మరో రెండు రోజుల్లో టీం ఇండియా, ఆస్ట్రేలియా జట్టులు టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి సమయంలో ఆసిస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజాకు షాక్ తగిలింది. అతని సోదరుడు అర్సకాన్ ఖవాజాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. తన యూనివర్శిటీ మాజీ కొలిగ్ అయిన నిజాముద్దీన్ అనే వ్యక్తిని అన్యాయంగా ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఇరికించాడన్న ఆరోపణలతో అర్సకాన్ ఖవాజాను అరెస్టు చేశారు.

మాజీ ప్రధాని మాల్కమ్ టర్నబుల్ హత్యకు నిజాముద్దీన్ కుట్రపన్నాడని ఖవాజా పోలీసులను నమ్మించాడు. దీంతో గత ఆగస్ట్‌లో నిజాముదీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో అతనికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని తేలడంతో అతన్ని విడుదల చేశారు.  అయితే.. నిజాముద్దీన్ పై ఉన్న వ్యక్తిగత కక్ష కారణంగా అతనిని ఈ కేసులో ఇరికించాడని పోలీసులు వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో సిడ్నీలో ఉన్న అర్సకాన్ ఖవాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.  మరోవైపు ఈ నెల 6 నుంచి టీమిండియాతో ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం ఉస్మాన్ ఖవాజా సిద్ధమవుతున్నాడు. సరిగ్గా మ్యాచ్ కి రెండు రోజులు మాత్రమే సమయం ఉందనగా.. అతని సోదరుడు అరెస్ట్ కావడం అతనికి పెద్ద షాకే. మరి ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి.. ఉస్మాన్ తన ఆటను ఎలా కొనసాగిస్తాడో చూడాలి.