CWG 2022: పీవీ సింధూకు అరుదైన గౌరవం.. త్రివర్ణ పతాకదారి తెలుగు తేజమే..
Commonwealth Games 2022: శుక్రవారం నుంచి బర్మింగ్‌హోమ్ (లండన్) వేదికగా ప్రారంభంకాబోతున్న 22వ కామన్వెల్త్ క్రీడలలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధూకు అరుదైన గౌరవం దక్కింది.
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కామన్వెల్త్ క్రీడలకు శుక్రవారం తెరలేవనుంది. ఇప్పటికే బర్మింగ్‌హోమ్ లోని క్రీడాగ్రామానికి చేరుకున్న 72 దేశాల ఆటగాళ్లు ప్రారంభోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధూకు అరుదైన గౌరవం దక్కింది. కామన్వెల్త్ క్రీడలలో భారత త్రివర్ణ పతాకాన్ని మోయనున్నది (ఫ్లాగ్ బేరర్) మన తెలుగు తేజమే కానున్నది. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
వాస్తవానికి కామన్వెల్త్ క్రీడలలో మువ్వన్నెల పతకాన్ని మోసే బాధ్యతలు టోక్యో ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు దక్కేవి. కానీ తొడ కండరాల గాయంతో అతడు చివరి నిమిషంలో ఈ గేమ్స్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఐవోఏ కొత్త ఫ్లాగ్ బేరర్ వేట సాగించింది.
ఐవోఏ అధ్యక్షుడు అనిల్ ఖన్నా, సెక్రటరీ జనరల్ ఎంఆర్ రాజీవ్ మెహతా, ట్రెజరర్ ఆనందేశ్వర్ పాండే, టీమిండియా చీఫ్ డి మిషన్ రాజేశ్ బండారిలతో కూడిన కమిటీ.. ప్రారంభకార్యక్రమానికి ఫ్లాగ్ బేరర్ గా సింధూనే ఎంపిక చేసింది.
సింధూతో పాటు టోక్యో ఒలింపిక్ విజేతలు మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహెయిన్ ల పేర్లు కూడా చర్చలోకి వచ్చినట్టు ఐవోఏ తెలిపింది. కానీ అనుభవం, సింధూ సాధించిన ఘనతలతో ఆమెకే ఈ గౌరవం దక్కింది. కామన్వెల్త్ గేమ్స్ లో సింధు భారత జెండా మోయడం ఇదే ప్రథమం కాదు.. 2018 లో గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా) లో జరిగిన 21వ కామన్వెల్త్ క్రీడలలో సైతం సింధూనే జెండాను మోసింది.
కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనేందుకు గాను 215 మంది క్రీడాకారులు, 110 మంది సిబ్భందితో కూడిన భారత బృందం ఇప్పటికే కామన్వెల్త్ క్రీడా గ్రామానికి చేరింది. ఈ పోటీలలో భారత్ 16 క్రీడాంశాల్లో పాల్గొంది. గోల్డ్ కోస్ట్ లో 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టు.. ఈసారి పతకాల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్నది. ఈ క్రీడలలో మన అత్యుత్తమ ప్రదర్శన న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ (2010) లో. 2010లో భారత్.. 101 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా ఆ ప్రదర్శనను రిపీట్ చేయాలని పట్టుదలతో ఉన్నది.