2020 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వాట్సాప్‌ పనిచేయడానికి చివరి రోజు. మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ పనిచేయడం ఆగిపోతుంది. అయ్యబాబోయ్‌ అదేంటి మా ఖాతాలు ఏమవుతాయి? అని కంగారు పడకండి. ఇది కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమే సుమా! 

కొన్ని ఆపిల్‌ ఫోన్లలోనూ కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ ఆ రోజునుంచి వాట్సాప్‌ ఇక పని చేయదు. మీ ఫోన్‌ కచ్చితంగా అందులో ఉండే అవకాశం తక్కువ. ఎందుకంటే - ఐఓఎస్ 8 గానీ అంతకంటే పాత వెర్షన్‌ గానీ వాడే ఆపిల్‌ ఫోన్లలో  ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వాట్సాప్‌ సపోర్ట్ చేయదు. 

అలాగే ఆండ్రాయిడ్‌ మాటకు వస్తే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.3.7 గానీ అంతకు ముందు వెర్షన్లు గానీ ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు. కనీసం యాండ్రాయిడ్‌ 3.0 అయినా లేని పాత ఫోన్‌ అయితే తప్ప మీరేం కంగారుపడనక్కరలేదు. 

ఐ ఫోన్‌ వినియోగదారులు తమ ఫోన్లో కనీసం ఐఓఎస్ వెర్షన్‌ 9.0 ఉన్నా ఈ వార్త గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఇన్ని వెర్షన్లు అప్‌గ్రేడయినా ఇప్పటికీ పాతకాలం ఫోన్లనే పట్టుకు కూర్చుంటామనేవాళ్లు మాత్రం వాట్సాప్‌ని తప్పనిసరిగా త్యాగం చేయాల్సి ఉంటుంది.