మతానికి అతీతంగా ఎదగడం.. అతీక్ అహ్మద్ ఘటన విభజనను కాకుండా ఐక్యతను కోరుకుతుంది.. ఎందుకంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ఏప్రిల్ 15వ తేదీన ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ఏప్రిల్ 15వ తేదీన ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లను పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా దుండగులు ఈ దారుణానికి ఓడిగట్టారు. అతీక్ అహ్మద్ విషయానికి వస్తే ఆయన ఒక గ్యాంగ్ స్టర్.. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు.
జర్నలిస్టులు వేషంలో వచ్చిన దుండగులు అతీక్, అష్రఫ్‌లపై దాడి చేసిన దృశ్యాలు కూడా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధుల కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే ఈ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ సబర్బన్ ముస్లింలలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సంఘటనను చట్టవిరుద్ధమైన హత్యగా చూస్తున్నారు. చట్టబద్ధమైన పాలన లేకపోవడానికి దీనిని ఉదాహరణగా పేర్కొంటున్నారు. భారతదేశంలోని ముస్లిం జనాభా పరిమాణం, వ్యాప్తిని బట్టి ముస్లిం సెంటిమెంట్ గురించి ఇటువంటి అంచనాలు సరైనవో కాదో చెప్పడం కష్టంగా ఉన్నప్పటికీ.. అతీక్ అహ్మద్ మరణాన్ని మతపరమైన గుర్తింపుతో కూడినదిగా కాకుండా నిష్పాక్షికత కోణంలో చూడటం చాలా అవసరం.
అతీక్ అహ్మద్ జీవితం నాటకీయ ఎత్తుపల్లాల కథ. 17 సంవత్సరాల వయస్సులో ఆయన హత్య ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్కడి నుండి ఆయన జీవితం నేర మార్గం వైపు మళ్లింది. దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యలతో సహా 100కు పైగా కేసుల్లో ఇరుక్కున్నారు. మాఫియా సంబంధాలు, డబ్బు బలంతో ఆయన రాజకీయ నాయకునిగా మారారు. అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గానికి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోవైపు అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఎస్‌పీకి చెందిన రాజు పాల్ గెలుపొందారు. రాజు పాల్ అన్ని అంచనాలకు విరుద్ధంగా 2004 ఉప ఎన్నికలో అతీక్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ అహ్మద్‌ను ఓడించారు.
అయితే నెలరోజుల్లోనే రాజు పాల్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య 2005 జనవరి 25న జరిగింది. రాజు పాల్ భార్య పూజా పాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతీక్‌తో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. హత్య కారణంగా అక్కడ మరొసారి ఉప ఎన్నిక అవసరమైంది. అయితే రాజు భార్య పూజా పాల్‌ను ఓడించి అలహాబాద్ వెస్ట్ సీటును అష్రఫ్ గెలుచుకున్నారు.
అతీక్ అహ్మద్ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే.. ఆయన యాదృచ్ఛికంగా ముస్లిం.. కానీ ఎంపిక ద్వారా గ్యాంగ్‌స్టర్. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన మతం పరిస్థితికి సంబంధించినది. అయినప్పటికీ.. ఆయన నేర జీవితం, ఆయన చేసిన అనేక దారుణాలు అనేవి ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఉన్నాయి. ఆయన జీవితంలోని ఈ రెండు అంశాల మధ్య తేడాను గుర్తించడం చాలా కీలకం. అతీక్ మతపరమైన గుర్తింపు అనేది.. ఆయన బాధ్యత వహించాల్సిన తప్పులను కప్పివేయనివ్వకూడదు.
భారత రాజ్యాంగం మతం, కులాలు లేదా లింగంతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం సమానమైన గౌరవాన్ని పొందే హక్కును హామీ ఇస్తుంది. కొన్ని సంఘాలు అట్టడుగున ఉన్నాయనే భయం నిజమే అయినప్పటికీ.. చట్టం సిద్ధాంతపరంగా నిష్పక్షపాతంగా ఉందని గుర్తుంచుకోవాలి. అతీఖ్ అహ్మద్ ఒక ప్రసిద్ధ నేరస్థుడు అయినందు వల్ల.. ఆయన హత్యను ముస్లింను లక్ష్యంగా చేసుకోవడం కంటే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన సంఘటనగా చూడాలి. 2021లో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేని ఉత్తరప్రదేశ్ ఎస్‌టీఎఫ్ చంపింది. ఆ సమయంలో అతని మతాన్ని ఎవరూ చూడలేదు.
యూపీ ప్రభుత్వం రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను నెలకొల్పడానికి మాఫియాకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. యూపీ పోలీసులు మాఫియాపై దాడులను కొనసాగిస్తున్నందున అక్కడ తరచుగా ఎన్‌కౌంటర్లు నమోదవుతున్నాయి. అతీక్ మతపరమైన గుర్తింపుపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం ద్వారా.. అనవసరమైన విభజనను సృష్టించే ప్రమాదం ఉంది. ఇది సంఘాల మధ్య ఉద్రిక్తత, అపనమ్మకాన్ని మరింతగా పెంచగలదు.
ఈ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. దీనిపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సీఆర్‌పీసీ సెక్షన్ 144 విధించింది. ఈ హత్యపై విచారణకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ అరవింద్ కుమార్ త్రిపాఠి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సుబేష్ కుమార్ సింగ్, మాజీ జిల్లా జడ్జి బ్రిజేష్ కుమార్ సోనీ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు.
అతీక్ అహ్మద్ బాధితులకు కూడా మానవులేనని.. వారు కుటుంబాలు, ప్రియమైనవారిని కలిగి ఉన్నారని ముస్లిం సమాజం గుర్తుంచుకోవాలి. అతీక్ బాధితుల్లో చాలామంది ముస్లింలు కూడా అయి ఉండొచ్చు. ఎంతోమందికి అపారమైన బాధను కలిగించిన వ్యక్తిని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేయడం ద్వారా.. మనం అతని బాధితుల దుస్థితిని విస్మరిస్తున్నారనే సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకు బదులుగా అతీక్ అహ్మద్ నేర కార్యకలాపాల విస్తృత ప్రభావాన్ని, ఆయన చేతుల్లో బాధపడ్డ వారికి అందించబడిన న్యాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం.
అతీక్ అహ్మద్ చర్యలు, ఎంచుకున్న నేరపూరిత జీవనశైలి ఇస్లాం విలువలు, బోధనలకు ప్రాతినిధ్యం వహించడం లేదని భారతీయ ముస్లింలు గ్రహించడం కూడా చాలా అవసరం. ఆయన నేర కార్యకలాపాలను ముస్లిం సమాజంతో ముడిపెట్టడం మూస పద్ధతులను బలపరుస్తుంది. అలాగే హానికరమైన కథనాలను శాశ్వతం చేస్తుంది. బదులుగా ముస్లిం సమాజం అతీక్ అహ్మద్ వంటి నేరస్థుల చర్యల నుంచి తమను తాము దూరం చేసుకోవడం, శాంతి, అవగాహన, సామరస్యాన్ని పెంపొందించడానికి ఇతర వర్గాలతో కలిసి పనిచేయడం చాలా కీలకం.
-షోమైలా వార్సీ