భారత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు దేశ గౌరవాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. 40ఏళ్ల భారత కలను సింధు నిజం చేసింది. గతంలో రెండుసార్లు విజయం అంచులదాకా వచ్చి ఓడిన సింధు.. ఈసారి పట్టుపట్టి విజయం సాధించింది. కాగా... సింధు విజయంపై తన  చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా సింధూని అభినందించింది.

‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది, నువ్వు బంగారానివి సింధూ’ అని మారిన్ ట్వీట్ చేసింది. 2016 రియో ఒలంపిక్స్ లో మహిళల సింగిల్స్ లో సింధు-మారిన్ తలపడ్డారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ గేమ్ లో మారిన్ విజయం సాధించిన పసిడి గెలవగా.. సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అప్పటి నుంచి ఈ ఇద్దరూ ప్రతి టోర్నీలో తలపడుతూనే ఉన్నారు. కోర్టులో ప్రత్యర్థులైనప్పటికీ.. బయట మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవారు. 

సింధుపై స్నూకర్‌ ప్రపంచ ఛాంపియన్‌ పంకజ్‌ ఆడ్వాణీ కూడా ట్వీట్‌ చేశాడు.  ‘బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచినందుకు శుభాకాంక్షలు సింధు. చాలా అద్భుతమైన పోరాటం చేశావు’ అని ట్వీట్‌ చేశాడు. ఆదివారం జరిగిన  ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో  ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.