Asianet News TeluguAsianet News Telugu

యాప్స్ ఆఫర్స్‌కు ఆశపడ్డారో... మీ సొమ్ము గోవిందా..!!

ఫ్రాడ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆర్బీఐతోపాటు ఐటీ, డిజిటల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊరించే ఆఫర్లను నమ్మి యాప్ డౌన్ లోడ్ చేసుకోకుండా ఆచితూచి స్పందించాలని లేకపోతే బ్యాంకు ఖాతాల్లోని సొమ్మంతా ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు. 
 

Beware of Any Desk type fraudulent apps
Author
New Delhi, First Published Mar 3, 2019, 4:06 PM IST

ఇది స్మార్ట్‌ ఫోన్ల యుగం.. అంతకు మించి డిజిటల్ ప్రయాణం... దాదాపు అన్నీ ఆన్ లైన్ చెల్లింపులే... ప్రతి చెల్లింపుకో యాప్.. కొత్తగా స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేవారు తమ ఫోన్లలో ఎడాపెడా ఇన్‌స్టాల్‌ చేసేసుకుంటారు.

కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బిల్లుల చెల్లింపునకు నగదు రాయితీ, క్యాష్‌బ్యాక్‌ ఇచ్చే యాప్‌లంటే మోజు పడీ మరీ ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. 

బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానం అయ్యే యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) ఆధారిత చెల్లింపు వ్యవస్థ కల యాప్‌లు అధికమవుతున్న క్రమంలో, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఖాతాలోని సొమ్ముకు నీళ్లొదులుకోవాల్సిందేనని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)తోపాటు ఆర్థిక, ఐటీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజువారీ కార్యకలాపాలకు ఉపకరించే యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ఎక్కువైంది. ఆటో/క్యాబ్‌ బుక్‌ చేసుకోవడం మొదలు.. బిల్లుల చెల్లింపు, దుకాణాల్లో కొనుగోళ్లకూ మొబైల్‌ ఫోన్‌ను వాడుతున్నారు.

పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్‌, ఎయిర్‌టెల్‌ మనీ, జియో మనీ, అమెజాన్‌పే వంటి మొబైల్‌ వాలెట్లలో నగదు నింపి చెల్లింపులు చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంక్‌ ఖాతా నుంచి వాలెట్లకు నగదు బదిలీ చేయాల్సి వచ్చేది. 

కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) పూర్తిచేసి, యూపీఐ ఆధారంతో బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానం చేసుకుంటే.. ప్రత్యేకంగా వాలెట్‌లో నగదు నింపాల్సిన పనిలేదు. బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నెంబర్ నుంచి లాగిన్‌ అయి, యూపీఐ పాస్‌వర్డ్‌ నమోదు చేస్తే, ఏ చెల్లింపులైనా క్షణాల్లో చేసేయవచ్చు.. ఇతరులకు నగదు కూడా బదిలీ చేయొచ్చు.

డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లో సమస్య వచ్చినపుడు, ఒకే సంస్థలోని కంప్యూటర్లను అంతర్గతంగా పరిశీలన చేసేందుకు రిమోట్‌ డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌లను వినియోగిస్తుంటారు. క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజాలతో పాటు ఎనీడెస్క్‌, టీమ్‌వ్యూయర్‌, రిమోట్‌ డెస్క్‌టాప్‌ ప్రోటోకాల్‌, వర్చువల్‌ నెట్‌వర్క్‌ కంప్యూటింగ్‌ వంటి వాటిని వినియోగిస్తున్నారు. 

ఇలాంటి అనుమతులను పరిమిత అవసరాల మేరకు, నమ్మకస్తులకు, కంపెనీలో నెట్‌వర్క్‌ అధికారులకు మాత్రమే ఇస్తుంటాం కనుక, పెద్దగా ఇబ్బంది ఉండదు. అదీకాక కంప్యూటర్‌లో వ్యక్తిగత సమాచారం తక్కువగానే నిక్షిప్తం చేస్తుంటాం కనుక సమస్యే తలెత్తదు. కానీ మొబైల్ ఫోన్లకు వచ్చే సరికి పరిస్థితి మారిపోతుంది. 

దాదాపు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకునే యాప్‌లన్నీ కాంటాక్ట్‌ నెంబర్లు, ఫొటోలు/వీడియోలు, కాల్స్‌/మెసేజ్‌లకు అనుసంధానం అవ్వడానికి అనుమతి కోరుతుంటాయి. తెలిసీ, తెలియక అన్నింటికీ ఓకే చెప్పి, యూజర్‌ఐడీ- పాస్‌వర్డ్‌ ఇచ్చాక, యాప్‌ పనిచేయడం ప్రారంభం అవుతుంది. 

మనం నమోదు చేసిన యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌లను సంబంధిత యాప్‌ నిర్వాహకులు తమ దగ్గర నమోదు చేస్తుంటారు. ఆ లోపు ఫోన్‌లోనే కొంత సమయం ఇవి ఉంటాయి. యాప్‌ సంస్థ వద్ద నమోదు కాగానే, ఫోన్‌ డేటా నుంచి వాటిని తొలగిస్తుంటారు. 

మొబైల్‌ నుంచి యూజర్‌ఐడీ/పాస్‌వర్డ్‌లను ఆయా యాప్‌లు తొలగించే లోపే, తస్కరించే పనిమీదే ఉండే అనుమానాస్పద యాప్‌లు వాటిని అపహరిస్తుంటాయి. ఇంతేకాక, మన దగ్గర సమాచారం తీసుకునే యాప్‌లు, వాటిని ఎక్కడ నమోదు చేసేదీ కూడా ట్రోజెన్‌లతో వేటాడే నేరస్తులకు తెలుస్తుంది.

సరైన రక్షణ వ్యవస్థలేని యాప్‌ల నుంచీ ఈ సమాచారం తస్కరించే వీలుంది. ఎనీడెస్క్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే, డెస్క్‌టాప్‌ నుంచి మొబైల్‌కు, ఇటు నుంచి అటు డేటాను బదిలీ చేసే వీలుంటుందని సంస్థ ప్రకటిస్తోంది.

ఇలాంటి యాప్‌లలో ట్రోజెన్‌ ఉంటుందని, దీని ద్వారా మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం కూడా అపహరించే ప్రమాదం ఉంటుందని ఎస్బీఐలో సాంకేతిక వ్యవహరాల పర్యవేక్షక అధికారి ఒకరు తెలిపారు.

ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు ఉపయోగపడే యాప్‌లన్నీ, సున్నిత సమాచారాన్ని వినియోగదారుల నుంచి సమీకరిస్తాయి. వీటిని కనుక అపహరిస్తే, బ్యాంక్‌ ఖాతాలోని నగదు కూడా అపహరణకు గురయ్యే ప్రమాదం ఉన్నదని ఆర్బీఐ కూడా హెచ్చరించడం గమనార్హం.

స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే, ఎక్కడినుంచో మన ఫోన్‌ పనితీరును గమనించి, డేటాను తెలుసుకునే వీలు మనమే కల్పించినట్లు అవుతాం. తమ యాప్‌తో నగదు అపహరణకు గురయిందని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తమ సంస్థ ప్రతిష్ఠ దెబ్బతినేలా ప్రచారం జరుగుతోందని ఎనీడెస్క్‌ బదులిస్తోంది.

మొబైల్‌లో కాంటాక్ట్‌లతోపాటు బ్యాంక్‌ ఖాతాలు, డెబిట్‌కార్డ్‌ నెంబర్లు, వాటి పాస్‌వర్డ్‌లను ఎక్కువ మంది నమోదు చేస్తుంటారు. ట్రూకాలర్‌ వంటి కాంటాక్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌తో పాటు దాదాపు అన్ని యాప్‌లు కాంటాక్ట్‌లకు అనుసంధానమయ్యేందుకు మన దగ్గర అనుమతి పొందుతాయి.

అందువల్ల అనుమానాస్పద యాప్‌ల వల్ల ఈ సమాచారం అంతా సులభంగా అక్రమార్కులకు చేరే వీలుంది. వ్యక్తిగతంగా, రహస్యంగా చిత్రీకరించుకున్నామనే భ్రమల్లో సెల్ఫీలు, అవాంఛనీయ చిత్రాలు, వీడియోలను కొందరు తీసుకుంటున్నారు.

అయితే ఇవి హ్యాకర్ల బారిన పడుతున్నాయని డిజిటల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌లోని నోట్‌ప్యాడ్‌లపై నమోదు చేసుకొనే రహస్య వివరాలు సైతం ఎనీడెస్క్‌ లాంటి యాప్‌ల వల్ల అన్యులకు చేరొచ్చు.

కొనుగోళ్లపై భారీ మినహాయింపు ఇస్తామని, అశ్లీల చిత్రాలు తిలకించవచ్చని ఊరించే అంతగా ప్రాచుర్యం లేని యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios