విస్తరణ కాంక్ష: ఈ-కామర్స్, స్టార్టప్స్‌లో కొలువుల కోలాటం
దేశీయంగా ఈ - కామర్స్ బిజినెస్ క్రమంగా ఊపందుకుంటున్నది. మరోవైపు టెక్ స్టార్టప్స్ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ -కామర్స్, స్టార్టప్ సంస్థలు తమ కార్యకలాపాలన విస్తరణ కోసం జోరుగా నియామకాలు చేపట్టాయి
మార్కెట్లో తమ వ్యాపారం సుస్థిరం చేసుకోవడంతోపాటు స్టార్టప్, ఈ-కామర్స్ కంపెనీలు విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకనుగుణంగా ఉద్యోగాలను పెంచుతున్నాయి. ఉద్యోగ అవకాశాల కల్పనలో ఒక దానితో ఒకటి పోటీపడుతున్నాయి.
ఈ కంపెనీలు టెక్నాలజీ, సప్లయ్ చెయిన్ విభాగాల్లో నైపుణ్యాలు కల వారిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. వ్యాపారానికి వెన్నెముకగా ఉండే విభాగాల్లో నిపుణులను నియమించుకోవడం ద్వారా సులభంగా విస్తరణను సాగించవచ్చన్నది ఈ కంపెనీల ప్లాన్.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ కంపెనీలు 44 వేలకు మించి ఉద్యోగులను నియమించుకోనున్నట్టు టీమ్‌లీజ్ రీసెర్చ్ అంచనా వేస్తోంది. నిపుణులకు డిమాండ్ పెరుగుతుండటంతో వారు చెల్లించే జీతం కూడా ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు భారతదేశంలో ఈ - కామర్స్ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో 25 శాతం అభివ్రుద్ధి చెంది 35 బిలియన్ల డాలర్లకు చేరుతుందని నాస్కామ్ -పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. ఇక ఆన్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలను ఆర్డరు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఆకర్షణీయమై డిస్కౌంట్లు, ఆఫర్లు ఉండటంతో వినియోగదారులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు ఇప్పటికే అనేక మంది డెలివరీ బాయ్‌లకు ఉపాధిని కల్పిస్తున్నాయి.
స్విగ్గీ, జొమాటో వంటి స్టార్ట ప్‌లు ఈ ఏడాదిలో గత ఏడాదికన్నా కనీసం 25 శాతం ఎక్కువగా సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బడ్జెట్ ధరల్లో హోటల్ గదులను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్న ఓయో, ఆన్‌లైన్ ద్వారా అనేక కోర్సులను ఆఫర్ చేస్తున్న బైజూస్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్నాయి.
విభిన్న కంపెనీల పాలసీలను అందిస్తున్న పాలసీబజార్ కూడా నియామకాలను పెంచుకుంటోంది. ఒకే విభాగంలోని కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతోంది. నాయకత్వ వాటా కోసం కంపెనీలు ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విలీనాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి.
కొన్ని కంపెనీలకు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కేపిటల్ కంపెనీల నుంచి నిధులు అందుతున్నాయి. దీంతో ఉద్యోగులను నియమించుకోవడానికి ఆయా కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం దేశీయంగా ఈ-కామర్స్ మార్కెట్ పరిమాణం 3,500 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్నట్టు పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఇది 25 శాతం వృద్ధి చెందవచ్చని భావిస్తున్నారు. మార్కెట్ విస్తృతి నేపథ్యంలో మంచి నైపుణ్యాలు ఉన్న వారిని ఎక్కువ జీతాలు ఇచ్చి తీసుకోవడానికి ఈ కంపెనీలు ముందుకువస్తున్నాయి.
స్టార్టప్‌లు కూడా ఈ విషయంలో ఎంత మాత్రం వెనుకాడటం లేదు. కొన్ని సందర్భాల్లో ఈ కంపెనీల్లో జీతాలు ఎంట్రీలెవల్‌లో చేరే ఇంజనీర్లకన్నా ఎక్కువగా ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
కొన్ని చిన్న కంపెనీల్లో ఎంట్రీ లెవల్లో చేరుతున్న ఇంజనీర్లకు నెలకు రూ.15,000 స్థాయిలో వేతనం అందుతోంది. కానీ ఈ-కామర్స్ కంపెనీల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు సగటున రూ.23,000-28,000 అందుతున్నట్టు తెలుస్తోంది.
క్లౌడ్ ఆర్కిటెక్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సిటీ హెడ్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌కు ప్రస్తుత నియామకాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఈ -కామర్స్ అండ్ కన్జూమర్ ఇంటర్నెట్ ప్రతినిధి అంకుర్ పాహ్వా తెలిపారు.
బడ్జెట్ రూం ప్రొవైడర్ ‘ఓయో’ నూతన ఇంటర్నేషనల్ కేంద్రాలకు విస్తరించేందుకు తమ సిబ్బందిని రెట్టింపు చేసుకునే దిశగా ప్రణాళికలు రూపొందించింది. గతేడాది రెండుసార్లు నియామకాలు చేపట్టింది.
టెక్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకానికే ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వైవిధ్య రంగాల్లో ప్రతిభావంతులను నియమించుకుంటున్నట్లు ఓయో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ దినేశ్ ఆర్ పేర్కొన్నారు. ట్రాన్స్ పోర్టేషన్, లాజిస్టిక్ రంగాల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది.