Asianet News TeluguAsianet News Telugu

జగన్ జెరుసలేం ‘యాత్ర’ మనకు ఏం చెబుతున్నది?

పదిహేనేళ్ళ క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక, 2004 మే రెండవ వారంలో కాంగ్రెస్ ప్రధానిగా యు.పి.ఏ. తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమయింది.

Opinion on AP CM YS Jagan jerusalem's tour
Author
Hyderabad, First Published Aug 5, 2019, 3:18 PM IST

__ జాన్ సన్ చోరగుడి

క నిరంతర అధ్యయన అంశంగా ‘చరిత్ర’ పలుమార్లు చివరి బెంచీలకు చేరుతున్నప్పటికీ, మన రాజకీయులు ఎప్పటికప్పుడు దాన్ని బ్రతికిస్తూ, ఆ దిశలో మన ఆలోచనలు మరింత పదును కావడానికి కొత్త కొత్త ద్వారాలు తెరుస్తూ వుంటారు. ఎందుకీ మాట అనడం అంటే, ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి తన కుటుంబంతో ఇప్పుడు చేస్తున్న జెరూసలేం పర్యటన, ఆ దిశలో మనం సమకాలీన జాతీయ పరిణామాలను చూడ్డానికి మరో కొత్త ‘విండో’ అవుతున్నది. దీని నేపధ్యం మరింత స్పష్టంగా అర్ధంకావడానికి మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. పదిహేనేళ్ళ క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక, 2004 మే రెండవ వారంలో కాంగ్రెస్ ప్రధానిగా యు.పి.ఏ. తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమయింది.

అయితే అప్పటి ఆ పరిణామాలు దగ్గరగా చూసినవాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చివరి నిముషంలో యు.పి.ఏ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవడానికి; ఆమె ‘విశ్వాసం’ ప్రధాన పాత్ర పోషించింది అంటారు. ఇప్పటికీ దాన్ని కాదని నిరాకరించినవాళ్ళు కనిపించరు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్లి దాన్నిమూలాలలోకి చూస్తే, ఇప్పటికీ అదంత తేలిగ్గా తీసుకునే విషయంగా అనిపించదు. ఎందుకంటే, రషీద్ కిద్వాయ్ (పెంగ్విన్ ప్రచురణ) రచన - ‘సోనియా ఏ బయోగ్రఫీ’ గ్రంధం అప్పటికి ఎనిమిది నెలల ముందే మార్కెట్లోకి వచ్చింది. డిల్లీలో  ‘టెలిగ్రాఫ్’ ఆంగ్ల పత్రికకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ బీట్ చూస్తున్నారాయన.

అయితే, అది ఏ రకంగాను ఇప్పుడు ఇక్కడ విశేషం కాదు కానీ, అందులో - ‘ఆమె విశ్వాసం’ (హర్ ఫెయిత్) శీర్షికతో ఏకంగా ఒక అధ్యాయం ఉంది. అందులో ఆమె ఎలా తన జన్మత క్రైస్తవ ముద్రకు దూరమయ్యారు అంటూ, ఆమె పెళ్ళినాటి నుంచి మనవడి బారసాల వరకు పలు ఇంటి సంఘటనలు గురించి పదిహేను పేజీలు రాశారాయన. 2004 ఎన్నికల ముందు దాన్ని అంత ప్రాదాన్య అంశంగా రాయడం అంటే, ఆమె అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ రేపు గెలిచినప్పటికీ, తన ‘విశ్వాసం’ కారణంగా ఈ దేశానికీ ఆమె ప్రధాని కావడం సాధ్యం కాకపోవచ్చు అని బహుశా ముందే రషీద్ కిద్వాయ్ అనుకొని ఉండాలి. అయితే సోనియా అప్పుడు అలా అనుకోలేదు.  

Opinion on AP CM YS Jagan jerusalem's tour

రషీద్ కిద్వాయ్ కి ఆనాడు సోనియా విశ్వాసం విషయంలో ఉన్న స్పష్టత ఎటువంటిదో, ఇప్పుడు జగన్ రెడ్డికి తన విశ్వాసం గురించి తనకున్న స్పష్టత కూడా అటువంటిదే. భారత జాతీయులైన ఈ ఇద్దరూ ఒకరు జర్నలిస్ట్ కాగా మరొకరు పొలిటీషియన్. వీరిద్దరి మత విశ్వాసాలు రాష్ట్రాలు కూడా వేరు కావచ్చు, కానీ ప్రధానంగా వీరిద్దరూ ఆసియా వాసులు. మతాలన్నీ ఆసియాలో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందినవే కనుక, విశ్వాసం విషయంలో స్థూలంగా ఇక్కడి వారి దృష్టిలో ఉండే సారూప్యత యూరోపియన్లకు అర్ధం కానిది, పూర్తిగా భిన్నమైంది. ఈ రెండు జాతీయతల ప్రజల మానసిక వైఖిరుల్లో వైరుధ్యానికి ఈ ఖంఢాలలో ఉన్నవేర్వేరు భౌగోళిక పరిస్థితులు కారణం అంటారు - స్వామీ వివేకానంద.

ఇండియాలో ఎందరు దేవుళ్ళు ఉన్నప్పటికీ, ఇక్కడ మనుష్యులు వారి విశ్వాసాలు ఒక్క తీరుగానే ఉంటాయి. జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అప్పటికి ముప్పై ఏళ్ల తర్వాత వరసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ నాయకుడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 లోక్ సభ స్థానాలకుగాను 33 గెలిచింది. ఆ విజయం తర్వాత ఆయన 26 మే 2009 లో ‘కృతజ్ఞత యాత్ర’ అంటూ కుటుంబ సభ్యులతో ఇజ్రాయేల్ వెళ్ళడానికి సిద్దమయ్యారు. అయితే అధిష్టానం లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రయాణానికి చివరి వరకు ఆయనకు అనుమతి రాకపోవడంతో, ఆయన వారం పైగా కనిపెట్టి చివరికి ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ మార్చుకుని మరీ ఇజ్రాయేల్ యాత్రకు వెళ్లి వచ్చారు.

తనకున్న విశ్వాసం కోసం, ఒక విజేత ఇలా ఇరకాటం ఎదుర్కోవడం 24X7 వార్తల కాలంలో; ఇక్కడి పరిశీలకుల దృష్టిలో పడకుండా కాంగ్రెస్ పార్టీ తప్పించలేకపోయింది. ఆ ఉదంతంలో అంతటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కి కూడా ‘మైనార్టీ మతం’ అనుభవం ఇక్కడ మినహాయింపు కాలేదు. సోనియా గాంధీ ఇటలీ క్రిస్టియన్, వై.ఎస్.ఆర్. ఇండియన్ క్రిస్టియన్ కనుక విశ్వాస సంబంధమైన సారూప్యత వల్ల మిగతా వారికంటే వారిద్దరి మధ్య మరింత మంచి అవగాహన ఉండొచ్చు, అనే తెలుగువారి అభిప్రాయాన్ని ఈ ఘటన ఒక సందేహంగా మార్చింది. ఆసియా దేశాల్లోని అన్ని మతాల్లో వుండే – మొక్కులు, తీర్థయాత్రలు, కాశీ వెళ్లి రావడం, ‘హాజ్’ యాత్రలు వంటి నమ్మకాలు సోనియా వంటి యురోపియన్ దేశస్తుల నమ్మకాలకు భిన్నమైనవి కావొచ్చు.  

  ఈశాన్య రాష్ట్రాలు తర్వాత దక్షణాది రాష్ట్రాల్లో కేరళ, గోవాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో కొందరు క్రైస్తవ ముఖ్యమంత్రులు పనిచేసారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి 1991 ఆగస్టులో ముఖ్యమంత్రిగా గోదావరి పుష్కరాలు ప్రారంభించడానికి ముందు, కొందరు ఒక ధర్మ సందేహాన్ని లేవనెత్తారు. క్రైస్తవుడైన జనార్ధన రెడ్డి పుష్కరాలు ఎలా ప్రారంభిస్తాడు అని. అప్పటికి ఆయన క్రిష్టియన్ అనే విషయం అందరికీ తెలియదు. దానికి అప్పట్లో కొందరు అనుభవజ్ఞులైన పండితులు, జియ్యర్లు సందేహ నివృత్తి చేసారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత విశ్వాసం ఏదైనప్పటికీ, ఆయన ఒక ప్రభుత్వాధినేతగా తన విధులను నిర్వహించడానికి రాజమండ్రి వస్తున్నారని, దానికి అభ్యంతరం ఉండదని, దాని సారాంశం. రాష్ట్ర గవర్నర్ గా(1978 -1983) కె.సి. అబ్రహాం పనిచేసిన కాలంలో ఆయన తొలి తిరుమల దర్శనం కూడా ఇటువంటి చర్చకు దారితీసి తుదకు ముగిసింది.

ఇప్పుడీ గతం తలపోతలు ఎందుకంటే, వీరంతా స్వేచ్చగా తమ వ్యక్తిగత విశ్వాసాలను పాటిస్తూనే ‘రాజ్యం’ విషయంలో పాటించవలసిన ధర్మాన్ని నిబద్దతతో పాటించారు, అని చెప్పడం కోసమే. మరి వీళ్ళు ఇలా వున్నప్పుడు, వారున్న అదే పార్టీ జాతీయ నాయకురాలు తన విశ్వాసం విషయంలో ఇప్పటికీ పడుతున్న ఆపసోపాల వృధాప్రయాస దేని కోసం? ఈ ప్రశ్నకు సమీప భవిష్యత్తులో కూడా మనకు సమాధానం దొరక్కపోవచ్చు. ఈ అంశానికి ఇంతటి లోతైన పునాదులు ఉన్నాయి. దీన్ని విభిన్న విశ్వాసాల మధ్య ఉండే సన్నటి రేఖను దాటి మరీ వాటిని ఒక్కటిగా కలిపే ఆధ్యాత్మిక సారూప్యత దృష్టికోణం నుంచి చూడ్డం అవసరం. కానీ రాజకీయ పార్టీల తక్షణ లబ్ది కోసం ఎప్పటికప్పుడు దీన్ని ఎన్నికల రాజకీయ అంశంగా చూడడమే ఇంకా జరుగుతున్నది.

 ‘చరిత్ర’ ప్రస్తావనతో ఈ వ్యాసాన్ని మొదలెట్టిన కారణం అదే. దక్షణ ఆఫ్రికాలో 1904- 1906 మధ్య గాంధీజీ ఉంటున్న ఇంటిలో ఒక పోర్షన్లో ఇంగ్లాండ్ లో పుట్టిన యూదు జాతీయుడు హెన్రీ పొలాక్ దంపతులు ఉండేవారు. గాంధీజీ ఆఫీస్ గదిలో గోడకు రనడే, అనీబీసెంట్ పోటోల మధ్య పెద్దగా కనిపించే జీసస్ ఫోటో ఉండేది. ‘మీరు క్రైస్తవ్యాన్ని ఎందుకు మీ విశ్వాసంగా హత్తుకోలేదు గాంధీజీ?’ అంటూ ఒకరోజు మిసెస్ పొలాక్ నేరుగా ఆయన్ని అడిగింది. అందుకాయన – (“ To be a good Hindu also meant that I would be good Christian. There was no need for join your creed to be a believer in the beauty of teachings of Jesus or to follow his example”) ఒక ఉత్తమ హిందూగా జీవించడం అంటే ఉత్తమ క్రైస్తవుడిగా జీవించడమే అంటూ, ఒక ఆసియా వాసి దృక్పధాన్ని వారికి చెప్పడానికి గాంధీ ప్రయత్నించారు. మిసెస్ మిల్లీ గ్రహం పొలాక్ తన గ్రంధం ‘మిస్టర్ గాంధీ ద మ్యాన్’ లో ఈ సంఘటన గురించి వివరంగా రాసారు. బైబిల్ నూతన నిబంధనలో జీసస్ ‘పర్వత ప్రసంగం’ తనకు ఇష్టమైన విషయమని పలుమార్లు గాంధీ అనేవారు.

‘ఆదియందు వాక్యముండెను’ అంటూ జీసస్ కు బాప్టిజం ఇచ్చిన సెయింట్ జాన్ తన గ్రంధాన్ని ప్రారంభిస్తాడు. ఒక పవిత్ర గ్రంధంలో వుండే విషయాన్ని నిష్టతో పాటించే దశకు మనిషి చేరవలసిన కాలమిది. ఆ గ్రంధంలో ‘వాక్య’ లేదా ‘విషయ’ ప్రాముఖ్యతను విడిచి, దాన్ని ఇప్పటికీ ‘మతం’ తో ముడిపెడుతూ మానవాళిని పురాదశకు ‘చర్చి’ కనుక తీసుకువెళితే, దానికి మనం దూరంగా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే, ఈ రోజున బైబిల్ అన్ని ప్రపంచ భాషల్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న గ్రంధం.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఒక ఇంటర్వ్యులో తను ప్రతి రోజు బైబిల్ చదువుతాను, అన్నారు. ఉదయం మూడు గంటలకు మొదలయ్యే తన దినచర్యలో యోగా, స్నానం, బైబిల్ పఠనం - ప్రార్ధన తర్వాత, కాఫీ, పేపర్లు చూడ్డంతో ఆయన పని మొదలవుతుందట. ఇది ఇప్పుడు కాదు, గత పదేళ్లుగా. అయితే, ఆయన ఆశ్రమాల సందర్శనలు, నదీ స్నానాలు, పీఠాధిపతుల ఆశీర్వచనాలు తీసుకోవడం ఇవన్నీ ఈ దేశ ఆచారాలకు సంప్రదాయాలకు ఇస్తున్న విలువ అవుతుంది. అయినా వ్యక్తుల విశ్వాసాలు ‘సాఫ్ట్ వేర్’ రూపం తీసుకుంటున్న కాలమిది. ఇక ముందు దైవాన్ని ‘వాక్యం’ గా భావిస్తూ ‘క్లౌడ్ కంప్యూటింగ్’ ద్వారా వాక్యధ్యానం జరుగుతుంది. అప్పుడు ‘యాత్ర’లు కూడా గత చరిత్ర  అవుతాయి. జగన్ రెడ్డికి ఒకప్పుడు తన తండ్రికి ఉన్న అధిష్టానం పెత్తనం లేదు. కనుక తను మరింత స్వేచ్చగా తన వ్యక్తిగత జీవితాన్ని’ప్లాన్’ చేసుకోవచ్చు. ఇక రాజ్యాంగ పదవిలో బాధ్యతలకు ‘బుక్’ (నిబంధనలు) నుంచి దూరం కాకుండా వుంటే చాలు.       

    

 

 

 

           

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios