Asianet News TeluguAsianet News Telugu

ఆర్టికల్ 370 రద్దుకు... బిజెపి 370 సీట్ల టార్గెట్ కు సంబంధమిదే..: ప్రధాని మోదీ ఆసక్తికర  కామెంట్స్

లోక్ సభ ఎన్నికల వేళ గత పదేళ్ల పాలనను ప్రజలకు వివరిస్తూ మరోసారి తమను గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుతున్నారు. ఈ క్రమంలోనే బిజెపి 370 టార్గెట్ పై మోదీ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

PM Narendra Modi Comments on  BJP 370 and NDA 400  Target in Lok Sabha Elections 2024 AKP
Author
First Published Apr 29, 2024, 1:25 PM IST

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తవగా ఇంకా ఐదు విడతల పోలింగ్ జరగాల్సి వుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు, రోడ్ షో లు, బహిరంగ సభల్లో పాల్గొంటూ బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత పదేళ్ల ఎన్డిఏ పాలనలో జరిగిన అభివవృద్ది, ప్రజా సంక్షేమాన్ని వివరిస్తూ మరోసారి ఆశీర్వదించాలని మోదీ కోరుతున్నారు. ఇలా జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టిన నరేంద్ర మోదీ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ప్రధాని  మోదీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

బిజెపి 370 టార్గెట్ ఎందుకు? 

బిజెపి పార్టీ 370, ఎన్డిఏ 400 కు పైగా లోక్ సభ సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది... ఇంత భారీ మెజారిటీ సాధిస్తే పార్లమెంట్ లో అనుకున్నది చేయవచ్చు. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నదే బిజెపి లక్ష్యం... అందువల్లే ఇంత భారీ మెజారిటీని కోరుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే ప్రశ్న ప్రధాని మోదీకి ఎదురయ్యింది... దీంతో ఈ టార్గెట్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించారు. 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70కి పైగా ర్యాలీలు, రోడ్ షో లతో పాల్గొన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల అభిమానం, ప్రేమను పొందుతున్నాను... కాబట్టి బిజెపి లక్ష్యం సాధ్యమేనని తేలిపోయింది. ప్రజా మద్దతు చూస్తుంటే ఎన్డిఏకు 400 పైగా సీట్లు ఖాయమనే నమ్మకం మరింత పెరిగిందని మోదీ తెలిపారు. 

దేశ ప్రజల సెంటిమెంట్స్ నుండే బిజెపి లక్ష్యాలు ఏర్పడ్డాయని మోదీ తెలిపారు. గత పదేళ్లలో దేశంలో జరిగిన మార్పును ప్రజలు గమనించారు... ఇకపై కూడా ఇలాంటి పాలనే వుండాలని కోరుకుంటున్నారు.. అలా జరగాలంటే మళ్ళీ ఎన్డిఏను గెలించాలని నిశ్చయించుకున్నారు. ఇలా తమ భవిష్యత్ బావుండాలంటే గతంలో కంటే బంపర్ మెజారిటీతో బిజెపిని గెలిపించాలి... అందుకోసమే ప్రజలు 'అబ్ కి బార్, 400 పార్' నినాదం ఎత్తుకున్నారని మోదీ తెలిపారు. 

ఇక బిజెపి 370 సీట్ల టార్గెట్ వెనక కూడా ప్రత్యేక కారణం వుందని మోదీ తెలిపారు. బిజెపి కార్యకర్తలు ఆర్టికల్ 370 రద్దు కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాడారు... ఇది మాకు చాలా ఎమోషనల్ అంశం. ప్రజల కోరిక మేరకు ఈ ఆర్టికల్ ను తమ ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా ఆర్టికల్ 370 రద్దుచేసిన బిజెపికి 370కి పైగా సీట్లు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు... వారే తమ టార్గెట్ ను నిర్ణయించారని మోదీ తెలిపారు. ఇలా ప్రజలే స్వతహాగా ఓ రాజకీయ పార్టీకి టార్గెట్ ఫిక్స్ చేయడం ఇదే తొలిసారి...  ఆ అదృష్టం బిజెపి నేతృత్వంలోనే ఎన్డిఏ కు దక్కడం ఆనందంగా వుందని నరేంద్ర మోదీ తెలిపారు. 

రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రచారంపై మోదీ... 

మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అధికారం దక్కకపోవడంతో నిరాశ చెందిన ప్రతిపక్షాలు ప్రపంచ వేదికపై దేశ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వారు మన ప్రజలు, ప్రజాస్వామ్యం మరియు సంస్థల గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. 

 కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓ అద్భుతాన్ని ఆశిస్తోంది... అదే ఎన్నికల్లో విజయం సాధించాలని. కానీ ఆ అద్భుతం జరగదని వారికీ తెలుసు. ఆ పార్టీ సీనియర్లు, ముఖ్య నాయకులు కూడా ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. 2024 ఎన్నికల్లో ప్రజల నుండి అపూర్వమైన మద్దతు వస్తోంది.దీంతో గెలుపుపై ​​పూర్తి నమ్మకంతో ఉన్నాం... దక్షిణాదిలో కూడా బిజెపి సత్తా చాటుతుంది. అక్కడ ఓట్ల శాతం, సీట్ల వాటా కూడా పెరుగుతుందని మోదీ తెలిపారు. 

అయితే బిజెపికి పరిపూర్ణ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అత్యధిక సార్లు ఆ పని చేసిన పార్టీ ఆరోపించడం విడ్డూరంగా వుందన్నారు మోదీ. కానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా నా ట్రాక్ రికార్డ్ ను పరిశీలిస్తే ఓ విషయం అర్థమవుతుంది... ఎప్పుడూ రాజ్యాంగబద్దంగానే పని చేసానని. అలాంటిది నేను రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనతో వున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని మోదీ తెలిపారు. 

యూనిఫాం సివిల్ కోడ్ బీజేపీ ప్రధాన ఎజెండా : 

వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫాం సివిల్ కోడ్ అమలు తమ అజెండాగా మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలపై ఎన్నికల ప్రభావం ఎక్కువ... ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎన్నికలు వస్తూనే ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే అధికారంలో ఉన్న పార్టీ ప్రాధాన్యత. ఇది భారతదేశ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. ఇది చాలా ఆందోళనకరం. అందువల్లే ఒకే దేశం ఒకే ఎన్నిక అంశాన్ని తెరపైకి తెచ్చాం. దీనిపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసాం. ఈ కమిటీ ఇప్పటికే నివేదికను సిద్ధం చేసింది... ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు.

బిజెపి ప్రధాన ఎజెండాలో యూనిఫాం సివిల్ కోడ్ కూడా ఒకటని ప్రధాని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు దీన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నాయి. యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది.  దేశవ్యాప్తంగా యూసిసి అమలుకు కట్టుబడి వున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేసారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios