Asianet News TeluguAsianet News Telugu

మానవ శరీరంలో భగవంతుడు.. మరి ఎందుకు కనపడడు?

 భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు. దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం లేదు... ఎందుకనీ? మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన

Shocking Proof of God's Existence Inside the Human Body
Author
Hyderabad, First Published Mar 16, 2020, 1:24 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Shocking Proof of God's Existence Inside the Human Body

దేహమే దేవాలయం జీవుడే దేవుడు

దేహస్తాః సర్వవిద్యా శ్చ దేహస్తా స్స ర్వదేవాతః!

దేహస్తాః సర్వతీర్ధాని, గురువాక్యేన లభ్యతే!!

బ్రహ్మాండలక్షణం సర్వం దేహమధ్యే వ్యవస్థితమ్

దేహమే దేవాలయం; ఆత్మయే దైవం. 

దేహమే దేవాలయం; జీవుడే దేవుడు. 

ఈ దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం. మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది. భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు. దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం లేదు... ఎందుకనీ? మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన! మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు! మొదటిది 'నేను' అనే తలంపు ఇక రెండవది 'నాది' అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.

మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి... ఎలా?

ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని - ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి). మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యము లనెడి  ఆరు అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి. 

సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. అందుకే చెడు ఎవరైనా చెబితే చెవిటివాడులా ఉండు చెడు మాట్లాడే సంభాషణ సంభవిస్తే మూగవాడిలా వుండు చెడు చూసే పరిస్థితి తారసపడితే గుడ్డివానిలా వుండు అని అంటారు. మనస్సునూ బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. 

మనలో అనేక బలహీనతలుంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. (ఆలోచనలతో నిండి ఉన్న భాగాన్ని మనస్సు అనియు విచక్షణతో నిర్ణయం తీసుకునే భాగాన్ని బుద్ధి అని అంటారు). రామకృష్ణ పరమహంస చెప్పేది ఇదే ఆకర్షణల మధ్య ఆకర్షణ లేకుండా ఉండగలగడమే వివేకం అని! ఏది మంచో, ఏది చెడో బుద్ధిద్వారా గ్రహించాలి. మనబుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి మన మనస్సు చేతిలో బుద్ధి ఉంటే మనకు తిరోగతి మనస్సు బయటికి వెళితే బంధం లోపలి వెళితే మోక్షం.

ప్రాపంచిక మార్గమైన, పారమార్ధిక మార్గమైన సరే, మన జీవన గమనంలో బయట లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవి సహజం. ఇవన్నీ ఓర్పు, దైర్యం, నమ్మకం, ఏకాగ్రత లాంటి సద్గుణములతో ఎదుర్కొని పయనించినప్పుడే గమ్యమును చేరుకోగలం. జీవితంలో కష్టాలు, దుఃఖం, ఆవేదన..... ఇత్యాదులు అనుభవిస్తేనే ఆనందములోని పరిపూర్ణత, అమృతత్వం అర్ధమౌతాయి. ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి మనస్సును అదిగమించే ధైర్యవంతుడు కాగలడు. ఇవన్నీ అనుభవించి అనుభవించి చివరికి ఆత్మజ్ఞానియై ప్రాజ్ఞుడౌతాడు. 

హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించం. ఇదే మాయ శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి  ప్రేమ, జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios