తరాల నుండి మహిళలు తమ పై రుద్దబడిన అనేక  ఆంక్షలు, వివక్షత, దోపిడీలకు వ్యతిరేఖంగా పోరాడుతూ, అవరోధాలను అధిగమిస్తూ  రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆర్థిక రంగాలలో  సాధించిన విజయాలను ఉత్సహభరితంగా, స్పూర్తి దాయకంగా మననం చేసుకుంటూ సమత్వ సాధనలో మరింత పురోగమించడానికి ప్రతి ఏటా మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నుండి ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం కోవిడ్ మహమ్మారి కాలంలో స్త్రీల చొరవ, ధైర్య సాహస సేవల నేపథ్యంలో పాలనా విధానాల రూపకల్పనలో, నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీల పాత్ర పెరగడానికి "నాయకత్వంలో మహిళలు-కోవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్ ను సాధించడం"ఇతివృత్తంతో నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపు నిచ్చింది.  కొవిడ్ మహమ్మారితో శ్రామిక శక్తిలో ఉన్న  మహిళల జీవితం చిన్నాభిన్నం అయ్యింది.  ఇప్పుడిప్పుడే మహమ్మారి నుండి దేశాలు కొలుకుంటున్నాయి.  ఈ దశలో తమ భవిష్యత్ మార్చగల   నిర్ణయాలలో మహిళలకు పూర్తి పాత్ర పోషించే అవకాశం ఉండాలి.  ఇది ప్రస్తుత తరాలను రాబోయే తరాలను ప్రభావితం చేస్తుందని యు. యన్. అభిప్రాయపడింది.

కోవిడ్ సంక్షోభ సమయంలో పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా స్త్రీలు ఉద్యోగాలు కోల్పోయారు.  కెరీర్ పట్టాలు తప్పి ఉపాధి అవకాశాల లేమి ఏర్పడింది. ఇది స్త్రీలలో దారిద్ర్య రేటును మరింత పెంచింది.  ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక శక్తిలో ఉన్న  613 మిలియన్ల స్త్రీలు ఇంకా మహమ్మారి షాక్ నుండి కొలుకోలేదు.  సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో పొందిన మహిళా సాధికారత , హక్కులు ప్రమాదంలో పడ్డాయి.  జీవనోపాధి లేక శ్రామికవర్గ, చిన్న ఉద్యోగ పురుషులు వ్యసనాలకు, మానసిక రుగ్మతలకు లోనై స్త్రీలపై హింసకు పాల్పడిన సంఘటనలు చాలా ఎక్కువగా నమోదయ్యాయి.  దీనికి తోడు భారత్ తో పాటు అనేక దేశాల్లో వాతావరణ మార్పులు, అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  గ్రామీణ మహిళల ఉపాధి తగ్గింది.

ఆర్ధిక భద్రతను కల్పించే చర్యలలో స్త్రీలు తిరిగి శ్రామిక శక్తిలో చేరడం కోసం  దేశాలు తమ జిడిపిలో నెల వారిగా 0.7% కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.  మహిళల పురోగతి రేటు అనుకున్నంత స్థాయిలో పెరగడం లేదు.  ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగినట్లయితే లింగ సమానత్వం సాధనకు ఇంకా 130 సంవత్సరాలు పడుతుందని UNDP తెలియచేసింది.

సంక్షోభ కాలంలో కోవిడ్  మహమ్మారికి వ్యతిరేక యుద్ధంలో  కాంతిరేఖలుగా, ముందు వరుస యోధులుగా మహిళలు నిలిచిన అపూర్వ సన్నివేశాలను చరిత్ర నమోదు చేసింది. సవాళ్ళను ఎదుర్కోవడంలో, పరిష్కారంలో మహిళా నాయకత్వం పని చేసిన ప్రతి చోట సానుకూల ఫలితాలు వచ్చాయి. అత్యంత ప్రశంసనీయమైన  స్పందనలు లభించాయి.

శైలజ టీచర్ గా పాపులర్ ఐన కేరళ ఆరోగ్య మంత్రి ఆ రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులను తనదైన జన చైతన్య, సకాల సానిటేషన్ చర్యలతో కనిష్ఠ స్థాయికి తీసుకువచ్చారు.  న్యూజిలాండ్ యువ ప్రధాని జాకిందా ఆర్డర్న్ కరోనా సంక్షోభ నిర్వహణ విధానాలను సమర్ధవంతంగా ప్రజలలో తీసుకెళ్లి కట్టడి చేయగలిగారు.  ఫిన్ లాండ్ మహిళా ప్రధాని సాన్ మారిన్,  తన మహిళా కేబినేట్ చురుకైన నిర్ణయాలతో కరోనాను తొలి దశలోనే నియంత్రించి , ఆరోగ్య కార్యకర్తల పిల్లల సంరక్షణ, వృద్ధుల రక్షణలో విశేష కృషి జరిపాయి.  ప్రాన్స్ లింగ సమానత్వ మంత్రి మార్లిన్ మహిళలను గృహ హింస బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్, ఐస్ లాండ్ మహిళా ప్రధాన కట్రిన్ జాకబ్ లు తమ దేశాల్లో కరోనా విలయం నుండి  బయటపడటానికి  వేగవంత కృషి జరిపి ఆదర్శప్రాయులుగా నిలిచారు.  కరోనా చికిత్స సేవలు అందిస్తున్న వారిలో  70%మహిళా ఆరోగ్య కార్యకర్తలు.  వీరు తమ ప్రాణాలను లెక్క చేయకుండా   విసుగు విరామం లేకుండా పని చేశారు.  ఈ క్రమంలో అనేక మంది అమరులై ఇతిహాసపు అమృత వీరులుగా నిలిచారు.

భారతదేశము మహిళా సాధికారత సూచికలలో అత్యంత వెనుకబడి ఉంది. లింగ వ్యత్యాస సూచిలో 105 వ స్థానం.  విద్య ఆరోగ్య సూచిలో 114 వ స్థానం.  స్త్రీల రక్షణలో ప్రమాదకరంగా మారిన దేశాలలో 4వ స్థానం కలిగి ఉంది .  ఇదే క్రమంలో సైన్స్, టెక్నలాజి, ఇంజనీరింగ్, మెడిసిన్ లో చేరుతున్న, అసమాన ప్రతిభ చూపుతున్న స్త్రీల సంఖ్య పెరుగుతుంది.  రక్షణ రంగంలో క్షిపణుల రూపకర్తగా టేస్సి థామస్, అంతరిక్ష రాకెట్ ల రూపకర్తగా రీతూ కర్దాల్ , నవధాన్య ఉద్యమ నేతగా వందనా శివ , అథ్లెట్ గా హిమ దాస్ మహిళా లోకానికి స్పూర్తి దాయకంగా నిలుస్తున్నారు.  మహిళ, పర్యావరణ ఉద్యమాల్లో మేధా పాట్కర్, నికిత ఆజాద్, దిశ రవి , సాహితి రంగంలో అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్ వంటి వారు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచారు.

అనేక నూతన తరం యువతులు మార్పును స్వాగతిద్దాం అని అన్ని రంగాలలో తమ భాగస్వామ్యాన్ని పెంచడం కోసం క్షేత్రస్థాయిలో, సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాలు నడుపుతున్నారు.  ఈ ఉద్యమాలపై  కొన్ని చోట్ల చాందస శక్తులు, మరి కొన్ని చోట్ల  ప్రభుత్వాలు అణిచివేతకు పాల్పడుతున్నాయి.  రైతులను కాపాడితే జాతిని కాపాడినట్లే అనే నినాదాలతో వ్యవసాయ చట్టాల రద్దుకు,  రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలిపిన నవదీప్ కౌర్, దిశా రవి, వివక్షలు అంతరించి పోవాలని గళమెత్తిన జ్యోతి జగ్ తప్ , సుధా భరద్వాజ్ , అటవీ రక్షణ ఆదివాసీల కోసం పని చేస్తున్న షబ్నం, బాల్య వివాహాల రద్దు కోసం పని చేస్తున్న కృతి భారతిలపై తప్పుడు కేసులు పెట్టి అణచివేస్తున్నారు.   విషాదం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వముతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ఆధారంగా కాకుండా మనుస్మృతితో స్త్రీల వివాహ స్వేచ్ఛ , విడాకుల హక్కును కాలరాసే చట్టాలను రూపొందిస్తున్నాయి.  లవ్ జిహాద్, ఖాప్ పంచాయితీల పేరుతో అన్య మతస్థుల, నిమ్నకులాల స్త్రీల పై దాడికి మద్దతును ఇస్తున్నాయి. ఇటీవల పురుషాధిక్య భావజాలం ఉన్న న్యాయమూర్తులు అత్యాచార భాదితులు పట్ల ఇస్తున్న తీర్పులు మానవత్వానికి మచ్చగా నిలుస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం( UNDP) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 లలో లింగ సమానత్వం కీలకమైనది.   కరోనా కాలంలో  ఉపాధి,హింస వంటి వాటిలో పెను మార్పులకు లోనైన స్త్రీల , బాలికల జీవితాలు మళ్ళీ గాడిన పడే పనులను ప్రభుత్వాలు, పౌర సమాజం చేపట్టాలి. ఆర్ధిక పునరిజ్జివనం తక్షణ కర్తవ్యం కావాలి. ప్రభుత్వ సంస్థలు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థ, ప్రవేట్ రంగంలో స్త్రీల భాగస్వామ్యం , నాయకత్వాన్ని పెంచాలి. Women feeds world-women first prosper నినాదం వెలుగులో ఆర్ధిక భద్రత, విద్యా ఆరోగ్య వికాసం కోసం కృషి చేయాలి.  ఈ చర్యలతో మరింత సమానమైన, సమగ్రమైన స్థిరమైన భవిష్యత్తు మహిళలకు అందించబడుతుంది.  ఇది ప్రజాస్వామ్య, శాంతియుత సమాజాలకు దారితీస్తుంది.