జియో ఎంట్రీతో అతలాకుతలమైన దేశీయ టెలికం పరిశ్రమ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఒకవైపు రుణ భారం.. మరోవైపు నష్టాల తాకిడి.. ఇంకోవైపు టారీఫ్‌ల యుద్ధంతో టెలికం సంస్థలు సతమతమవుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ద్రవ్యవ్యవస్థలో వచ్చిన నగదు కొరత సమస్య కొత్త చిక్కుల్ని తెచ్చిపెడుతుండగా, పరిశ్రమ మనుగడ కోసం తక్షణ ఉపశమన చర్యల్ని తీసుకోవాలని కేంద్రానికి సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) విజ్ఞప్తి చేసింది. రుణ పునర్‌వ్యవస్థీకరణ, లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం చార్జీలు వంటి వాటిని తగ్గించాలని కోరింది. 

జీఎస్టీ ఇన్ పుట్ ట్యాక్ క్రెడిట్ విడుదల చేయాలి
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విడుదల అంశాన్నీ ప్రభుత్వం వద్ద సీవోఏఐ ప్రస్తావించింది. ‘పరిశ్రమలో నెలకొన్న పోటీ  వాతావరణం, దాని ప్రభావం, ఒత్తిడి గురించి మేము మాట్లాడాం.

రుణ పునర్‌వ్యవస్థీకరణకుతోడు లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీలు, ఇతరత్రా పన్నులను తక్షణమే తగ్గించాల్సిన అవసరాన్ని వివరించాం.కాల్స్, డేటా టారీఫ్‌లు తక్కువగా ఉన్నాయని, నష్టాలు పీడిస్తున్నాయని కూడా తెలియజేశాం’అని సమావేశం తర్వాత సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. 

ప్రభుత్వ చర్యలతో స్వల్పకాలిక ఉపశమనం
తమ సూచనల ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపడితే టెలికం ఆపరేటర్లకు స్వల్పకాలంలో కొంతమేర ఆర్థిక ఇబ్బందులు తొలగిపోగలవన్న సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దీర్ఘకాల ఉద్దీపనలూ పరిశ్రమకు అవసరమన్నారు. కాగా, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం నేపథ్యంలో ద్రవ్యవ్యవస్థలో తలెత్తిన నగదు కొరత ప్రభావం టెలికం పరిశ్రమపైనా పడిందని తెలుస్తున్నది.  

టెలికం కార్యదర్శి అరుణా సుందర రాజన్‌తో బిర్లా ప్రత్యేక భేటీ
మరోవైపు దేశీయ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా.. టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్‌తో గురువారం మరో దఫా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఓసారి కలిసి టెలికం రంగంలో నెలకొన్న ఒత్తిడి, నగదు కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పుడు తాము ఎదుర్కొంటున్న మరిన్ని సమస్యలను సుందరరాజన్ దృష్టికి తెచ్చారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో బిర్లా వెంట వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ బోర్డు సభ్యుడు హిమాన్షు కపానియా తదితర సీనియర్ అధికారులూ ఉన్నారు.

ముఖ్యంగా రూ.30,000 కోట్లకుపైగా ఉన్న జీఎస్టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను విడుదల చేయాలనీ కోరారు. టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హాతోనూ ఇప్పటికే పరిశ్రమ సమస్యలపై బిర్లా చర్చించిన విషయం తెలిసిందే.


జియో రాకతో రూపు మారిన టెలికం రంగం
4జీ సేవలతో దేశీయ టెలికం రంగంలోకి సంచలనాత్మక ప్రవేశం చేసిన రిలయన్స్ జియోతో.. భారతీయ టెలికం పరిశ్రమలో నవశకం ఆరంభమైంది. ఉచిత కాల్స్, డేటా సర్వీసులతో టెలికం పరిశ్రమ ముఖచిత్రమే మారిపోగా, అప్పటిదాకా ఉన్న పోటీ సంస్థలు భారీ నష్టాల్లోకి జారుకోవడం మొదలైంది.

నష్టాలను తట్టుకోలేక చాలా సంస్థలు ఇతర సంస్థల్లోకి విలీనం కావడం, అమ్ముడైపోయాయి. ఈ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా ఏకీకృత నష్టం రూ.4,973 కోట్లుగా నమోదవగా, భారతీ ఎయిర్‌టెల్ సైతం వరుసగా 10వ త్రైమాసికం నష్టాలకే పరిమితమైంది. 

కాల్స్, డేటా చార్జీ తగ్గింపుతో లాభాలు ఆవిరి
జియో నుంచి పోటీని తట్టుకుని మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సైతం కాల్స్, డేటా చార్జీలను తగ్గిస్తుండటంతో లాభాలు ఆవిరైపోయి నష్టాలు వాటిల్లుతున్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న రుణ భారం పెరుగడంతోపాటు నగదు కొరత కారణంగా కొత్త రుణాల లభ్యత లేకపోవడం పరిశ్రమను ఇప్పుడు కలవరపెడుతున్నది.

వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు భారతీయ అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన జియోనూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. దీంతోనే టెలికం పరిశ్రమ తమను ఆదుకోవాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు సమర్పించింది.