Asianet News TeluguAsianet News Telugu

సమస్తానికి ఆధ్యుడు అధిపతి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు

దీనిని ఆధారం చేసుకుని అనేక పురాణ కథలు పుట్టు కొచ్చాయి. ప్రస్తుతం ఇది చదివితే దీనిలో ఉన్న రహస్యం ఏమిటో  అర్ధమవుతుంది. దీనినే నాసదీయ సూక్తం అంటారు.
 
Vishwakarma jayanti 2020 worship of lord vishwakarma
Author
Hyderabad, First Published Apr 15, 2020, 2:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp
Vishwakarma jayanti 2020 worship of lord vishwakarma - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


సృష్టి జరుగక ముందు విశ్వకర్మపరబ్రహ్మ స్థితి ఎలా ఉన్నదో వర్ణించిన ఏకైక సూక్తం.ఇటువంటి వర్ణన ఏ పవిత్ర గ్రంధంలోను లేదు ఒక్క ఋగ్వేదంలో తప్ప. దీనిని ఆధారం చేసుకుని అనేక పురాణ కథలు పుట్టు కొచ్చాయి. ప్రస్తుతం ఇది చదివితే దీనిలో ఉన్న రహస్యం ఏమిటో  అర్ధమవుతుంది. దీనినే నాసదీయ సూక్తం అంటారు.

నాసదీయ సూక్తము - ఋగ్వేదము

1) నాసదా సీన్నో సదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమా పరో యత్ |
కిమావరీవ కుహ కస్య శర్మన్నమ్భ కిమాసీద్గహనం గభీరమ్ ||

2) న మృత్యురాసీదమృతం న తర్హినరాత్ర్యా అహ్న ఆసీత్ప్రకేతః |
ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్న పరః కిం చనాస ||

3) తమ ఆసీత్తమసా గూళ్హమగ్రే౭ప్రకేతం సలిలం సర్వమా ఇదమ్ |
తుచ్ఛ్యేనాభ్వపిహితం యదాసీత్తపసస్తన్మహినాజాతైకమ్ ||

4) కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేత ప్రథమం యదాసీత్ |
సతో బన్ధుమసతి నిరవిన్దన్హృది ప్రతీష్యా కవయో మనీషా ||

5) తిరశ్చీనో వితతో రశ్మిరేషామధః స్విదాసీ ౩ దుపరి స్వీదాసీ ౩ త్ |
రేతోధా ఆసన్మహిమాన ఆసన్స్వధా అవస్తాత్ప్రయతిః పరస్తాత్ ||

6) కో అద్ధా వేద క ఇహ ప్ర వోచత్కుత ఆజాతా కుత ఇయం విసృష్టిః |
అర్వాగ్దేవా అస్య విసర్జసేనాథా కో వేద యత ఆబభూవ ||

7) ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న |
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్సో అంగ వేద యది వా న వేద ||

 ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 

ఋగ్వేదం 10 వ మండలం 129 వ సూక్తంలో సృష్ట్యారంభం గురించి చెప్పబడ్డ నాసదీయసూక్తం గురించి అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సనాతన వైదిక ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది అనాది. ఎప్పటి నుంచో జరుతూనే ఉంది. సృష్టి అనేది ఒక సముద్రం అనుకుంటే, సముద్రపు అలలపై నురుగులో ఏర్పడ్డ నీటి బుడగల వంటివి ఈ అనంతకోటి విశ్వాలు. నీటి బుడగల మాదిరిగా విశ్వాలు నిత్యం అనేకం లయమవుతుంటాయి, కొత్తవి ఏర్పడుతుంటాయి. కనుక ఎక్కడైన హిందూగ్రంధాల్లో సృష్ట్యాది అంటే ఇప్పుడు అనంతకోటి విశ్వాల్లో ఏదో ఒక విశ్వం యొక్క సృష్ట్యాదిగానే అర్దం చేసుకోవాలి.

ఈ విశ్వం ఎందుకు ఉంది? అంటే, ఈ విశ్వం యొక్క ఉనికికి కారణం ఏమిటి? ఈ విశ్వం పనిచేసే తీరు ఏమిటి? ఈ విశ్వ నిర్మాణానికి వాడబడ్డ ఘటక ద్రవ్యాలు ఏమిటి? ఈ విశ్వం ప్రాదుర్భావానికి కారణభూతులు ఎవ్వరు? మహావిస్పోటనంతో విశ్వం పుట్టింది అన్నారు. ఈ మహావిస్పోటనం ఎందుకు జరిగింది? ఈ విస్పోటనంతోటే స్థలం, కాలం పుట్టేయని అన్నాం కదా. విస్పోటనానికి 'ముందు' స్థలమే లేకపోతే ఆ పేలిన పదార్ధం (బ్రహ్మ పదార్ధం?) ఎక్కడ ఉండేది? మహావిస్పోటనంలోనే కాలం పుట్టినప్పుడు 'విస్పోటనానికి ముందు' అనే సమాసానికి అర్ధం ఉందా? పోనీ, పైన అడిగిన ప్రశ్నలకి వేదాంత ధోరణిలో తప్ప శాస్త్రీయ ధోరణిలో సమాధానాలు చెప్పలేమని ఒప్పేసుకుందాం – మాటవరసకి. 

మన ప్రశ్నలని భౌతిక శాస్త్రం విధించిన పరిధిలోనే అడుగుదాం. పదార్ధం పరమాణు రేణువులతో తయారయింది అన్నారు కదా. కొన్ని పరమాణు రేణువుల అస్తిత్వానికి నిలకడ (అంటే స్థిరత్వం) ఉండి, కొన్నింటికి లేదు. ఎందుకని? మనిషి ఎంత పొడుగున్నాడో, ఎంత బరువున్నాడో కొలిచినంత మాత్రాన ఆ మనిషి తత్త్వం అర్ధం అవుతుందా? అలాగే మనం చేసినదల్లా విశ్వంలోని అంశాలని కొన్నింటిని – దూరాలు, వేగాలు, కాలాలు, గరిమలు, ఆవేశాలు, మొదలైన భౌతిక రాశులని - కొలిచాం. అంతే కాని ఈ విశ్వం యొక్క తత్త్వాన్ని అర్ధం చేసుకోలేదు. అంటే ఇప్పుడు మన దగ్గరున్న కేవలం సమాచారం మాత్రమే. ఈ విశ్వం యొక్క అస్తిత్వానికి కారణం ఏమిటి? ఈ రకం ప్రశ్నలకి ఆధునిక భౌతిక శాస్త్రం ఆమోదకరమైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది – ఇప్పటివరకు. అంటే ఏమిటన్నమాట? కొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో మనకే తెలియటం లేదు. మరికొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఇంకా అధునాతనమైన అభిమతాలలో దొరకొచ్చనే ఆశ ఉంది. ప్రస్తుతానికి మొదటి రకం ప్రశ్నలకి సమాధానాలు మరొక కోణం నుండి వెతుకుదాం.

ప్రశ్నలను మొదట లేవనెత్తినవారు సనాతన ధర్మానికి చెందిన ఋషులే. ఋగ్వేదంలో (10.129) # నాసదీయ_సూక్తం అనే మంత్రం ఉంది. ఎందుకంటే వర్ణించటం అనేది మనసుతో, భాషతో చేసే పని. మనసుకు చాలా వేగవనతమైనది, శక్తివంతమైనదే అయినా, దానికి కొన్ని పరిమితులున్నాయి. అది అన్నిటిని చెప్పగలదు కానీ సర్వాతీతమైన భగవంతుని గురించి చెప్పలేదు. మనసుకు ఆ స్థాయిని వర్ణించగలశక్తి లేదు. భగవంతుని అనుభూతి చెందడం తప్పించి, దాన్ని భావంలో చెప్పలేము. అటువంటిది సృష్టికి పూర్వం ఏముందంటే ఏం చెప్పగలం? సృష్టికి పూర్వం ఉన్నది కేవలం భగవత్తత్వం మాత్రమే. పరబ్రహ్మం తప్ప వేరొకటిలేదు. అయినా కరుణతో ఆ పరమసత్యం యొక్క చిన్న బింధువును ఈ సూక్తంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మంత్రంలోని భావం భాషకి అతీతం. సమాధిస్థితిలో మునులు అనుభవించి అవగాహన చేసుకున్న బ్రహ్మ సత్యాన్ని భాష విధించిన శృంఖలాలకి బద్ధులై చెప్పారు. వారు చెప్పదలుచుకున్న విషయాన్ని భాషలో బంధించి చెప్పేసరికి సగం భావం నశించిపోయి ఉంటుంది. మిగిలినదానిని ఇంగ్లీషులోకో, తెలుగులోకో దింపి చెప్పటానికి ప్రయత్నిస్తే మరో వన్నె తరిగిపోతుంది. అయినా సరే నాసదీయ సూక్తంలోని ఏడు శ్లోకాలలోని భావాన్ని అర్దం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

బ్రహ్మ సూక్తం 
నాసదీయ సూక్తం 
ఋగ్వేదం -10.119 - ప్రజాపతి పరమేష్టి ఋషి.

1) నా సదాసీ న్నో సదాసీ త్తదానీం నాసీద్రజో నో వ్యోమా పరోయత్ | 
కిమావరీవ: కుహ కస్య శర్మన్నంభ: కిమాసీద్ గహనం గభీరం || 

అప్పుడు అసత్తు లేదు, సత్తు లేదు. రజసి లేదు అనగా పాల పుంతలు, నక్షత్రాలు, లోకాలు ఏమీ లేవు. వ్యోమం (మహా శూన్యం) తప్ప దానికంటే ఇతరమైనది ఏమీలేదు. ఆవరణ ఏమిటి? ఎక్కడ, దేనికి స్థానము? (అంతు తెలియని చోటు),ఆహా! ఆనందం, అజ్ఞాత జలధి. గర్భంలో ఎంతో లోతున నిగూఢంగా ఉన్నట్లుంది. 
అజ్ఞాత జలధి = కనిపించని జలరాశి అనగా శుద్ధ చైతన్యం అంతటా వ్యాపించి ఉందని అర్ధం.

సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేక పోవటం అనేది లేదు (సత్ లేదు, అసత్ లేదు). అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే/ఎవరిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?

2) న మృత్యురాసీ దమృతం నతర్హి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత: | 
ఆనీదవాతం స్వధయా తదేకం తస్మద్ధాన్యద్ధ పర: కిచనాస || 

అపుడు మృత్యువు లేదు, అమరత్వం లేదు. రాత్రి, పగలు అనే భేదం లేదు. వాయువు లేని  చోట సహజత్వంలో తనంతట తాను అతనొక్కడే ఉన్నాడు. అతడు మినహా మరొకరు లేరు.

మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామ రూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు. అన్నిటికి అతీతమైన తత్వం మాత్రమే ఉంది. అది దేనీ మీద ఆధారపడిలేదు. ఆ బ్రహ్మం తప్ప వెరొకటిలేదు.

3) తమ ఆసీత్ తమసా గూహ్ ళమగ్రే.ప్రకేతం సలిలం సర్వమా ఇదం | 
తుభ్యెనాభ్వపిహితం యదాసీత్ తపస స్తన్మహినా జాయతైకం || 

అంధకారంగా ఉంది. అంతా అనాదిగా చీకటితో కప్పబడిన అజ్ఞాత సలిలము (ఆనంద జలధి ,నిరాకారము, అవ్యక్తమునగు జలరాశి ). అంతా శూన్యంతో కప్పబడినప్పుడు తపో మహిమచేత ఆయన ఒక్కడే తనంతట తాను స్వయంభూవై వ్యక్తమగుచుండెను. స్వయంభువు = విశ్వకర్మ.

అంతా అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారంనెలకొని ఉంది. అవగాహనకి అందని ఆ బ్రహ్మం ( బ్రహ్మ పదార్ధం ) మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం ( శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తీవ్రమైన తాపం (వేడి) వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. (బిగ్ బ్యాంగ్ జరుగగా అధికమైన వేడి పుట్టిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తున్నది.

4) కామస్తదగ్రే సమవర్తతాధి మనసొ రేత: ప్రథమం యదాసీత్ | 
సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రతీష్యాకవయో మనీషా || 

అపుడు మొట్టమొదటిగా కోరిక ఉంది. అదే ఆయన మనస్సులోని ప్రథమ రేతస్సు. దానిని దర్శించిన కవులు ( ఋషులు ) తమ బుద్ధి ద్వారా తెలుసుకొని అసత్తులో సత్తు ఉందని గ్రహించారు. ఇదే భర్గస్ అనబడే ఆపోజ్యోతి ఉన్నదని గ్రహించారు. దానికి కారణం కోరిక (ఇచ్ఛ). అదే ప్రధమ బీజం, పరబ్రహ్మం యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచే విశ్వావిర్భావం జరిగింది, విశ్వం వికసించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దాని కోసం తమ హృదయాలను శోధించారో, వారికి శక్తికి, పదార్ధానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.

5) తిరశ్చినో వితతో రశ్మిరేషామధ: స్విదాసీ దుపరి స్విదాసీత్ | 
రెతొధా అసన్ మహిమాన ఆసన్ త్స్వధా అవస్తాత్ ప్రయతి: పరస్తాత్ || 

అతనిలో ఒక కిరణం ఏటవాలుగా ఉంది. ఆవెలుగు కిరణం క్రిందికి పైకి వ్యాపిస్తున్నది. అక్కడ బీజం ఉంది. అతనియందు మహిమలు న్నాయి. అతనికి స్వతంత్రమైన పనులున్నాయి. అతని యందు చైతన్య స్పందన ఉన్నది. శ్రేష్ఠమైన ప్రగతి ఉంది. అతని యందు ( ప్రకాశించే )శక్తి ఉన్నది పనులు =సృష్టి స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాది పంచ కర్మలు, శక్తి = చిచ్ఛక్తి . శూన్యానికి, దానిపైన, క్రింద ఏమున్నదో, దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అభ్యుదమైన ఆ శక్తి సారవంతమైన శక్తులను తయారు చేసింది. అన్నిటికి పైన చైతన్య శక్తి యొక్క ఉద్దేశ్యం, ప్రేరణ ఉంది, అదే దీన్ని నడిపిస్తోంది, క్రింద క్రమ శిక్షణతో కూడిన సృజనాత్మకత ఉంది. అది ప్రేరణకు తగ్గట్టుగా నడుస్తోంది.

6) కోఅద్ధా వేద క ఇహ ప్రవోచత్ కుత ఆజాతా కుత ఇయం విసృష్టి: | 
అర్వాగ్దేవా అస్య విసర్జనేనాథాకోవేద యత ఆ బభూవ || 

ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు చూసారు? దేవతలంతా తరువాత జన్మించిన వారు. ఎక్కడి నుంచి ఈ సృష్టి ఎలా వచ్చిందో ఎవరూ చూడలేదు. ముందుగా ఉన్నది విరాట్ విశ్వకర్మ భగవానుడు మాత్రమే. ఇక్కడ దేవతలు అంటే పంచ బ్రహ్మలు. (స బ్రహ్మ స శివ, స హరి స్సేంద్ర: సొ అక్షర: పరమ స్వరాట్ ) కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు
 ( పరబ్రహ్మం కాదు, పుణ్యఫలాల కారణంగా దేవతాజన్మను పొందిన వారు, ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైనవారు) కూడా ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది (వారు కూడా ఈ తర్వాత వచ్చినవారే ).

7) ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధేయ దివాన | 
యో అస్యాధ్యక్ష: పరమె వ్యొమన్ సొ అంగ వేద యది వా నవేద || 

ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, పరమాకాశంలో దీనిని ఎవరు ఉంచారు ? ఇది పరమాకాశంలో ఉన్న అన్నిటికి అధ్యక్షుడైన విశ్వకర్మ ఆ సృష్టికర్తకే తెలుసు. అన్ని యెరిగిన వాడు, సర్వసాక్షి ఆ పరమాత్మ యొక్కడే. ఈ సృష్టిని చేసి దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్నవాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఎంటో తెలిసే ఉండాలి. ఈ సూక్తంలో చెప్పిన చాలా విషయాలను ఆధునిక భౌతికశాస్త్రం కూడా వర్ణించింది. విశ్వోద్భవశాస్త్రం మీద, భౌతిక శాస్త్రం మీద అవగాహన ఉన్నవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీనిని బట్టి మనకు అర్ధం అయ్యేది ఒక్కటే సృష్టికి పూర్వం స్వయంభు: గా వెలసిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు మాత్రమే, ఆ తర్వాతనే సృష్టి ,సూర్యుడు, భూమి, ఆకాశం, అగ్ని, నీరు, గాలి,  ... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మొదలగు వారు జన్మించారు.     

 
Follow Us:
Download App:
  • android
  • ios