న్యూఢిల్లీ: భారతదేశంలోని తమ వ్యాపారాలు, ఆస్తులను మహీంద్రా అండ్ మహీంద్రాకు అప్పగించడానికి ఫోర్డ్ ఇండియా రంగం సిద్ధం చేసింది. 20 సంవత్సరాల్లో భారతదేశంలో నిలదొక్కుకోవడంలో విఫలమైన ఫోర్డ్ ఇండియా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

మహీంద్రా అండ్ మహీంద్రాలో ఫోర్డ్ ఇండియా విలీనం తర్వాత ఏర్పాటయ్యే సంస్థలో మహీంద్రా సంస్థకు 51 శాతం వాటా ఉండనున్నది. కానీ బోర్డులో మాత్రం ఫోర్ట్ ఇండియాకు సమాన ఓటింగ్ హక్కులు, సభ్యత్వాలు లభిస్తాయి.

మరో వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ విలీన సంస్థ పరిధిలో మాత్రం ఫోర్డ్ గ్లోబల్ సర్వీస్ బిజినెస్, ఎగుమతుల కోసం ఏర్పాటు చేసిన ఇంజిన్ ప్లాంట్ మాత్రం ఉండవు.

భారతదేశ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ఫోర్డ్ సంస్థ సుమారు 200 కోట్ల డాలర్లను వెచ్చించినా విపణిలో కేవలం మూడు శాతం వాటాను మాత్రమే దక్కించుకున్నది. తాజాగా కొత్త ఒప్పందంతో అతిపెద్ద మార్కెట్ నుంచి వైదొలుగకుండా ఫోర్డ్ కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నది.

ఇప్పటికే ఫోర్ట్ సంస్థ 1100 కోట్ల డాలర్ల వ్యయంతో విదేశీ మార్కెట్లను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇంతకుముందే గతేడాదిలోనే దేశీయంగా ఆటోమొబైల్ రంగంలో సేవలందిస్తున్న ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ చేతికి అమెరికాకు చెందిన బిల్ ఫోర్డ్ జూనియర్ సారథ్యంలోని ఫోర్డ్ కంపెనీ వస్తుందని వార్తలొచ్చాయి.

ఈ మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఆనంద్ మహింద్రా, ఫోర్డ్ సంస్థ యజమాని బిల్ ఫోర్డ్ జూనియర్ మధ్య ప్రాథమికంగా సంప్రదింపులు జరిపారు. 1995కి ముందు రెండు దశాబ్ధాల ముందు మాదిరిగా మరో దఫా సుదీర్ఘ అనుబంధం పెనవేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. దీని ప్రకారం మహీంద్రా అండ్ మహీంద్రాలో 49 శాతం వాటాను ఫోర్డ్ స్వాధీనం చేసుకోనున్నది.

రెండు సంస్థలు భారతదేశంలో జాయింట్ వెంచర్‌గా ఉత్పత్తి చేపట్టాలని భావిస్తున్నాయని రెండు సంస్థల సన్నిహిత వర్గాల కథనం. అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, జాయింట్ వెంచర్‌గా మారుతుందా? లేదా? చెప్పలేమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా పూర్తిగా ఫోర్డ్ సంస్థకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని తహతహలాడుతోంది. అలాగే అమెరికా మార్కెట్‌లో వాటాను పొందాలని కోరుకుంటున్నది. ఇంతకుముందు కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ఇతర ఆటోమొబైల్ సంస్థలు.. ఫ్రెంచ్ కారు మేకర్ రెనాల్ట్, నావిస్టార్ సంస్థలతో జాయింట్ వెంచర్ కోసం ప్రయత్నాలు సాగించినా ఫలించలేదు.

1998 నుంచి భారతదేశ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రకరకాల పాట్లు పడింది ఫోర్డ్ యాజమాన్యం. రెండు బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినా లాభాలు గడించలేకపోయింది ఫోర్డ్.

ఫోర్డ్ ఇండియా విక్రయాలు 2017లో ఒక శాతం పెరిగి 87,588కి చేరుకున్నాయి. ఎగుమతులు 15 శాతం పెరిగి 1,75,588 యూనిట్లకు చేరాయి. ఫోర్డ్ ఇండియా జూలై విక్రయాలు, ఎగుమతులు కలిసి గతేడాది 26,075 కార్లయితే, ఈ ఏడాది 25,028 కార్లు ఉన్నాయి.