గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసాధారణమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, రాష్ట్ర ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య యుద్ధంలా పరిణమించింది. ఇందులో విజయం ఎవరిదనేది త్వరలో తేలనుంది. ప్రభుత్వం వద్దని చెబుతున్నా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఎన్నికలు నిర్వహించి తీరుతానని పట్టుబట్టిన రమేష్ కుమార్ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ ను రమేష్ కుమార్ శనివారం జారీ చేశారు. జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లు జరిగాయని కూడా చెప్పారు. ఎన్నికల నిర్వహణ సవాల్ గానే మారిందని, అయితే వాటిని నిర్వహించి తీరుతామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన సూచనను ఆయన తిరస్కరించారు. 

ఎన్నికల కమిషన్ కు స్వయంప్రతిపత్తి ఉన్న మాట నిజమే. రాజ్యాంగబద్ధ సంస్థ అనేది కూడా వాస్తవమే. ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్ మీద ఉంది. అయితే, ప్రభుత్వ సహకారం లేకుండా, ప్రభుత్వాధినేతతో తలపడి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నను ప్రస్తుత పరిణామం ముందుకు తెచ్చింది. 

ప్రభుత్వ సహాయ నిరాకరణపై గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు కూడా ఎక్కారు. గవర్నర్ ను కూడా కలిశారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ సహాయ నిరాకరణ ప్రకటిస్తోంది. కరోనాను సాకుగా చూపించి ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించడం సాధ్యం కాదని అధికార యంత్రాంగం చెబుతోంది. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగం మాట కాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనకుండి నడిపిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. 

ఎన్నికలను బహిష్కరిస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు తెగేసి చెబుతున్నారు. ఈ స్థితిలో శనివారం సాయంత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఓ తంతుగా మాత్రమే మిగిలింది. ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు రకరకాల కారణాలు చెప్పి డుమ్మా కొట్టారు. 

అధికార యంత్రాంగం, ఉద్యోగులు సహకరించకుండా ప్రస్తుతం ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధంగా నిర్వహిస్తారనేది ప్రశ్నగా మిగిలింది. ఆయన తదుపరి కార్యక్రమేమిటనేది కూడా తెలియడం లేదు. కాకుంటే రేపు ఆదివారం ఆయన గవర్నర్ ను కలవబోతున్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని సిబ్బందిని సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్ అంత దూరం వెళ్తారా అనేది ప్రశ్న.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సూచనల ప్రకారం నడుచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెసు నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు పట్టని ఎన్నికలకు కరోనా కాలంలో ఇప్పుడు ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 

కాగా, రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకూడదనే పట్టుదలతో వైఎస్ జగన్ ఉన్నారు. తన హయాంలోనే ఎన్నికలను పూర్తి చేయాలనే పట్టుదలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెసు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూనే వస్తున్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉద్వాసన పలికి, మరొకరిని ఎన్నికల కమిషనర్ గా నియమించిన జగన్ ప్రభుత్వం చర్య కోర్టులో వీగిపోయింది. తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా నియమితులయ్యారు. తాను తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఉత్సుకత ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆయన చర్యలకు ఎప్పటికప్పుడు జగన్ ప్రభుత్వం అడ్డు పడుతూనే ఉంది. 

జగన్ ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులను దాటి ఎన్నికలను నిర్వహించడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా ఎన్నికలను నిర్వహించడం సాధ్యం చేసే సాధనమేదైనా భవిష్యత్తులో వస్తుందా చూడాలి. 

రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిలో గవర్నర్ ముందడుగు ఎలా ఉంటుంది, కేంద్రం జోక్యం చేసుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది.