Asianet News TeluguAsianet News Telugu

దీపికా పదుకొనె తండ్రిపై పుల్లెల గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు

ప్రియ శిష్యురాలు సైనా నెహ్వాల్‌ 2014లో హైదరాబాద్‌లోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని విడిచిపెట్టి, బెంగళూర్‌లోని ప్రకాశ్‌ పదుకొణె అకాడమికి వెళ్లిన ఘటనలో తను ఎంత వేదనకు గురయ్యాననే విషయాలను గోపీచంద్‌ తొలిసారి బయటపెట్టారు. 

pullela gopichand accuses prakash padukone of encouraging saina to leave the academy
Author
Hyderabad, First Published Jan 15, 2020, 3:52 PM IST

భావోద్వేగాలు ప్రదర్శించటంలో నిగ్రహం చూపించే అథ్లెట్లలో మహేంద్ర సింగ్‌ ధోని ముందుంటాడు. ధోని స్థాయిలో కాకపోయినా, బ్యాడ్మింటన్‌ జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో దిట్ట. (ఒకరు ఆటగాడు, ఇంకొకరు కోచ్ కావొచ్చు కానీ గోపీచంద్ కూడా పూర్వాశ్రమంలో అథ్లెటే కదా!)

ప్రియ శిష్యులు అత్యంత ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో పోరాడుతున్నప్పటికీ.... బ్యాడ్మింటన్‌ కోర్టు బయట గోపీచంద్‌ ప్రశాంతంగా కనిపిస్తాడు. ఓటమికి కుంగిపోవటం, విజయానికి పొంగిపోవటం గోపీచంద్‌లో అరుదుగా చూసే లక్షణాలు. 

బహిరంగ వేదికలపై భావోద్వేగాలను పంచుకోవటంలో గోపీచంద్‌ ఎప్పుడూ కూడా సముఖత చూపెట్టిన దాఖలాలు లేవు. కానీ తొలిసారి తాను రచించిన పుస్తకంలోని అత్యంత ఆసక్తికర అంశాలపై గోపీచంద్‌ మనసులో మాటను పంచుకున్నాడు. 

ప్రియ శిష్యురాలు సైనా నెహ్వాల్‌ 2014లో హైదరాబాద్‌లోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని విడిచిపెట్టి, బెంగళూర్‌లోని ప్రకాశ్‌ పదుకొణె అకాడమికి వెళ్లిన ఘటనలో తను ఎంత వేదనకు గురయ్యాననే విషయాలను గోపీచంద్‌ తొలిసారి బయటపెట్టారు. 

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా, కోచ్‌గా, మెంటర్‌గా తన అనుభవాలకు గోపీచంద్‌ అక్షర రూపం ఇస్తున్నారు. ' డ్రీమ్స్‌ ఆఫ్‌ బిలియన్‌ : ఇండియా అండ్‌ ది ఒలింపిక్‌ గేమ్స్‌' పేరిట గోపీచంద్‌ పుస్తకం త్వరలో విడుదల కానుంది.

క్రీడా చరిత్రకారుడు బోరియ మజుందార్‌, సీనియర్‌ పాత్రికేయుడు నళిన్‌ మెహత సహ రచయితలుగా గోపీచంద్‌ ఈ పుస్తకం రాస్తున్నారు. పలు ఆసక్తికర విషయాలను గోపీచంద్‌ పుస్తకంలో పొందుపరిచారు. 

సైనా ని తక్కువ చేసినట్టు కాదు... 

సైనా నెహ్వాల్‌ అకాడమీ విడిచి వెళ్లటం మన మనసుకు అత్యంత ఆప్తమైనది మన నుంచి వెళ్లిపోవటం వంటిదని పేర్కొన్నాడు.  నిజానికి ఆ సమయంలో సైనా నెహ్వాల్‌ను వెళ్లవద్దని వేడుకున్నానని గోపీచంద్ తెలిపాడు. 

అకాడమి విడిచి వెళ్లవద్దని బ్రతిమిలాడినప్పటికీ, బయటి వ్యక్తుల ప్రమేయంతో సైనా నెహ్వాల్‌ అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని, ఆమెను ఆపలేకపోయానని అప్పటి విషయాలను గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యాడు గోపీచంద్.  

Also read: దొంగ ఏడ్పు: పుల్లెల గోపీచంద్ పై భగ్గుమన్న జ్వాలా గుత్తా

అకాడమీని వీడిపోదామని సైనా నెహ్వాల్‌ తీసుకున్న నిర్ణయం సైనకుగానీ, తనకు గానీ ఎటువంటి మేలు చేయదని తనకు తెలుసునని గోపీచంద్ అన్నాడు. 2012-14 సమయంలో పి.వి సింధు గొప్ప పురోగతి సాధించిందని, దీంతో సింధుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చిందని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. 

ఇలా సింధుపై అప్పుడు కొంచం ఎక్కువ శ్రద్ధపెట్టాను తప్ప... అంతేగానీ, సైనా నెహ్వాల్‌ను విస్మరించిన పరిస్థితి లేదని అన్నాడు. ఈ విషయాన్ని తాను సైనా నెహ్వాల్‌కు వివరించలేకపోయాననే విషయాన్నీ పుస్తకంలో ' బిట్టర్ రైవల్రి' అనే చాప్టర్‌లో గోపీచంద్‌ పంచుకున్నారు. 

ప్రకాష్ పదుకొణె ఎందుకో...?

సైనా నెహ్వాల్‌ అకాడమిని విడిచి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు, తాను ఆమెకు సరైన విధానంలో నచ్చజెప్పలేకాపోతే... ఇతరులైనా సైనాకు అర్థమయ్యేట్టు చెప్పి ఉండాల్సిందని గోపి అభిప్రాయపడ్డాడు. 

ప్రకాశ్‌ పదుకొణె సర్‌, విమల్‌ కుమార్‌, ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్ వీరెన్‌లలో ఎవరో ఒకరు సైనాతో మాట్లాడి ఉండాల్సిందని గోపీచంద్ అన్నాడు. కానీ, వారు ఎందుకు ఆ పని చేయలేదో తనకు అర్థమవలేదని అన్నాడు. 

అర్థమయ్యేట్టు చెప్పకపోగా... సైనా నెహ్వాల్‌ ను హైదరాబాద్‌ విడిచి వెళ్లేందుకు ప్రోత్సహించారని వ్యాఖ్యానించాడు. బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పదుకొణె సర్ ను రోల్‌ మోడల్‌ గా భావిస్తానని, అయినా తన గురించి ఎన్నడూ రెండు మంచి మాటలను తనకు చెప్పలేదని, ఆ విషయం తనకిప్పుడికి కూడా అర్థం అవ్వట్లేదని అన్నాడు.  

సైనాకు కష్టకాలం

'2016 రియో ఒలింపిక్స్‌ సైనా నెహ్వాల్‌ కెరీర్‌లో అత్యంత కఠిన దశ. ఒలింపిక్స్‌లో ఆరంభంలోనే నిష్క్రమించింది. ఏండ్లుగా పడిన శ్రమ వృథా అయ్యింది. గోపీచంద్‌ సర్‌ సైనాతో లేరు, అంతలోనే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏం చేయాలో సైనాకు తెలియలేదు. '

'నా భార్య సైనా పరిపూర్ణ హర్యానా జాట్‌. నేను ఏం చెప్పదలుచుకున్నానో అర్థమైందనుకుంటున్నాను. గర్వం, తలపొగరు కాస్త ఎక్కువ. ఆమె ఆ సమయంలో గోపీచంద్‌ సర్‌ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాలని భావించింది. కానీ ఆ విషయం చెప్పడానికి సైనాకు మొండి పట్టుదల అడ్డొచ్చింది' అని పుస్తకంలో సైనా నెహ్వాల్‌ భర్త, సహచర షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ అప్పటి విషయాలను స్వయంగా పంచుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios