జీసస్ చాలు, ‘మతం’ వద్దు అంటున్న గాంధీ మార్గం!
త్వరలో వందేళ్ళకు చేరువ అవుతున్న ఇండియాలో చాలా వాటితో పాటుగా వొక విశ్వాసంగా, ‘భారతీయ క్రైస్తవ్యం’ కూడా ఇప్పుడు పులుకడిగిన ముత్యం కావాల్సివుంది. అయితే, అది ఇప్పటి ‘చర్చి’ పరిధిలో అవుతుందన్న నమ్మకం లేదు. ఇక్కడే గాంధీజీ చెప్పిన – ‘క్రీస్తు చాలు మతం వద్దు’ స్వాంతన ఇస్తున్న పరిష్కారంగా కనిపిస్తున్నది.
- జాన్ సన్ చోరగుడి
భారత ప్రభుత్వం ‘యాంటీ కన్వర్షన్ బిల్’ ద్వారా దేశంలో మత మార్పిడి నిరోధ చట్టం అమలులోకి తీసుకువస్తున్నది అని, ఆ దిశలో చురుగ్గా కసరత్తు జరుగుతున్నదని వస్తున్న వార్తలు, కొందరికి కలవరం కలిగిస్తున్నాయి. గడచిన బడ్జెట్ సమావేశాల్లో కాశ్మీర్లో 370 చట్టం రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి కీలక బిల్లులతో పాటుగా మొత్తం 30 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
వివాదాస్పద అంశాలుగా భావించి, గత ప్రభుత్వాలు వాటి జోలికి కూడా వెళ్ళని వాటిని సైతం, ఈ ప్రభుత్వం అవలీలగా అమలు చేస్తున్నది. అయితే ఈ ‘మత మార్పిడి నిరోధ బిల్లు’ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత క్రైస్తవుల భయాందోళనలకు కారణం అవుతున్నది. కొందరు పాస్టర్లు ఇప్పటికే చర్చిల్లో బహిరంగంగానే దీని గురించి మాట్లాడుతున్నారు. ఇదే కాలంలో జాతి పిత (‘ఫాదర్ ఆఫ్ ది నేషన్’) గా పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 150వ జయంతిని మనం ఈ అక్టోబర్ 2 నుండి దేశమంతా జరుపుకుంటున్నాము.
దళిత క్రైస్తవులను షెడ్యుల్ కులాలుగా గుర్తించాలి, అనే డిమాండ్ కేంద్రం వద్ద చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దాన్ని దృష్టిలో వుంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం 29 అక్టోబర్ 2004 న సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ రంగనాధ మిశ్రా చైర్మన్ గా ‘నేషనల్ కమీషన్ ఫర్ రెలిజియస్ అండ్ రెలిజియస్
మైనారిటీస్’ పేరుతో ఒక కమీషన్ నియమించింది. ఆ కమీషన్ 21 మే 2007 న అందుకు అనుకూలమైన రీతిలో తన నివేదికను ఇచ్చింది. అయితే, ఆ కమీషన్ మెంబర్ కార్యదర్శి శ్రీమతి ఆశా దాస్ ఐ.ఏ.ఎస్. ఆ నివేదికపై తన అభ్యంతరాన్ని ఒక ‘డిస్సెంట్ నోట్’ ద్వారా ప్రభుత్వానికి తెలియచేసింది.
దాన్లో ఆమె, దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులంగా గుర్తించలేమని, దీనిపై తదుపరి చర్య తీసుకునే వరకు వారిని ఓ.బి.సి. గా పరిగణించాలని కోరారు. ఈ కమీషన్ పనిచేస్తున్న కాలంలో పలు క్రైస్తవ చర్చి సంస్థలు కమీషన్ కు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసారు. ‘ఒక దశలో కమీషన్ ‘ఒక వ్యక్తి విశ్వాసానికి చర్చి కి అస్సలు సంబంధం ఏమిటి, చర్చికి బయట ఉండే వ్యక్తి క్రైస్తవ విశ్వాసం సంగతి ఏమిటి?’ అని తన ముందు తమ వాదనలు వినిపించడానికి హాజరైన ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చిస్ ఆఫ్ ఇండియా’ ను ప్రశ్నించింది.
అయితే అందుకు కౌన్సిల్ సరైన వివరణ ఇవ్వలేకపోయింది’ అని ఆశా దాస్ అంటారు. ఇది ఇలా వుండగా ఈ డిమాండ్ కు అనుకూలంగా 24 ఆగస్టు 2009 న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బి.జే.పి. లోకసత్తా మినహా అన్ని పార్టీలు ఆమోదించిన తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపింది. నివేదిక అందిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ, మళ్ళీ అది దాని ఊసు ఎత్తలేదు. అలా అప్పటి సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది.
ఈ పూర్వ రంగంలో ‘క్రైస్తవ్యం – మతమార్పిడి’ అంశాన్ని సమీక్షించడానికి ‘గాంధీజీ’ కంటే మేలైన చారిత్రిక కూడలి మనకు ఇప్పుడు లేదు. ‘జాతిపిత’ గా ఇప్పటికీ కొనియాడబడుతున్న గాంధీజీని ఇప్పటి ఈ దేశ ఆధ్యాత్మిక సంక్లిష్టతల సందర్భంలో మన మార్గదర్శనానికి అన్వయించుకోవలసిన అవసరం, మునుపటికంటే ఇప్పుడు మరింతగా పెరిగింది. వ్యక్తిగతంగా ఆయనకున్న భిన్నమైన అనుభవం అటువంటిది.
అప్పటికి - పాచ్య దేశాలైన పోర్చుగీస్ డచ్చి తమ వాణిజ్యం కోసం, పడమర నుండి తూర్పుకు ఆసియాలోని చైనా ‘సిల్క్ రూట్’ లో కలవడానికి వలసలు మొదలయ్యాయి. అటువంటి చారిత్రిక క్రమంలో, తూర్పు వైపు నుండి పశ్చమాన దక్షణ అఫ్రికాకు, కెరటానికి ఎదురెళ్ళినవాడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఇండియాకు చెందిన ఒక వ్యాపారి కోర్టు కేసు నిమిత్తం 1893లో 24 ఏళ్ల ఈ యువ వకీలు అప్పటికే బ్రిటిష్ కాలని అయిన దక్షణ ఆఫ్రికా వెళ్ళాడు. అలా వెళ్ళిన ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి ఇండియాకు వచ్చింది 21 ఏళ్ల తర్వాత.
గాంధీజీ జన్మతా తనకున్న భారతీయ సనాతన ఆధ్యాత్మిక వారసత్వానికి, దక్షణ ఆఫ్రికాలో తన ఆంగ్లికన్ క్రైస్తవ మిత్రుల సహవాసం వల్ల కాలక్రమంలో జోడించుకున్నది - క్రైస్తవ్యం. తన వైఖిరిని ఆధునీకరించుకోవడానికి ఆయన బయట నుండి తెచ్చుకున్న సరళీకృత భావజాలం - బైబిల్ నుంచి. జీసస్ పర్వత ప్రసంగాన్ని గాంధీజీ ఎంతగానో ఇష్టపడేవారు. బహుశా అందుకు కారణం, మొదటి నుంచి తనకు తెలిసిన భారతీయ సనాతన జీవన విధానం దాని మూలాలు, అప్పటికే బైబిల్ పాత నిబంధనలో గాంధీజీకి కనిపించి ఉండాలి. మోజెస్ ధర్మశాస్త్రం, రూపాంతరం చెందిన సనాతన హైందవ ధర్మం పేరుతో అప్పటికే భారత్ లో అమలులో ఉండడం ఆయన గ్రహించి వుండాలి .
అందుకే, ఆయన బైబిల్ నూతన నిబంధనలో సరళీకృత రూపం తీసుకున్న జీజస్ బోధనలలోని ఆధునికత వైపు ఆకర్షితుడు అయ్యారు. అలా ఆయన మార్గం, సనాతన ధర్మంలోనే - జ్ఞాన మార్గం అయింది. దక్షణ ఆఫ్రికాలో 1904- 1906 మధ్య యువ గాంధీ ఉంటున్న ఇంటిలో ఒక పోర్షన్లో ఇంగ్లాండ్ లో పుట్టిన యూదు జాతీయుడు హెన్రీ పొలాక్ దంపతులు ఉండేవారు. వాళ్ళు తరుచూ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉండేవారు. గాంధీజీ ఆఫీస్ గదిలో గోడకు రనడే, అనీబీసెంట్ పోటోల మధ్య పెద్దగా కనిపించే జీసస్ ఫోటో ఉండేది.
ఒకరోజు ‘మీరు క్రైస్తవ్యాన్ని ఎందుకు మీ విశ్వాసంగా హత్తుకోలేదు గాంధీజీ?’ అంటూ మిసెస్ పొలాక్ నేరుగా గాంధీజీని అడిగింది. అందుకాయన – (“ To be a good Hindu also meant that I would be good Christian. There was no need for join your creed to be a believer in the beauty of teachings of Jesus or to follow his example”) ఒక ఉత్తమ హిందూగా జీవించడం అంటే, ఉత్తమ క్రైస్తవుడిగా జీవించడమే. జీసస్ బోధనల అంతర్యంలో ఉన్న సౌందర్యారాదనతోనో, లేదా ఆయన ప్రబోధించిన మార్గాన్ని అనుసరించడానికో ఒక విస్వాసిగా మళ్ళీ నేను మీ పంధాలోకి రానక్కరలేదు’. అంటూ, బైబిల్ పాత నిబంధనలో ఇప్పటికీ తమ ఆధ్యాత్మిక గమ్యాలను వెతుక్కుంటున్న, భారతీయ సనాతన మార్గ దృక్పధాన్ని వారికి చెప్పడానికి గాంధీజీ ప్రయత్నించారు.
ఇది జరిగిన సుమారు ఇరవై ఏళ్ళకు ఇండియాలో మహత్మ గాంధీని పెన్సిల్వేనియా స్వార్త్ మోర్ కాలేజి ఫిలాసఫీ ప్రొఫెసర్ డా. జే. హెచ్. హోల్మ్స్ తన ఇండియా పర్యటనలో 1927 జనవరి 11న గుజరాత్ లోని వార్ధాలో కలసి మాట్లాడారు. అప్పటికి ఆయన రాజకీయ రంగంలో ఉన్నారు. క్రైస్తవం గురించి గాంధీజీ తన మునుపటి అభిప్రాయాలనే ఇప్పుడు మరింత పదునుగా నిర్మొహమాటంగా వెల్లడించారు.
“నేను క్రీస్తును ఇష్టపడతాను, కానీ క్రైస్తవ్యాన్ని కాదు” (I like your Christ, but not your Christianity) అని నిర్ద్వందంగా తన అభిప్రాయాన్ని చెబుతూ “నేను క్రీస్తు బోధనలను విశ్వసిస్తాను, కానీ మీది (క్రైస్తవులది) క్రీస్తుకు భిన్నమైన ప్రపంచం. నేను బైబిల్ గ్రంధాన్ని ఎంతో విశ్వాసంతో అధ్యయనం చేస్తాను, కానీ దానిలో తమకు విశ్వాసం ఉందని ప్రకటించుకునే ‘చర్చి’ లో నేను క్రీస్తును చూడలేదు” అన్నారు. “క్రైస్తవులు అందరి మాదిరిగానే సంపద కోసం వెంపర్లాడతారు (బైబిల్ వాక్యానికి భిన్నంగా అనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు) తమ పొరుగువాడు నష్టపోయినా సరే, వాళ్ళు అది తనకు ప్రయోజనం అయితే చాలు అనుకొంటారు. వాళ్ళు ఇతరుల జీవితాలు, స్వేఛ్చ, సంతోషాలను ఫణంగా పెట్టి తమ క్షేమం సమృద్ది చూసుకుంటారు.
క్రైస్తవుల్లో (దేశాల్లో) యుద్ద కాంక్ష ఎక్కువ” ఇవి జాతీయ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న కాలంలో గాంధీజీ అభిప్రాయాలు. అయితే, ఇక్కడ గాంధీజీ వేర్వేరుగా రెండుగా చూస్తున్నవి ఏమిటి? ‘క్రైస్తవ్యం’ గురించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చిస్ పూర్వ కార్యదర్శి సుప్రసిద్ధ ఇండియన్ మిస్సాలజిస్ట్ డా. మథాయ్ జఖర్య చేసిన ఒక ఆసక్తికరమైన పరిశీలన తన ‘ఇన్ సైడ్ ది ఇండియన్ చర్చి’ (I.S.P.C.K. ప్రచురణ 1994) గ్రంధంలో మనకు కనిపిస్తున్నది “క్రైస్తవ్యం - భిన్న మత, నాగరికత, సంస్కృతులను ఒక్కటిగా అంటుకట్టిన ఒక వృక్ష ఫలం. గ్రీకు తత్వశాస్త్రం, రోమన్ న్యాయశాస్త్రం, మెడిటరేనియన్ ప్రాంతపు ఆరాధనా విధానాలు, హీబ్రూ మత నిష్ఠ, దేవుని నిరంతర మార్గదర్శకత్వం, వీటన్నిటి మేలు సమ్మేళనం అది. క్రైస్తవ్యానికి సహజంగా ఉన్న ‘డైనమిజం’ లక్షణం వల్ల, ఆదిమ ప్రపంచ స్తబ్ధ శతాబ్దాల కాలాన్ని అది ఛేదించింది.
దాన్ని వెనక్కి నెట్టి, ‘సరళతరమైన విశ్వాసం’ గా అది ముందుకు రావడంతో, దావానంలా ప్రపంచం నలుమూలలకు అది వేగంగా వ్యాపించింది” అంటారు. ఈ గ్రంధ రచనకు 90 ఏళ్ళ ముందుగా దక్షణ ఆఫ్రికాలో మిసెస్ పొలాక్ తో గాంధీజీ చెప్పాలని అనుకున్నది, జఖర్య చెబుతున్న ‘డైనమిజం’ గురించే! ఇందులోనే భారతీయ క్రైస్తవ్య కాలాన్ని డా. మథాయ్ జఖర్య మూడు భాగాలు చేస్తారు. ఒకటి –బ్రిటిష్ కాలం. రెండు – నెహ్రు కాలం. మూడు – ఆర్ధిక సంస్కరణల కాలం. వర్తమానంలో క్రైస్తవం చుట్టూ ‘మతమార్పిడి’ అంశాన్ని చేర్చి దాన్ని ఇంతగా వివాదాస్పదం చేసింది, సంస్కరణల కాలం. అంతకు ముందున్న రెండు కాలాలో వేదాంత జ్ఞానం అధ్యయనం ప్రధానంగా భారతీయ క్రైస్తవ్యం ఉండేది. ‘ఇండియన్ సొసైటీ ఫర్ క్రిష్టియన్ నాలెడ్జ్’ వంటి ఒక భారతీయ క్రైస్తవ వాంగ్మయ కేంద్రం 1710 లో డచ్చి, బ్రిటిష్, జర్మన్, మిషనరీలు చొరవతో డిల్లీ కాశ్మీర్ గేట్ వద్ద పనిచేయడం మొదలయింది. ఇప్పటికీ 300 ఏళ్ళ తర్వాత కూడా అది తన సేవలను కొనసాగిస్తున్నది.
( https://www.ispck.org.in) అయితే, ఈ ఆర్ధిక సంస్కరణల కాలంలో ప్రపంచీకరణ వల్ల సాంప్రదాయ ‘చర్చి క్రైస్తవ్యం’ నాలుగు గోడలు దాటి, దేశ సరిహద్దులు దాటి అది - ‘మిషన్ క్రైస్తవ్యం’ గా మారింది. వాటి మంచిచెడులు చర్చ పక్కన పెడితే, మారుతున్న కాలంతో పాటుగా ఇప్పుడు అది తన ‘టూల్స్’ ను పూర్తిగా మార్చుకుంది. మారిన ఈ కాలంలో మనవద్ద వచ్చినవారే - ప్రధాన వాణిజ్య మార్కెట్ రంగంలో ఒక ‘సత్యం’ రామలింగ రాజు, క్రైస్తవ సువార్త రంగంలో ఒక కె.ఏ. పాల్.
త్వరలో వందేళ్ళకు చేరువ అవుతున్న ఇండియాలో చాలా వాటితో పాటుగా వొక విశ్వాసంగా, ‘భారతీయ క్రైస్తవ్యం’ కూడా ఇప్పుడు పులుకడిగిన ముత్యం కావాల్సివుంది. అయితే, అది ఇప్పటి ‘చర్చి’ పరిధిలో అవుతుందన్న నమ్మకం లేదు. ఇక్కడే గాంధీజీ చెప్పిన – ‘క్రీస్తు చాలు మతం వద్దు’ స్వాంతన ఇస్తున్న పరిష్కారంగా కనిపిస్తున్నది.