ఇండియన్ నేషనలిజంకి టార్చ్-బేరర్ డాక్టర్ ముఖర్జీ

డాక్టర్ ముఖర్జీ ఎప్పుడు ఒకటి చెప్పేవారు - "ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్   ఔర్ దో నిషాన్ నహి చలెంగే"

Dr. Syama Prasad Mukherjee -  A torch bearer of Indian Nationalism

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి జాతీయవాదం  ఆలోచనను ప్రోత్సహించిన, జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో, దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం విత్తనాలను నాటిన ఒక వ్యక్తిని గనుక మనం గుర్తుచేసుకోవాలి అంటే.... మన మనస్సులో ఠక్కున తట్టే పేరు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. స్వాతంత్య్రం వచ్చిన తరువాత డాక్టర్ ముఖర్జీ ఎక్కువ కాలం మనుగడ సాగించనప్పటికీ అతని భావజాలం, అతని పోరాటాలు భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేశాయి.

జమ్మూ కాశ్మీర్ సమస్యను అర్థం చేసుకున్న డాక్టర్ ముఖర్జీ ఒక పరిపూర్ణ పరిష్కారం కోరుతూ తన గొంతుకను లేవనేత్తారు. బెంగాల్ విభజన జరుగుతున్నప్పుడు భారతదేశ హక్కులు, ప్రయోజనాల కోసం విజయవంతంగా పోరాడిన వ్యక్తి కూడా ఆయనే. స్వాతంత్య్రానంతర యుగంలో కాంగ్రెస్ భారతీయులపై తమ సొంత భావజాలాలను, సిద్ధాంతాలను రుద్దడాన్ని వ్యతిరేకించడంలో డాక్టర్ ముఖర్జీ ఒక ముఖ్యమైన కీలక పాత్ర పోషించారు. ప్రతి భారతీయుడికి అత్యంత అనుకూలమైన, స్థిరమైన జీవన విధానంగా ‘భారతదేశం, భారతీయులు, భారతీయత’ తో కూడిన రాజకీయ, సామాజిక భావజాలాన్ని ప్రోత్సహించడంలో, స్థాపించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.

డాక్టర్ ముఖర్జీ స్వతంత్రం వచ్చిన తరువాత నెహ్రూ ప్రభుత్వంలో భారతదేశపు మొట్టమొదటి పరిశ్రమలు, పౌరసరఫరాల శాఖామంత్రిగా ఉన్నారు. అతను ప్రభుత్వంలో చేరినప్పటికీ, నెహ్రూ-లియాఖత్ ఒప్పందంలో కాంగ్రెస్ హిందువుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించినందుకు ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అతని సైద్ధాంతిక స్పృహకు ఒక ప్రకాశించే ఉదాహరణ. డాక్టర్ ముఖర్జీ తన సైద్ధాంతిక కట్టుబాట్లతో ఎప్పుడూ రాజీపడలేదు. నెహ్రూ కేబినెట్ నుండి ఆయన చేసిన రాజీనామా దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం ఆవిర్భావానికి పునాది.

భారతదేశ స్వాతత్య్రం కోసం పోరాడటానికి రాజకీయ నాయకులు, వివిధ భావజాలాలను విశ్వసించే ప్రజలు కాంగ్రెస్ గొడుగు కిందకు వచ్చారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ స్వాతంత్య్రం తరువాత రాజకీయ శూన్యతను పూరించగల కాంగ్రెస్  ప్రత్యామ్నాయాన్ని కనుగొనటానికి చర్చ ప్రారంభమైంది. సాంస్కృతిక జాతీయవాదం ద్వారా జాతీయ సమైక్యత కోసం పాతుకుపోయిన రాజకీయ భావజాలం కోసం భారతదేశం ఆసక్తిగా చూసింది, దేశంలో ఈ సమయంలో ఫ్లాగ్ బేరర్ గా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ మారి జనసంఘ్ ను ఏర్పాటు చేసారు

21 అక్టోబర్ 1951న జనసంఘ్ ఏర్పడింది. వారి రాజకీయ ప్రయత్నాలే ఒక రాజకీయ పార్టీకి పురుడు పోసింది. ఇందులో జాతీయత, భారతీయత స్వాభావిక లక్షణాలు ఉన్నాయి. గత అనేక దశాబ్దాలుగా మనము చాలా ముఖ్యమైన మైలురాళ్లను దాటి, అనేక యుద్ధాలతో పోరాడాము. ఈ రోజు మనం ఉన్న స్థితికి చేరుకోవడానికి అనేక తిరుగుబాట్ల నుండి కూడా బయటపడ్డాము.

1951-52 మొదటి సార్వత్రిక ఎన్నికలలో జన సంఘ్ మూడు సీట్లు గెలుచుకోగలిగింది. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కోల్‌కతా సీటును గెలుచుకుని పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయన ఆలోచనల స్పష్టత, భావజాలం పట్ల ఆయనకున్న నిబద్ధత, దూరదృష్టితో ఒప్పించిన ప్రతిపక్ష పార్టీలు ఆయనను లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ ముఖర్జీ ప్రజల సమస్యలను లేవనెత్తారు, ప్రతిపక్షాల అత్యంత శక్తివంతమైన గొంతుగా ఎదిగారు.

డాక్టర్ ముఖర్జీ ఎప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370, స్పెషల్ స్టేటస్ భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి పెద్ద అడ్డంకులుగా భావించేవారు. ఇందుకోసం పార్లమెంటులో పలు సందర్భాల్లో  తన గొంతు వినిపించారు. 26 జూన్ 1952న జమ్మూ కాశ్మీర్‌పై చర్చలో పాల్గొన్నప్పుడు డాక్టర్ ముఖర్జీ ఒక ప్రజాస్వామ్య,  సమాఖ్య దేశమైన భారతదేశంలో ఒక రాష్ట్ర పౌరుల హక్కులు  వేరే ఇతర రాష్ట్రాలకన్నా భిన్నంగా ఎందుకు ఉంటాయనే చర్చను లేవనెత్తారు. ఇది భారతదేశం సమగ్రతకు, ఐక్యతకు హానికరం. జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించడానికి పర్మిట్ వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ఒకసారి జమ్మూలోకి ప్రవేశిస్తున్నప్పుడు డాక్టర్ ముఖర్జీని అరెస్టు చేశారు, దీంతో భారతదేశం అంతటా భారీ నిరసనలు జరిగి అరెస్టులకు దారితీసింది. 23 జూన్ 1953న అరెస్టు అయిన డాక్టర్ ముఖర్జీ 40 రోజుల తరువాత  ఒక మిస్టరీగా జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. అతని మృతి ఎన్నో ప్రశ్నలు లేని జవాబులను మిగిల్చింది, కాని అప్పటి నెహ్రూ ప్రభుత్వనికి  ఇవన్నీ కంటిమీద కునుకు లేకుండా చేసాయి. డాక్టర్ ముఖర్జీ తల్లి యోగ్మయ దేవి తన కుమారుడి మరణంపై దర్యాప్తు కోరుతూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు లేఖ రాశారు. కానీ ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. ఈ రోజు వరకు డాక్టర్ ముఖర్జీ అరెస్టు, మరణానికి సంబంధించిన చాలా రహస్యాలు వెల్లడికాలేదు.

డాక్టర్ ముఖర్జీ ఎప్పుడు ఒకటి చెప్పేవారు - "ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్   ఔర్ దో నిషాన్ నహి చలెంగే" (భారతదేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు). ఈ నినాదం మొదట జనసంఘం తరువాత భారతీయ జనతా పార్టీ తీర్మానం ఇంకా మార్గదర్శక సూత్రంగా మారింది. డాక్టర్ ముఖర్జీ  కల - "ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషన్ నహీ చలెంగే" - ఎప్పటికైనా నెరవేరుతుందా అనే ప్రశ్న దశాబ్దాలుగా భారత ప్రజల మనస్సులలో నిక్షిప్తమై ఉంది.

ఇది ఒక సైద్ధాంతిక యుద్ధం. ఒక వైపు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఎల్లప్పుడూ మైనారిటీవాద రాజకీయాలను ఆచరిస్తుంటే మరోవైపు ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి గట్టిగా కట్టుబడి ఉన్న బిజెపి. జనసంఘ్ యుగంలోనయినా, బిజెపి ప్రయాణంలో అయినా ... ఐక్యమైన, బలమైన భారతదేశాన్ని చూడాలనే నిబద్ధత, భావజాలంలో ఎటువంటి మార్పు లేదు, రాదు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ధృఢమైన సంకల్పం, అంకితభావాలతోపాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సమర్థవంతమైన వ్యూహం, ప్రణాళికలు వెరసి 2019 ఆగస్టులో భారతదేశం ఆర్టికల్ -370ని రద్దు చేయడంలో విజయవంతమైంది. "ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్, ఏక్ నిషాన్" అనే భారతదేశాన్ని చూడాలనే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారు.

ఆర్టికల్ 370ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంతో  నిజమైన అర్థంలో ఏకం చేయడం ద్వారా భారతదేశాన్ని ఒక బలమైన, ఐక్య దేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ కల సాకారం అవడంతో ఆయన చేసిన అత్యున్నత త్యాగం వృథా కాలేదు. డాక్టర్ ముఖర్జీ ఎల్లప్పుడూ ‘భారత మాత’ నిజమైన కుమారుడిగా అందరి మనసుల్లో నిలిచిపోతారు అతను తన భావజాలానికి నిజంగా కట్టుబడి ఉండి, ఐక్యమైన, బలమైన భారతదేశాన్ని చూడటానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. భారతమాతను ఐక్యంగా చూడాలనే కల కోసం ఆయన బలిదానం చేసారు. నిజమైన భారతమాత ముద్దుబిడ్డకు నా ఘన నివాళి

-  జగత్ ప్రకాష్ నడ్డా (భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios