కమ్మిన్స్ మాస్ కాదు... ఊర మాస్ రా సాామీ..: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కే పూనకాలు తెప్పిస్తున్నాడు
తెలుగోళ్లకు ఎవరైనా నచ్చితే చాలు నెత్తిన పెట్టుకుంటారు. ఇలా ఇప్పటికే ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ ఐపిఎల్ ద్వారా తెలుగోళ్లకు దగ్గరయ్యాడు... ఇప్పుడు మరో ఆసిస్ క్రికెటర్ కూడా దగ్గరవుతున్నాడు. ఆ ఆటగాడు ఎవరంటే...
హైదరాబాద్ : రోమ్ కి వెళితే రోమన్ లా వుండాలంటారు... ఇది ఆస్ట్రేలియా క్రికెటర్లకు సరిగ్గా సరిపోతుంది. మరీముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ తరపున ఆడే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ బాగా తెలుసనుకుంటా. అందువల్లే వాళ్లు తెలుగు ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇలా ఇప్పటికే డేవిడ్ వార్నర్ పూర్తిగా తెలుగువాడిలా మారిపోయాడు... అతడు టీం మారినా తెలుగును వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు అదే బాటలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నడుస్తున్నారు. కేవలం ఆటతోనే కాదు తెలుగు సినిమా డైలాగ్స్ తో అభిమానులను అలరిస్తున్నాడు.
తెలుగు ప్రజలకు క్రికెట్ అన్నా, సినిమాలన్నా ప్రాణం. మరి ఆ రెండూ ఒకేచోటికి చేరి ఎంటర్ టైన్ చేస్తే... ఇంకేం కావాలి. తాజాగా ఇదే చేసాడు సన్ రైజర్స్ కెప్టెన్ కమ్మిన్స్. తన ఇంగ్లీష్ స్లాంగ్ లో తెలుగు సినిమా డైలాగ్స్ చెబుతూ తెలుగోళ్లను ఫిదా చేసాడు. ఈ ఆసిస్ ఆటగాడు వచ్చీరాని తెలుగులో టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్స్ చెబుతూ తెలుగోళ్లను అలరించాడు. చివర్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనరిజంతో అదరగొట్టాడు. ఇంకేముంది మరో ఆసిస్ ఆటగాడిని తెలుగోళ్లలో కలిపేసుకున్నారు ఇరు రాష్ట్రాల ప్రజలు.
''ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను... కమ్మిన్స్ అంటే క్లాస్ కాదు మాస్... ఊర మాస్...ఎస్ఆర్ హెచ్ అంటే ప్లవర్ అనుకుంటివా...ఫైర్'' అంటూ తెలుగు సినిమా డైలాగ్స్ తనదైన స్టైల్లో చెబుతున్న కమ్మిన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ తెలుగు డైలాగ్స్ ఒక ఎత్తయితే వీడియో చివర్లో పవన్ కల్యాణ్ స్లైల్ ను కమ్మిన్స్ అనుకరించడం మరో ఎత్తు. ఇలా ఒక్క వీడియోతో అటు తెలుగు స్టార్ హీరోల ఫ్యాన్స్ ను అలరించడమే కాదు... క్రికెట్ ఫ్యాన్స్ కి తనలో క్రికెటర్ మాత్రమే కాదు మరో కళాకారుడు దాగివున్నాడని చూపించాడు కమ్మిన్స్.
అప్పుడు వార్నర్ ... ఇప్పుడు కమ్మిన్స్ :
గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో చాలామంది ఆడారు...కానీ ఆసిస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అంతలా తెలుగు ప్రజలకు ఎవరూ దగ్గరకాలేపోయారు. తన ఆటతో కొంత దగ్గరయితే తెలుగు కల్చర్ ని ఒంటబట్టించుకుని మరింత దగ్గరయ్యాడు వార్నర్. చివరకు హైదరాబాద్ జట్టును వీడినా ఇంకా వార్నర్ ను తెలుగు ప్రజలు అభిమానిస్తున్నారంటే ఎంతలా వారికి దగ్గరయ్యాడు... వారి మనసులో ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ఫ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లింది వార్నర్ అనే చెప్పాలి. అతడు మైదానంలోనే శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులను యదావిధంగా దించేయడం... కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే పుష్ప సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ వార్నర్ నోట ఎక్కువసార్లు వినిపించింది. ''పుష్ఫ అంటే ప్లవర్ అనుకుంటివా...ఫైర్'' అంటూ అల్లు అర్జున్ గడ్డం నిమురుకుంటున్న సీన్ ను వార్నర్ రిపీట్ చేసాడు. అలాగే మరికొన్ని తెలుగు సినిమా డైలాగ్స్, పాటలతో కూడా తెలుగు ప్రజల మనసులు దోచాడు. ఎంతలా అంటే టాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించాడు వార్నర్. తెలుగోళ్లు వార్నర్ మామ అంటూ ముద్దుగా పిలుచుకుంటారంటేనే అతడిని ఎంతలా ఇష్టపడుతున్నారో అర్థం అవుతుంది.
అయితే వార్నర్ ప్రస్తుతం హైదరాబాద్ టీంలో లేడు... అయితేనేం అతడి స్థానాన్ని తాను భర్తీ చేస్తానంటున్నాడు కమ్మిన్స్. జట్టుకు కెప్టెన్ గానే కాదు తెలుగు ప్రజలను వార్నర్ లా ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. అందులో భాగంగానే తాజాగా తెలుగు సినిమా డైలాగ్స్ తో అలరించే ప్రయత్నం చేసాడు కమ్మిన్స్.
కమ్మిన్స్ వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ :
వార్నర్ మామ పోయాడని బాధపడుతుంటే నువ్వు వచ్చావా కమ్మిన్స్ మామ... మా ఎంటర్ టైన్ మెంట్ మాకు ఇచ్చెయ్ అంటూ ఓ నెటిజన్ కమ్మిన్స్ వీడియోపై కామెంట్ చేసాడు. నువ్వు ఏం చేసినా వార్నర్ ను మించిపోలేవని కొందరు... ఇదేంట్రా... ఆస్ట్రేలియన్ క్రికెటర్లంతా తెలుగోళ్లపై పడ్డారని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వార్నర్ లాగే కమ్మిన్స్ కూడా తెలుగోళ్ళకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సన్స్ రైజర్స్ టీం :
తెలుగు సినీహీరో మహేష్ బాబు మన తెలుగు టీం సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్స్ ను ఇటీవలే కలిసారు. వారితో కలిసి టీమ్ ప్రమోషనల్ షూటింగ్ ఏదో చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ సమయంలోనే సూపర్ స్టార్ తో ఫోటో దిగిన కమ్మిన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ తో అంటూ రాసుకొచ్చారు. వారి ఫోటోను రీ ట్వీట్ చేస్తూ.. మహేష్ కూడా రిప్లై ఇచ్చారు.