పిచ్చుకలకూ ఓ రోజు: కిచ కిచల ఊసులు
మనిషితో వేలాది ఏండ్లుగా అల్లుకున్న పిచ్చుకల ప్రపంచానికి ముఖ్యంగా రెండు దశాభ్దాలుగా పెను విఘాతం కలుగుతోంది. ఇప్పుడు పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ పిచ్చుకల ఊసు లేకుండా పోతున్నది.
నేడు పిచ్చుకల రోజు. ఈ సందర్భంగా అంతరించిపోతున్న ఈ పిట్టలపై ఒక హృద్యమైన ఛాయా మాలిక.
-కందుకూరి రమేష్ బాబు
మనిషితో వేలాది ఏండ్లుగా అల్లుకున్న పిచ్చుకల ప్రపంచానికి ముఖ్యంగా రెండు దశాభ్దాలుగా పెను విఘాతం కలుగుతోంది. ఇప్పుడు పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ పిచ్చుకల ఊసు లేకుండా పోతున్నది.
మానవుడి అభివృద్ధి నమూనాకు బలైపోతున్న పిట్టల గురించిన అవగాహనకై, ముఖ్యంగా పిచ్చుకలను కాపాడేందుకు 2012 లో డిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ "Rise of Sparrows" అన్న ప్రచారాన్ని ప్రారంభించారు. అంతేకాదు, ఆనాడే తమ రాష్ట్ర పక్షిగా వారు పిచ్చుకను ప్రకటించడం విశేషం.
జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పులతో పిచ్చుక జాతి అంతరించనుందనే చెప్పాలి. ఇందుకోసం అవగాహన చర్యలు చేపట్టాలన్న ఉద్దేశ్యంతో మొదలైన ‘స్పారో డే’కి ఈ ఏటికి సరిగ్గా తొమ్మిదేళ్ళు.
పిచ్చుకలు అంతరార్థం కావడానికి పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అడవిని నరికివేయడం అన్న మూడు ముఖ్య కారణాలుగా చెబుతారు.
ఐతే, ఎరువులు, రసాయనాలతో కూడిన పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, సెల్యూలర్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు పిచ్చుకలకు పెను ముప్పుగా మారాయని అందరికీ తెలుసు. దాంతో పల్లెల్లో కూడా కిచ కిచల ఊసు లేకుండా పోవడం విషాదం.