వాషింగ్టన్‌: వివిధ దేశాల ప్రభుత్వాలు ఇంటర్నెట్ నియంత్రణ విషయంలో మరింత చురుగ్గా ఉండాలని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. యూరోపియన్‌ దేశాల్లోని నిబంధనలను మరిన్ని దేశాల్లో అమలు చేసి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా చూడాలన్నారు. 

మొత్తం నాలుగు విభాగాల్లో నిబంధనలు అవసరం ఉందని ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు. ప్రమాదకరమైన కంటెంట్‌, ఎన్నికల సంరక్షణ, వ్యక్తిగత గోప్యత, డేటా మార్పిడి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రభుత్వాలు నిబంధనలను యూరోపియన్‌ యూనియన్‌ వలే పటిష్ఠం చేసుకోవాల్సి ఉందని మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.  ఇప్పటికే ఫేస్‌బుక్‌ ఈ నాలుగు అంశాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇటీవల న్యూజిలాండ్‌లో మసీదుపై దాడిని లైవ్‌స్ట్రీమ్‌ చేయడంతో ఆ విమర్శలు తారాస్థాయికి చేరాయి. 

ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌, ఇతర ఇంటర్నెట్‌ దిగ్గజాలు ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాకు కళ్లెం వేయాలనే ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఫేస్‌బుక్‌ కూడా తన వైఖరిని మార్చుకొంది. దీంతో ఇంటర్నెట్‌కు కళ్లెం వేయాలనే వాదనను బలపర్చింది. 

ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ పొరపాటున ఏకంగా తన సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్ పోస్టులే తొలగించింది. 2007 నుంచి 2008 మధ్య ఆయన చేసిన పోస్టులు డిలీట్ అయ్యాయని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ‘సాంకేతిక కారణాల వల్ల కొన్నేళ్ల  క్రితం జుకర్‌బర్గ్‌ పోస్టులు పొరపాటున డిలీట్ అయ్యాయి. వాటిని తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విషయంలో మేం విజయం సాధిస్తామన్న హామీ లేదు’ అని ఫేస్ బుక్ కంపెనీ ప్రతినిధి వెల్లడించినట్లు అక్కడి మీడియా తన కథనంలో పేర్కొంమార్క్ జుకర్ బర్గ్ ఖాతా నుంచి డిలీట్ అయిన పోస్టులు చాలా ఎక్కువగా ఉండొచ్చని, వాటి సంఖ్య మీద సరైన అంచనా లేదని ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న ఫేస్‌బుక్‌కు ఇది ఇబ్బందికర పరిణమామమేనని మరో అమెరికన్ మీడియా సంస్థ అభిప్రాయపడింది.

అంతే కాదు వరుస విమర్శల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోప్యతా ఉల్లంఘనల ఆందోళన, న్యూజిలాండ్‌ నరమేధం సంఘటన తరువాత పలు సంస్కరణలకు పూనుకున్నది. ఇటీవల శ్వేత జాతీయవాద, వేర్పాటువాద పోస్టులను, ప్రసంగాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన సంస్థ తాజాగా మరో దిద్దుబాటు చర్యకు శ్రీకారం చుట్టింది.

ఇక పై ఫేస్‌బుక్‌ లైవ్‌లను మానిటర్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కొన్ని ఆంక్షలు విధించాలని కూడా నిర్ణయించింది.  అంటే ఇకపై ఫేస్‌బుక్‌ లైవ్‌లపై ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట. క్రైస్ట్‌చర్చ్‌ ఊచకోత సంఘటన లైవ్‌ స్ట్రీమింగ్‌పై రేగిన దుమారం నేపథ్యంలో తన ప్లాట్‌ఫారపై  ప్రత్యక్ష ప్రసారాలను కట్టడి చేయనున్నట్లు ఫేస్‌బుక్‌  సీవోవో  షెరిల్ శాండ్‌బెర్గ్‌ శుక్రవారం తన బ్లాగ్‌లో ప్రకటించారు.