శాలరీస్‌లో జాప్యమందుకే?!! బీఎస్ఎన్ఎల్‌లో సగం మంది ఇంటికే!!

బీఎస్‌ఎన్‌ఎల్‌లో సగం మందిని సాగనంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే వేతనాల చెల్లింపు జాప్యం చేయడం ద్వారా వీఆర్ఎస్ కోసం ఆకర్షణీయ ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులతో కలిపి 1.65 లక్షల మంది ఉద్యోగులు ఉన్న బీఎస్ఎన్ఎల్ సంస్థలో 80 వేల ఉద్యోగాల కోత విధించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వ ఆమోదమే తరువాయి.

BSNL which is yet to pay August salaries wants to give an attractive retirement package to 80,000 employees

తొలుత కోట్ల మంది భారత ప్రజలకు టెలిఫోన్‌ సేవలను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతు క్రమంగా మూగబోతోంది. ప్రైవేట్‌ టెలికం కంపెనీల రీ చార్జీ ధరల యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఈ కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. 

ఎవ్రిథింగ్‌ ఈజ్‌ ఫెయిర్‌ ఇన్‌ లవ్‌ అండ్‌ వార్‌ అన్నట్లు తనను తాను బతికేందుకు వేలమంది ఉద్యోగుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేందుకు కూడా సిద్ధమవుతోంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్‌ఎల్‌) దాదాపు సగం మంది ఉద్యోగులను బయటికి సాగనంపే ప్రయత్నాల్లో ఉంది.

బీఎస్ఎన్‌ఎల్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ పుర్వార్‌ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సగం మంది సంస్థ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ఆఫర్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

కనీసం 70,000-80,000 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలిగేందుకు వీలుగా ఈ పథకాన్ని ఆకర్షణీయంగా రూపొందిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ పుర్వార్ చెప్పారు. ఈ ఆపత్కాలం నుంచి కంపెనీని గట్టెక్కించేందుకే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎందుకంటే, సంస్థ ఆదాయంలో ఉద్యోగుల జీతాల వ్యయమే 75 శాతం. 

ఖర్చులు తగ్గితే గానీ బీఎస్ఎన్‌ఎల్‌ మళ్లీ కోలుకునే పరిస్థితులు కన్పించడం లేదని సంస్థ చైర్మన్ ప్రవీణ్‌ కుమార్‌ పుర్వార్ అన్నారు. అయితే కంపెనీ ప్రతిపాదించిన వీఆర్‌ఎస్‌ ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపాల్సి ఉంది.
 
ఒకేసారి వేలమంది సిబ్బంది తప్పుకుంటే ఉన్నవారిపై కంపెనీ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ‘వీఆర్‌ఎస్‌ ప్రక్రియ పూర్తయ్యాక కూడా కంపెనీలో సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తుంటారని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పుర్వార్ అన్నారు. అవసరమైతే కొన్ని కార్యకలాపాలను ఔట్‌సోర్స్‌ చేయడం లేదా కాంట్రాక్టు పద్ధతిలో కొందరిని నియమించుకునే ఆలోచన ఉందన్నారు.

ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్‌లో 1.65 లక్షల మంది పనిచేస్తున్నారు. వీఆర్‌ఎస్‌ ప్రణాళికను కంపెనీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ అలక్ష్య వైఖరి, విధానాలే కంపెనీ దుస్థితికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
 
వీఆర్‌ఎస్‌ పథకాన్ని ఉపయోగించుకునే సిబ్బందికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆఫర్‌ చేయాలంటే భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించే అవకాశం ఉంది. ఈ బాండ్లకు కంపెనీ తన ఆస్తులను హామీగా చూపెట్టవచ్చని తెలుస్తోంది.

ఆర్థిక కష్టాల్లోంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్రం భారీ బెయిల్‌ఔట్‌ ప్యాకేజీ ప్రకటించవచ్చన్న ఊహాగానాలు నెలకొన్నాయి. మోదీ మలి విడత ప్రభుత్వంలో టెలికాం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా ఇదే సంకేతాలిచ్చారు. 

ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. జీతాలకు కూడా నిధులు లేని సమయంలో బీఎస్ఎన్ఎల్ సంస్థకు ప్రభుత్వ సాయం అత్యవసరంగా మారింది.

సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ తన భూములను విక్రయించాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా కంపెనీ ఆధీనంలో ఉన్న భూములను గుర్తించే పనిలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో కంపెనీ అంచనా వేసిన ప్రకారం.. ఈ భూములు మార్కెట్లో రూ.20,000 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. 

నిర్దేశిత కాలంలో భూములతోపాటు మొబైల్‌ టవర్లు, ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విక్రయించగలిగితే దివాలా పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఆస్కారం ఉంటుందని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇందుకు ప్రభుత్వం నుంచి లభించే ఆమోదం ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది.

మూడేళ్ల క్రితం రిలయన్స్‌ జియో రంగ ప్రవేశంతో బీఎస్ఎన్ఎల్ కష్టాలు మరింత పెరిగాయి. 4జీ స్పెక్ట్రమ్‌ కలిగి ఉన్న ఇతర ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు సైతం జియో ధాటికి కుదేలయ్యాయి. అలాంటిది, 4జీ సేవలందించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ కూడా లేని బీఎస్ఎన్ఎల్ ఆదాయం ఏటేటా భారీగా తగ్గుతూ వచ్చింది. 

అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ నష్టాలు అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం టెలికాం మార్కెట్లో కంపెనీ మనుగడ కొనసాగించాలంటే డేటా సేవలు కీలకంగా మారాయని బీఎస్ఎన్ఎల్ చైర్మన్‌ ప్రవీణ్ కుమార్ అన్నారు. 4జీ స్పెక్ట్రమ్‌ అందుబాటులో లేకపోవడం వల్లే ప్రస్తుత మార్కెట్‌ పోటీలో కంపెనీ పూర్తిగా బలహీనపడిందన్నారు. ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకిప్పుడు 50 శాతానికి పైగా ఆదాయం డేటా సేవల ద్వారానే సమకూరుతోంది.

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు గత 5-6 నెలలుగా వేతనాలు జాప్యం అవుతున్నాయి. చాలా మంది సిబ్బందికి ఇంకా ఆగస్టు నెల జీతం అందలేదు. దాంతో దేశవ్యాప్తంగా కంపెనీ కార్యాలయాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటివరకు చెల్లించే విషయంపై యాజమాన్యం ఇంకా స్పష్టతనివ్వలేదని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ అభిమన్యు తెలిపారు. 

ఇక బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరిలో 70 శాతం మందికి ఫిబ్రవరి నుంచి జీతాల్లేవన్నారు. వీలైనంత మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌ను ఎంచుకునే పరిస్థితులు కల్పించేందుకే జీతాల చెల్లింపును ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్ అనుబంధ ఎంటీఎన్ఎల్ సంస్థ కూడా జీతాలివ్వలేని దుస్థితికి చేరుకున్నది. రెండు నెలలుగా సిబ్బందికి వేతనాలు చెల్లించలేదని, అయినప్పటికీ వీరికి ఎంత తొందర వీలైతే అంత తొందర్లో జీతాలు చెల్లించనున్నట్లు కంపెనీ సీఎండీ సునీల్‌ కుమార్‌ తెలిపారు. 

జూన్‌ వరకు పూర్తిస్థాయిలో వేతనాలను చెల్లించినట్లు, ఆ తర్వాతి రెండు నెలలు పెండింగ్‌లో ఉన్నట్లు ఇటీవల కంపెనీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్‌ వెల్లడించారు. ఎప్పటిలోగా చెల్లించే విషయంపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios