Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీల ప్యానెల్‌లో భిన్నాభిప్రాయాలు!.. సీజేఐకి ఓ లేఖ

సుప్రీంకోర్టు సీనియర్ ఐదుగురు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడినట్టు తెలుస్తున్నది. నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయంపై ఏకాభిప్రాయం కుదరనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీజేఐ యూయూ లలిత్‌కు లేఖ రాయడం గమనార్హం. తన తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని కోరింది. తదుపరి సీజేఐ పేరు ప్రతిపాదించిన తర్వాత ప్రస్తుత సీజేఐ కొలీజియానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోరాదు.

rift between supreme court senior judges panel, a letter to cji from centre
Author
First Published Oct 7, 2022, 1:28 PM IST

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఐదుగురు సీనియర్ జడ్జీల ప్యానెల్‌లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తుల నియామకం విషయమై వీరి మధ్య ఈ భేదాభిప్రాయాలు పొడసూపినట్టు సమాచారం. ఇదే తరుణంలో కేంద్రం నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్‌కు ఓ లేఖ వెళ్లింది.

తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని కేంద్ర న్యాయ శాఖ ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్‌కు లేఖ రాసింది. ఈ విషయాన్ని న్యాయశాఖ స్వయంగా ట్వీట్‌ చేసింది. ఇలాంటి విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేయడం చాలా అరుదు. జస్టిస్ యూయూ లలిత్ తర్వాత సుప్రీంకోర్టులో తదుపరి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్. కొలీజియం నిబంధన ప్రకారం తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియామకం అవుతారు. జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ అవుతారు.

అయితే, ఒక సీజేఐ తన తదుపరి న్యాయమూర్తి పేరును ప్రతిపాదించిన తర్వాత ఆయన కొలీజియానికి సంబంధించిన నిర్ణయాలేవీ తీసుకోలేడు. అంటే.. న్యాయమూర్తుల నియామకాలపై నిర్ణయాలు తీసుకోవడం వీలు కాదు. ఇది నిబంధన. జస్టిస్ ఎన్వీ రమణ విషయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఎన్వీ రమణ సారథ్యంలో ఇద్దరు న్యాయమూర్తుల నియామకాన్ని ఈ రూల్ ప్రస్తావిస్తూనే ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ అడ్డుకున్నట్టు కొన్ని కథనాలు వచ్చాయి.

జస్టిస్ యూయూ లలిత్ సారథ్యంలోని కొలీజియం ఇప్పటి వరకు కేవలం ఒక్క జడ్జీ పేరునే రికమెండ్ చేయడం గమనార్హం.

సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుత కొలీజియం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. ముగ్గురు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లను, ఒక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని ఉద్యోగోన్నతి ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేయాలని సీజేఐ యూయూ లలిత్ భావించినట్టు సమాచారం. దీన్ని సెప్టెంబర్ 30న కొలీజియం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండింది. కానీ, కొలీజియం సభ్యులు ఆ రోజు భేటీ కాలేకపోయారు.

జస్టిస్ చంద్రచూడ్ కేసులు ఎక్కువగా ఉండటం కారణంగా లేట్ ఈవినింగ్ వరకు వాదనలు విన్నారు. తర్వాతి రోజు నుంచి దసరా సెలవులు. మళ్లీ అక్టోబర్ 10వ తేదీన సుప్రీంకోర్టు రీఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి సీజేఐ యూయూ లలిత్ పదవీ కాలం మరో నెలకు తక్కువగానే ఉంటుంది. 

నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలను రాతపూర్వక సర్కులేషన్ ద్వారా చేపట్టాలనే సీజేఐ లలిత్ నిర్ణయం కారణంగా ఐదుగురు సీనియర్ మోస్టు న్యాయమూర్తుల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడినట్టు తెలుస్తున్నది. ఈ ప్రతిపాదన జస్టిస్‌లు చంద్రచూడ్, సంజయ్ కిషన్ కౌల్, కేఎం జోసెఖ్, అబ్దుల్ నజీర్‌లకు చేరాయి. కానీ, ఇందులో ఇద్దరు న్యాయమూర్తులు రాతపూర్వక అభిప్రాయాలు పంచుకోవడంపై అభ్యంతరం తెలిపారు. ఏకాభిప్రాయానికి సంప్రదింపులతో రావాలని, రాతపూర్వకంగా అభిప్రాయాలు ఇవ్వడం సరికాదని వారు అభిప్రాయపడినట్టు సమాచారం. అంతేకాదు, అత్యున్న రాజ్యాంగ కార్యాలయంలో నియామకం లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం సర్క్యులేషన్ ద్వారా చేపట్టరాదని వారు రాసినట్టు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios