డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

విధి ఆడే వింత నాటకంలో మనిషి పాత్ర దారుడే కాని సూత్ర దారుడు ఎన్నడు కాలేడు. పరోపకారానికి మించిన దైవపూజ మరొకటి లేదు. పుట్టుక మన చేతిలో లేదు. చావూ మన చేతిలో లేదు. నడుమదంతా జీవితం. అదో నాటకం. ఆ నాటకంలోని పాత్రధారులం మనమే. మన ప్రవర్తనకు, అభినయానికి మనమే బాధ్యులం. ఈ జీవితం అనే గ్రంథంలో ఎన్నో అధ్యాయాలు, నాటకంలోని పాత్రల్లాగానే మరి ఈ జీవితం ఎవరి కోసం? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తాయి. 

సన్యాసి అంటాడు ‘ఈ రోజు నా వల్ల ఈ లోకానికి ఏం ప్రయోజనం కలిగింది?’ అని. 

సంసారి అనుకుంటాడు ‘ఈ రోజు లోకం వల్ల నాకేం ఉపయోగం కలిగింది?’ అని. 

ఇది సహజం, తనకు మాలిన ధర్మం పనికి రాదు అనుకోవడంలో తప్పులేదు. ‘అంతా నాకే కావాలి’ అని అనుకోవడంలోనే ఇబ్బందులు వస్తున్నాయి. పూర్వం ‘నీది నీదే, నాదీ నీదే’ అనేవారు తపోధనులు. ఆ తరవాత ‘నీది నీదే, నాది నాదే’ అనే కాలం వచ్చింది. ఇది కొంత వరకు ఫరవాలేదు. ‘బతుకు - బతకనివ్వు’ అన్న సిద్ధాంతమన్నమాట.

అయితే, వర్తమాన పరిస్థితులు మరీ భయానకమైనవి. ‘నీది నాదే, నాది నాదే’ అన్న భావన స్వార్థానికి పాదుచేస్తోంది. గృహస్థు అనేవాడు అతిథి ఎవరైనా ఇంటికి వస్తాడేమో అన్న ఆశతో నిరీక్షించి, అతిథి వస్తే, అది తన మహాభాగ్యంగా భావించి అతడికి సపర్యలు చేసి, మర్యాదగా భోజనం పెట్టి, ఆ తరవాతనే భోంచేస్తాడు. ఇది అసలైన గృహస్థు లక్షణం.

ఎవరైనా ఇంటికొస్తారేమో, ఎన్ని రోజులుంటారో, ఎలా ఎలా మర్యాదలు చేయాల్సి వస్తుందో అనే భయపడే రోజులొచ్చేశాయి. నిజానికి తిండి కోసం ఇవాళ వచ్చే అతిథుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అది వేరే విషయం. జీవించి ఉన్నంతకాలం మన కోసమే కాదు జాతి కోసం, సమాజం కోసం, కనీసం పొరుగువాడి మేలు కోసం మనం కొంత సమయమైనా, కొంత ధనమైనా ఖర్చుపెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని గుర్తుంచుకోవాలని సనాతన ధర్మం చెబుతోంది. ‘ఈ శరీరం పరోపకారార్థం’ అని విజ్ఞులు చెప్పిన మాట చిరస్మరణీయమైంది.

జీవితంలో మనిషి సేవ చేయడానికి అనేక మార్గాలున్నాయి. దరిద్రనారాయణులెందరో సమాజంలో ఉన్నారు. తిండి, బట్ట, ఇల్లు లేనివాళ్లు ఎందరో. అనాథలెందరో, కన్నవాళ్ల చేత అవమానం పొంది, దిక్కులేక తిరుగుతున్న వృద్ధులు ఎందరో. వైద్యం దొరకని వ్యాధిగ్రస్తులెందరో... సేవ కోసమే ఈ జీవితకాలం అన్న దృఢమైన ఆశయం ఉండాలేకానీ మన పరిధిలో సహాయపడటానికి ఎన్నో విధానాలున్నాయి. 

శబరి, గుహుడు, జటాయువు, ఉడుత రాముణ్ని సేవించి తరించిన సన్నివేశాలు మరువగలమా? ‘నాకు రాజ్యం, స్వర్గం, పునర్జన్మ ఇవేవీ వద్ధు కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే శక్తిని ప్రసాదించు ప్రభూ’ అని ప్రార్థించాడు పరమాత్మను రంతిదేవుడు. జీవన సార్థక్యం అంటే అది. శ్రవణకుమారుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించి రుణం తీర్చుకున్నాడు. హనుమ రామభక్తికే జీవితం అంకితం చేసి చరితార్థుడయ్యాడు.

మదర్‌ థెరిసా, అల్లూరి సీతారామరాజు, బాపూజీ, భగత్‌సింగ్‌... జాతి సముద్ధరణకు జీవిత సర్వస్వం ధారవోయడం వల్లనే చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాల్లో వారి పేర్లు చోటుచేసుకున్నాయి. సాటి మనిషి కళ్లలో ఆనందం, సంతృప్తి మన చిన్న ఉపకారం వల్ల చూడగలిగితే, అంతకుమించి ఇంకేం కావాలి? ఈ భావన మన పిల్లల్లో, రాబోయే తరాల్లో ఇంకాలి, చిగుళ్లు తొడగాలి. 

ఈ ప్రవృత్తి వల్లనే ఎన్నో సంస్థలు, ఎందరో ధర్మమూర్తులు, సామాన్యులను, దీనులను, నిస్సహాయులను ఆదుకుంటున్నారు. ప్రతి కుటుంబంలో ‘మన ఈ బతుకు ఎవరి కోసం?’ అన్న ప్రశ్న ఉదయించాలి. ‘పరుల కోసం’ అన్న జవాబూ వెంటనే చెప్పుకోవాలి. అప్పుడే మానవ జీవితం సార్థకం అవుతుంది. లోక కల్యాణమూ సాధ్యమవుతుంది. పుట్టినప్పుడు ఏమి తీసుకుని రాలేదు, పోయేటప్పుడు ఎవరూ ఏమి తీసుకుపోరు. తనకు కలిగిన దానిలో కొంత నిరాశ్రయులకు, ఆకలితో అలమటించే వారికి కొంత కేటాయించుద్దాం. చేసిన పుణ్యఫలం ఎప్పుడు వృధాగా పోదు.