Amit Shah Deep Fake Video : తెలంగాణ సీఎం రేవంత్ పై పెట్టిన కేసులివే... ఎన్నేళ్ల జైలుశిక్షో తెలుసా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడుప్రచారం చేస్తున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఆయనపై పెట్టిన సెక్షన్లను పరిశీలిస్తే ఎన్నేళ్ల జైలుశిక్ష, జరిమానా వుంటుందో తెలుసా...
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు వీడియోను ఎడిట్ చేసి అమిత్ షా రిజర్వేషన్లను తీసివేస్తామని మాట్లాడినట్లుగా రూపొందించారు. ఈ ఫేక్ వీడియో తెలంగాణ కాంగ్రెస్ పనేనని గుర్తించిన డిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదుతో అమిత్ షా ఫేక్ వీడియోపై డిల్లీ స్పెషల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో ఏప్రిల్ 23న తెలంగాణ పర్యటించిన సమయంలో అమిత్ షా మాట్లాడినప్పటిగా గుర్తించారు. రాజ్యాంగానికి విరుద్దంగా కల్పించిన మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షాను మాట్లాడారు... కానీ మొత్తం రిజర్వేషన్లనే రద్ద చేస్తామని అన్నట్లుగా వీడియో సృష్టించారు.
అమిత్ షా ఫేక్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో టిపిసిసి అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసారు. ఐటీ చట్టం సెక్షన్ 66సి తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) 153, 153ఏ, 465, 469, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు డిల్లీ పోలీసులు. ఈ సెక్షన్లు ఎలాంటి నేరాలను సూచిస్తాయి... ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం.
ఐపిసి సెక్షన్ 153 :
ఉద్దేశపూర్వకంగా ఇతరులను రెచ్చగొట్టేలా వ్యవహరించడం... తద్వారా అల్లర్లను సృష్టించేలా కుట్రలు చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసులో మూడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశాలుంటారు.
ఐపిసి సెక్షన్ 153ఏ :
మనుషులు, సమూహాల మధ్య వైషమ్యాలు, విబేధాలు సృష్టించేలా వ్యవహరించినా, మాట్లాడినా ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. వివిధ మతాలు, జాతులు, భాష, ప్రాంతీయ సమూహాలు, కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. దీని కింద ఏడాది జైలు శిక్ష, జరిమానాావిధించే అవకాశం వుంటుంది.
ఐపిసి సెక్షన్ 465 :
వ్యక్తులు లేదా సంస్థల పరువు తీసేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ రికార్డులు ఫోర్జరీ చేసి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ కేసు పెడతారు. దీని కింద మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
ఐపిసి సెక్షన్ 465 :
ఎవరి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఫోర్జరీ చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఇది పూర్తిగా హక్కులకు సంబంధించినది. ఇది బెయిలబుల్ నేరం. గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.
ఐపిసి సెక్షన్ 171జి :
ఇది ఎన్నికలకు సంబంధించిన సెక్షన్. ఓటర్లను ప్రభావితం చేసేలా, ఎన్నికల ఫలితాన్నిఎఫెక్ట్ చేసేలా తప్పుడు ప్రచారం చేస్త ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. దీని కింద కేవలం జరిమానా విధిస్తారు... శిక్ష వుండదు.
ఐటీ యాక్ట్ సెక్షన్ 66సి :
ఆన్ లైన్ లో మోసపూరితంగా వ్యవహరించిన వారిపై ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. ఇతరుల పరువుకు భంగం కలిగించినా, తప్పుడు ప్రచారం చేసినా ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. మూడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం వుంటుంది.
తెలంగాణ సీఎం రేవంత్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నె సతీష్ కు కూడా డిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. మే 1 న విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కోరినట్లు సమాచారం. అయితే తనకు డిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రేవంత్ ఘాటుగా స్పందించారు. బిజెపిని ప్రశ్నిస్తున్నందుకే తనకు నోటీసులు ఇచ్చారన్నారు. ఎన్నికల రాగానే ఈడి, ఇన్ కమ్ ట్యాక్స్, సిబిఐ వస్తుంటారని... ఇప్పుడు డిల్లీ పోలీసులు వచ్చారన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు తెలంగాణ సీఎంను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు... కానీ ఇలాంటివాటికి తాను భయపడే రకం కాదన్నారు రేవంత్ రెడ్డి.