న్యూఢిల్లీ: మిట్రాన్‌ యాప్‌ విషయమై ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా మిట్రాన్‌ యాప్‌ను భారత్‌  తయారు చేసిందని, దానిని ఐఐటీ విద్యార్థి తయారు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. మిట్రాన్ యాప్ వాస్తవంగా పాకిస్థాన్‌కు చెందిన టిక్‌టిక్‌ యాప్‌ రీప్యాకేజీ వెర్షన్‌ అని వెల్లడైంది. 

మిట్రాన్ యాప్ ను తామే తయారు చేశామని పాకిస్థాన్‌కు చెందిన క్యూబాక్సస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రకటించింది. ఈ యాప్‌ పూర్తి సోర్స్‌ కోడ్‌ తమ సంస్థకు చెందినదని క్యూబాక్సస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో ఇర్ఫాన్‌ షేక్‌ తెలిపారు.

‘మా సంస్థ యాప్‌ సోర్స్‌ కోడ్‌ను మిట్రాన్‌ ప్రమోటర్‌కు రూ. 2600 (34 డాలర్లు) లకు విక్రయించాం. మిట్రాన్‌ డెవలపర్‌ మా సంస్థ సోర్స్‌ కోడ్‌ ద్వారా మిట్రాన్‌ యాప్‌ను తయారు చేసి కేవలం లోగో మార్చి వారి స్టోర్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నారు’ అని క్యూబాక్సస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో ఇర్ఫాన్‌ షేక్‌ చెప్పారు. 

‘అయితే ఇదేమి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారు మా కోడ్‌ను‌ డబ్బులతో కోనుగోలు చేసి దాన్ని ఉపయోగించుకున్నారు. కానీ మా సంస్థ సోర్స్‌ కోడ్‌తో తయారు చేసిన మిట్రాన్‌ యాప్‌ను భారత్ యాప్‌గా పేర్కొనడమే అభ్యంతకరం. ఎందుకంటే వారు ఆ కోడింగ్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు’ అని ఇర్ఫాన్‌ షేక్‌ స్పష్టం చేశారు. 

ఇక డేటా హోస్టింగ్‌ ప్రక్రియపై ఇర్ఫాన్‌ షేక్‌ స్పందిస్తూ.. ‘క్యూబాక్సస్‌ సర్వర్‌లో యూజర్‌ డేటాను పొందే అవకాశాన్ని మా సంస్థ కల్పిస్తుంది. కానీ మిట్రాన్‌ అలా చేయలేదు. బదులుగా యూజర్‌ డేటాను వారి స్వంత సర్వర్‌లో పొందేలా యాక్సెస్‌ ఇచ్చింది. ఇప్పటికీ మిట్రాన్‌ యూజర్‌ డేటాపై స్పష్టత లేదు’ అని పేర్కొన్నారు. 

​కాగా యాప్‌కు సంబంధించిన కోడ్‌ను కోనుగోలు చేయడం, వేరే పేరుతో దానిని ఉపయోగించడం అనేది చట్ట విరుద్దమేమీ కాదు. క్యూబాక్సస్‌ కూడా గతంలో ఎన్నో ఇతర ఆప్‌ కోడ్‌లను క్లోన్‌లుగా పనిచేసే బహుళ యాప్‌లను తయారు చేసింది. 

అంతేగాక ఇన్‌స్టాగ్రామ్‌ సోర్స్‌ ఆధారంగా (హష్‌గామ్)‌, ఫుండీస్‌ సింగిల్‌ రెస్టారెంట్‌ ఆధారంగా (ఆస్కింగ్‌ టూ జోమాటో), అచ్చం టిక్‌టాక్‌‌ మాదిరిగానే (టిక్‌టిక్‌)‌ యాప్‌లను తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మిట్రాన్‌ యాప్‌ కోడ్‌లో తమ సోర్స్‌ కోడ్‌ కనీసం ఒక బిట్‌ కూడా మార్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా మోసపూరితం అని క్యూబాక్సస్‌ పేర్కొంది.  

also read:కరోనా ‘వ్యాక్సిన్’ కోసం నాలుగేళ్లు వెయింటింగ్ అనివార్యం: కిరణ్ మజుందార్‌షా

మిట్రాన్‌ యాప్‌లో పటిష్టమైన గోప్యతా విధానం కూడా లేదని టెక్ నిపుణులు అంటున్నారు. వినియోగదారులు సైన్ అప్ చేసి ఇందులో వీడియోలు అప్‌లోడ్‌ చేయొచ్చు. వారి డేటాతో ఏమి జరుగుతుందో వినియోగదారులకు తెలిసే అవకాశం లేదు.

మిట్రాన్‌ యాప్‌ భారత్‌దేనన్న భావనతోనే ప్లే స్టోర్‌లో అధిక రేటింగ్‌ వచ్చిందని భావిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన డెవలపర్‌ నుంచి కొనుగోలు చేశారని తెలిస్తే రేటింగ్‌ పడిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కువగా వాడే 'మిత్రోం' పదానికి దగ్గరా ఉండడంతో ఈ యాప్‌ భారత్‌కు చెందినదని చాలా మంది అనుకున్నారు.