వినియోగదారుల ఆకాంక్షలను పసిగట్టడంలో ముందు ఉన్న చైనా మొబైల్‌ కంపెనీలు తమ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలను భారత్‌లోకి విస్తరిస్తున్నాయి. చైనాలోని షెంజెన్‌ కేంద్రంగా పని చేస్తున్న స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది ఆ కంపెనీకి తొలి విదేశీ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం కావడం గమనార్హం. 

ఈ కేంద్రంలో స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు, క్రుత్రిమ మేథస్సు‌, వేగంగా ఫోన్‌ను చార్జ్‌ చేయగలిగే టెక్నాలజీతోపాటు 5జీ సేవల అభివృద్ధిపై పరిశోధనలు చేయనున్నట్లు ఒప్పో తెలిపింది. మరో చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ ప్లస్‌ సైతం హైదరాబాద్‌లోనే తన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
భారత కస్టమర్ల అభిరుచికి తగినట్లు అందుబాటు ధరల్లో అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో మొబైళ్ల తయారీపై ఈ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ దృష్టిసారించనున్నామని వన్‌ప్లస్‌ ప్రతినిధి తెలిపారు. వచ్చే ఏడాది మార్చికల్లా ఈ సెంటర్‌లో కార్యకలాపాలు  మొదలు కానున్నాయి. 

ఇక ఇన్‌ఫినిక్స్‌, ఐటెల్‌, టెక్నో బ్రాండ్‌నేమ్‌లతో భారత్‌లో మొబైళ్లు విక్రయిస్తున్న చైనా సంస్థ ట్రాన్షన్‌ హోల్డింగ్స్‌ కూడా భారత్‌లో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను నెలకొల్పే యోచనలో ఉంది. ఈ సంస్థ కేవలం స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కాక టీవీ, ఏసీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌లను కూడా ఇండియన్‌ మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది. 

ఒప్పో, వన్‌ప్లస్‌ కంటే చైనా టెక్నాలజీ దిగ్గజం హువే ఒక అడుగు ముందే ఉంది. బెంగళూరులో ఆర్‌ అండ్‌ డీ కార్యకలాపాలను ప్రారంభించింది. షామీకి కూడా బెంగళూరులో పరిశోధన వసతి ఉంది. ఇక దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ కూడా భారత్‌లో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను నెలకొల్పింది. మున్ముందు మరిన్ని చైనా కంపెనీలు మన దేశంలో పరిశోధన, అభివృద్ధి సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
 
భారత్‌లో ఆధునిక టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటంతో ఇక్కడి వినియోగదారుల అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణమైన ఉత్పత్తులు తయారు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చైనాతోపాటు పలు మల్టీ నేషనల్‌ కంపెనీలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌. పైగా ఇక్కడ టెక్నాలజీ నిపుణులు విదేశాలతో పోలిస్తే చౌకగా, అధిక సంఖ్యలో అందుబాటులో ఉండటంతో చైనాతోపాటు ప్రపంచ దేశాల కంపెనీలు భారత్‌లో పరిశోధనలకు ఆసక్తి చూపుతున్నాయి.

మొబైళ్ల తయారీలో చైనా తర్వాత స్థానం భారత్‌దే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేన్‌ (ఐసీఏ) ప్రభుత్వానికి తెలిపిన వివరాల ప్రకారం 2014లో 30 లక్షల యూనిట్లుగా నమోదైన మొబైళ్ల ఉత్పత్తి 2017లో 1.1 కోట్ల యూనిట్లకు పెరిగింది.
 
వచ్చే ఏడాదికల్లా దేశంలో మొబైళ్ల ఉత్పత్తిని ఐదు కోట్ల యూనిట్లకు పెంచాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖకు చెందిన ఫాస్ట్‌ ట్రాక్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌టీటీఎఫ్‌) లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరికల్లా దేశం నుంచి మొబైల్‌ ఎగుమతులను 12 కోట్ల యూనిట్లకు పెంచాలని ఎఫ్‌టీటీఎఫ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది రెండో త్రైమాసికానికి భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐదు స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో నాలుగు చైనాకు చెందినవే. మొదటి స్థానంలో కొనసాగుతున్న షామీకి మార్కెట్లో 29.7 శాతం మార్కెట్‌ వాటా ఉంది. చైనాలోని మొబైల్ కంపెనీల్లో షామీ, హువేలతోపాటు వివో, ఒప్పో, కూల్ ప్యాడ్, మేజూ, లెనెవో కూడా ఉన్నాయి.