా సొంత డేటా ప్రొటెక్షన్‌ నియమావళిని ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు పరిణామాలు భారత ఐటీ కంపెనీలకు పలు అవకాశాలు సృష్టించవచ్చని ఐటీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
 
2019లో ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు భారీగా పెరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీ రంగంతోపాటు ఆటోమొబైల్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, మాన్యుఫాక్చరింగ్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోనూ ఆధునిక ఐటీ సాంకేతిక నిపుణులకు గిరాకీ పెరగనుందని వారంటున్నారు.

వచ్చే ఏడాదిలో ఐటీ రంగం 2.50 లక్షల మేర కొత్త నియామకాలు చేపట్టవచ్చని టీమ్‌లీజ్‌ సంస్థ అంచనా వేసింది. సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. దేశీయ ఐటీ రంగం తమ క్లయింట్లకు వ్యయం తగ్గించే స్థాయి నుంచి వినూత్న పరిష్కారాల ద్వారా వ్యాపార విలువను పెంచే స్థాయికి ఎదిగిందన్నారు.

మైండ్ ట్రీ సీఈఓ రొస్టోవ్ రావణన్ స్పందిస్తూ తమ కంపెనీ అంతర్జాతీయ పరిణామాలను సునిశితంగా గమనిస్తోందన్నారు. స్థానికులకు ఉద్యోగ నియామకాలు, ఇతర చర్యలు చేపట్టడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చునన్నారు.

జియోగ్రఫికల్‌గా క్లయింట్ల ప్రయోజనాలకు అనుగుణంగా స్థానిక లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళుతుందన్నారు.  మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెండ్ అనంత్ మహేశ్వరి స్పందిస్తూ భారతదేశ ఐటీ రంగంలో నైపుణ్యం, సామర్థ్యానికి అనుగుణంగా ముందుకు దూసుకెళ్లే అవకాశం కల్పించిందన్నారు. అడ్వైజరీ, కన్సల్టింగ్ బిజినెస్‌ల్లో నూతన మార్గాలను కల్పించిందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios