Asianet News TeluguAsianet News Telugu

ప్రతి మనిషికి ఆరోగ్యపట్టిక తయారు చేయనున్న ఆంధ్రప్రదేశ్

వారసత్వ రోగాలను త్వరగా గుర్తించడానికి, అవగాహన  పెంచడానికి హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి డిజిటైజ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం

AP to prepare health profile of every citizen first time in india

రాష్ట్ర పౌరులందరి  ఆరోగ్య పట్టిక (హైల్త్ ఫ్రొఫెల్ ) తయారుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఇలాంటి కార్యక్రమాాన్ని ప్రారంభించడం ఇదే మొదటి సారి. 
పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి దాకా పౌరుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. త్రైమాసిక పద్ధతిలో నివేదికలివ్వాలని కోరారు. 
వారసత్వ రోగాలను త్వరగా గుర్తించడానికి, అవగాహన ఏర్పడటానికి హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి డిజిటైజ్ చేయాలని, అన్ని శాఖలు ఒకే తాటిపై నడవాలని కోరారు. వారసత్వంగా వచ్చే జబ్బులపై అవగాహన కలిగించాలని, ప్రాంతాల వారీగా ఎప్పుడెప్పుడు ఏఏ వ్యాధులు వస్తాయో గత రికార్డులను అనుసరించి బేరీజు వేసి నివారణకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. ముందుగా వ్యాధులో రాకుండా జాగ్రత్తలు పాటించాలని, తరువాత నివారణ కు వెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. ఆరోగ్య సమస్యలు, మానసిక, భౌతిక ఆరోగ్య సమస్యలను విశ్లేషించడానికి కూడా ఉపకరిస్తాయని చెప్పారు. బుధవారం రాత్రి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ సేవలు, పనితీరులో భాగంగా  జిల్లాకు ఒకరు చొప్పున హాజరైన 13 మంది  సర్వీస్ ప్రొవైడర్ల సేవలను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆరోగ్య శాఖ కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. వాతావరణంలో కాలానుగుణ వ్యాధులు, వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నారు. ఇటువంటి సమీక్షలతో సంస్కరణల వల్ల వైద్య ఆరోగ్య రంగం పనితీరు మెరుగుపర్చుకోవచ్చని, దీని ప్రభావం ఎంతో ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. 

 

ఇలాంటి ప్రయోగం భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఇది పూర్తయితే, ప్రతిపౌరుడి ఆరోగ్యం, అనారోగ్య వివరాలన్నీ అరచేతిలో ఉంటాయి. వైద్యం చేయడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సులభమవుంది. ఇది ఆరోగ్యం చరిత్రలో నూతనాధ్యాయం కానుంది.


వైద్య సేవలపై ప్రజల్లో సంతృప్తి శాతం పెంచాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. మూత్ర పిండ రోగాలతో బాదపడుతున్న పేషెంట్లకు అందుతున్న వైద్యం పై ఆరా తీశారు. జాతీయ డయాలసిస్ ప్రోగ్రాం మన రాష్ట్రంలో ఎలా అమలుచేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి డయాలసిస్ కేంద్రాలకు నెఫ్రాలజిస్టులు వెళ్లి డయాలసిస్ తీసుకుంటున్న రోగులను పరిశీలిస్తున్నట్లు అధికారులు వివరించారు. రోగులకు అందిస్తున్న చికిత్స, కేంద్ర సంస్థ ఏర్పాటు తదితర అంశాలపై సమన్వయం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.


కార్యక్రమాల అమలులో అంతరాలు తగ్గించాలని, అన్ని జిల్లాల్లో సమంగా ఫలితాలు సాధించాలన్నారు. ఇండికేటర్ల ఆధారంగా విజయనగరం లాంటి జిల్లాలను పరిశీలిస్తే 30% వ్యత్యాసం కన్పించిందన్నారు. సేవల్లో ఎనభై శాతం  తం సంతృప్తి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గతంలో కంటే ప్రజా సంతృప్తి స్థాయి 70% పెరిగిందని అధికారులు వివరించారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై  సంతృప్తి శాతం పెంచాలన్నారు. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలు మరింత వేగవంతంగా ఉండాలని కోరారు. కాల్ సెంటర్లు నెలకొల్పి సక్రమంగా  పనిచేయించాలన్నారు.  ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని రోజులలో టీకా కార్యక్రమం (ఇమ్యునైజేషన్) నిర్వహించాలని, చికిత్స తర్వాత పేషెంట్ ఫోన్ నెంబర్ తీసుకొని  సంతృప్తిశాతం ఎంత వచ్చిందో తెలుసుకోవాలని సూచించారు. కాగా మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ కింద సబ్ సెంటర్ల స్థాయిలో 819925 మంది మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారని అధికారులు వివరించగా, మరింత విస్తృతంగా సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలని కోరారు. సర్వీసు ప్రొవైడర్లు ఉద్దేశపూర్వకంగా సేవల్లో ఆలస్యం చేస్తే ఉపేక్షించనని, మంచిగా సేవలు సమకూరిస్తే ప్రోత్సహిస్తానని చెప్పారు.  ప్రజల ఆహారపుటలవాట్లు మార్చడానికి చైతన్యం తేవాలన్నారు.  ఏఎన్ఎంలు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షిస్తూ   విశాఖ, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏఎన్ ఎంల సేవలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అందరి దగ్గరా ట్యాబులు ఉండాలన్నారు. 


 ఎన్టీఆర్ వైద్య సేవ సౌజన్యంతో సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు ముఖ్యమంత్రి ని కలిసి తాము ఛాలెంజ్ గా తీసుకుని పనిచేసి రోగవిముక్తులను చేసిన వ్యాధివిజేతలను పరిచయం చేశారు.   కార్పొరేట్ ఆస్పత్రులు తమకు సాధ్యం కాదంటూ వదలివేసిన అత్యంత క్లిష్టమైన కేసులను సవాలుగా తీసుకుని వైద్య చికిత్స అందించిన విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రశంసల్లో ముంచెత్తుతూ  సత్కరించారు. 


వారు చేసిన అరుదైన శస్త్ర చికిత్సల వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కాంజెనిటల్ డిస్ ఫార్మిటీ (congenital disformity)తో బాధపడుతున్న నాలుగు నెలల పసిపాప.    సామర్లకోటలో పేద దంపతులకు జన్మించిన పాపాయికి విశాఖ కేజీ హెచ్‌లో  న్యూరో విభాగం అధిపతి డా. కె సత్యవరప్రసాద్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. తల్లికి  ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా ఈ బిడ్డ

తలభాగం వాపుతో జన్మించగా  సవాలుగా తీసుకుని వైద్యం చేశారు. అలాగే విశాఖ విజిహెచ్ లో ఓవరీ క్యాన్సర్‌ రోగి కనక (40) ని సీఎంకు పరిచయం చేశారు. ఆమెకు   ఆబ్స్ట్రె స్ట్రీషియన్ (obstetrician) కేజీహెచ్ ప్రొఫెసర్ డా. పద్మలీల చికిత్స చేశారు. మరోవైపు అత్యంత క్లిష్టమైన హృద్రోగంతో బాధపడిన  విశాఖ జిల్లా అనంతగిరి బాలుడు (11) ప్రదీప్ రెడ్డి కి ప్రత్యేక పద్ధతిలో చికిత్సచేశారు. కర్నూలు కు చెందిన 22 ఏళ్ల యువతి సాయి ప్రియ గుండెకు రంధ్రం ఏర్పడగా  కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డా. సి ప్రభాకర్ రెడ్డి మినిమల్లీ ఇన్‌వేసివ్ కార్డియాక్ సర్జరీ  (MICS) అనే విధానంలో అత్యంత అధునాతన శస్త్రచికిత్స   చేశారు.  ఇటువంటి శస్త్ర చికిత్స దేశంలో  ఇంతదాకా 10 కార్పొరేట్ ఆస్పత్రుల్లో 3 ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే చేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రులలో 3 mics శస్త్ర చికిత్సలు జరిగాయి. బయట ఈ శస్త్ర చికిత్సకు రూ. 4 నుంచి రూ. 5 లక్షల వ్యయం అవుతుందని వైద్యులు తెలిపారు.  కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడాదిలోనే 130 గుండె ఆపరేషన్లు చేశారు.  వీటిలో బైపాస్ సర్జరీలు, వాల్వు రీప్లేస్‌మెంట్లు, బాలల హృద్రోగ నివారణకు శస్త్ర చికిత్సలు, ఊపిరితిత్తులకు శస్త్ర చికిత్సలు, 
‘ఎన్టీఆర్ వైద్య సేవ’తో అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేసి ప్రభుత్వ ఆస్పత్రుల ప్రతిష్ఠ పెంచారని వైద్య నిపుణులను  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.  శస్త్ర చికిత్సలు అందించిన ప్రభుత్వ వైద్య నిపుణులను శాలువాలతో సత్కరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios