Karnataka : తండ్రి వంటమనిషికి... కొడుకు ఆమె కూతురికి..: ప్రజ్వల్ మాత్రమే కాదు రేవణ్ణ అలాంటోడేనట..
లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బిజెపితో జతకట్టి ఎన్నికలకు వెళుతున్న జెడిఎస్ ను అధినేత దేవెగౌడ కుటుంబసభ్యుల లైంగిక వేధింపుల వ్యవహారం చిక్కుల్లోకి నెడుతోంది.
బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనంగా మారింది. అతడు చాలామంది మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి... ఇందుకు సంబంధించినవంటూ కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ప్రజ్వల్ మహిళలతో వున్న వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
అయితే తాజాగా ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి రేవణ్ణపై కూడా లెంగిక వేధింపులు కేసు నమోదయ్యింది. రేవణ్ణ తనను, అతడి కొడుకు ప్రజ్వల్ తన కూతురిని లైంగిక వేధించేవారని వారి ఇంట్లో పనిచేసే వంటమనిషి ఆరోపిస్తోంది. తాజాగా ప్రజ్వల్ వ్యవహారం బయటపడటంతో ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు సదరు మహిళ తెలిపింది. దీంతో ఇప్పటికే కొడుకుపై లైంగిక వేధింపుల కేసు నమోదవగా తాజాగా తండ్రిపైనా కేసు నమోదయ్యింది.
రేవణ్ణ భార్య భవానితో బంధుత్వం కలిగిన ఓ మహిళ ఇటీవలే వారి ఇంట్లో వంటమనిషిగా చేరింది. అయితే తనపై రేవణ్ణ లైంగికంగా వేధిస్తున్నాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు ప్రజ్వల్ రేవణ్ణ కూడా తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. తన కూతురికి వీడియో కాల్ చేసి ప్రజ్వల్ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని సదరు వంటమనిషి ఆవేదన వ్యక్తం చేసింది.
లైంగిక వేధింపుల విషయం బయటపెట్టిన తనకు ప్రాణహాని వుందని రేవణ్ణ ఇంటి వంటమనిషి ఆందోళన చెందుతోంది. తనతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరుతోంది.
ప్రజ్వల్ లైంగిక వేధింపుల వ్యవహారమేంటి?
కర్ణాటక రాజకీయాల్లో జనతాదళ్ సెక్యులర్ (JDS)ది కీలకపాత్ర. జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ హవా ఎక్కువగా వుండే కర్ణాటక రాజకీయాల్లో అప్పుడప్పుడు జెడిఎస్ కింగ్ మేకర్ గా మారుతుంది. ఇలా గతంలో జేడిఎస్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటుచేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జెడిఎస్ బాగా దెబ్బతింది... దీంతో ఈ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఎన్డిఏలో చేరిన జేడిఎస్ హసన్ ఎంపి అభ్యర్థిగా మళ్లీ ప్రజ్వల్ నే బరిలోకి దింపుతోంది.
కర్ణాటకలో లోక్ సభ పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రజ్వల్ కు చెందిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. మహిళలతో అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హసన్ జిల్లాలోని చాలామంది మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నాడు అనేది ఈ సోషల్ మీడియా వీడియోల
సారాంశం. అయితే ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవిగా ప్రజ్వల్ పేర్కొంటున్నారు... తన ఇమేజ్ డ్యామేజ్ చేసి ఎన్నికల్లో ఓడించడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ మేరకు అతడు హొలెనరసాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
కానీ కర్ణాటక కాంగ్రెస్ మహిళా విభాగం మాత్రం ప్రజ్వల్ వీడియోలను సీరియస్ గా తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రజ్వల్ వీడియోలపై విచారణ జరపాలని... నిజంగానే తప్పు చేసాడని తేలితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ నాగలక్ష్మి కూడా ప్రజ్వల్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సీం సిద్దరామయ్యకు లేఖ రాసింది. దీంతో స్పందించిన సీఎం రాష్ట్ర సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ బిజయ్ సింగ్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటుచేసారు.
ఇలా సిట్ ఏర్పాటు ప్రకటన వెలువడగానే ప్రజ్వల్ దేశం విడిచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం జర్మనీలో వున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి తప్పు చేయకుంటే ప్రజ్వల్ విదేశాలకు ఎందుకు పారిపోయారు? ఇదిచాలు అతడు తప్పు చేసాడని నిర్దారించవచ్చని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. జేడిఎస్ మిత్రపక్షం బిజెపి కూడా ప్రజ్వల్ వీడియోలపై సిట్ విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటోంది.